
కలకలం రేపిన ‘చిన్నారి’ తల్లి
నిజాంసాగర్/పిట్లం, న్యూస్‌లైన్: చదువులమ్మ ఒడిలో ఉన్న విద్యార్థిని మగశిశువుకు జన్మనిచ్చి న సంఘటన జిల్లాలో కలకలం రేపింది. కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఈ సంఘటన జరగడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రు లు ఆందోళనకు గురయ్యారు. వే కువజామున నిద్ర లేచిన విద్యార్థినులు స్నానాల గదిలోకి వెళ్లినపుడు అక్కడక్కడ రక్త మరకలు కనిపించాయి. వారు వెంటనే ఉపాధ్యాయినులకు తెలిపారు. దీంతో అక్కడ కలకలం చెలరేగింది. పాఠశాల పక్కనే ఉన్న ముళ్లపొదల్లో పసికందు ఏడుపును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అటు బాలిక తల్లిదండ్రులు కూడా హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. పోలీసులు బాలికను, శిశువును ఆస్పత్రికి తరలించి విచారణ ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. బాలిక గర్భం దాల్చడం, మగబిడ్డకు జన్మనివ్వడం వరకు ఏదీ గుర్తించలేకపోయిన అధికారులు మాత్రం విద్యార్థినులకు ధైర్యం చెప్పడం గమనార్హం.
ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ప్రసవించిన ఘటనలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం ఉందంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు ది గారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ మండల అద్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న బాలిక ప్రసవించేంత వరకు సిబ్బంది గమనించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏఎన్‌ఎంకు కూడ విద్యార్థి పరిస్థితి తెలియకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. గతంలో కూడా పాఠశాలలో సరైన ఆహారం అందక విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై తగు చర్య లు తీసుకోవాలని కోరారు. ధర్నాలో ఏబీవీపీ నాయకులు ఉదయ్, తానాజీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు జగదీష్, టీఆర్‌ఎస్ నాయకులు నర్సాగౌ డ్ మద్దతు ప్రకటించారు.
దోషులను కఠినంగా శిక్షించాలి
తెయూ (డిచ్‌పల్లి): పిట్లం కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను గర్భవతిని చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం క్యాంపస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో బాలికలపై లైంగిక దాడుల ఘటన మరవక ముందే జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం శోచనీయమన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట టీజీవీపీ నాయకులు సంతోష్, నాగరాజు, లాల్‌సింగ్, సురేశ్ తదితరులు ఉన్నారు.
పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి
శివాజీనగర్: పిట్లం కస్తూర్బా గాంధీ పాఠశాలలో జరిగిన సంఘటనపై మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బాలిక గర్భ వతి అయ్యేంత వరకు సిబ్బంది ఏమి చేశారని ఆమె ప్రశ్నించారు. నిర్భయ చట్టం వచ్చిన తరువాత కూడా మహిళలపై ఇలాంటి అత్యాచారాలు జరగడం సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.