సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువ ఆధునీకరణ సాగుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనం.. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం వెరసి కాలువ పనులను పట్టిం చుకునేవారే కరువయ్యారు. కాలువ ఆధునీకరణకు నిధులు మంజూరై నాలుగేళ్లయినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. సాక్షాత్తు భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖకు మంత్రి సుదర్శన్‌రెడ్డి సొంత జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధానకాలువ ఆధునీకరణ పనుల పరిస్థితి ఇలా ఉంటే .. రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్మాణ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 2.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు నిజాంసాగర్ కాలువ నుంచి నీరందాల్సి ఉండగా, ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరందుతోంది. అంతేకాకుండా ఏటా ఆయకట్టు గణనీయంగా తగ్గుతోంది.
కాలువ శిథిలావస్థకు చేరడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ప్రధాన కాలువ ఆధునీకరణ కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి రూ. 549.5 కోట్లు మంజూరు చేశారు. ఆధునీకరణ పనులను ప్రారంభిస్తూ 2009లో అచ్చంపేట వద్ద శిలాఫలకం వేశారు. ఈ పనులను జిల్లా నీటిపారుదల శాఖ 15 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఒకటో, ఎనిమిదవ ప్యాకేజీ పనులకు సంబంధించిన టెండర్లు సకాలంలో పూర్తి కాలేదు. దీంతో ఆధునీకరణ పనులకు విఘాతం కలిగింది. మిగతా 13 ప్యాకేజీల పనులకు టెండర్లు పూర్తయినా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. చివరికి ఒకటో, ఎనిమిదో ప్యాకేజీలకు టెండర్లు ఖరారు కావడంతో ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు పనులను అగ్రిమెంట్ చేసుకున్నారు. అయినప్పటికీ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. బుంగలతో రైతాంగానికి బెంగ.. కాలువ ఆధునీకరణ పనుల జాప్యం రైతులకు శాపంగా మారింది. ప్రాజెక్టు నిర్మిం చిన సమయంలో 3 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా 155 కిలో మీటర్ల మేర ప్రధాన కాలువను నిర్మించారు.
ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట గండ్లు పడుతూ వేలాది ఎకరాలకు అందాల్సిన సాగు నీరు వృథా అవుతోంది. బుంగలు పడిన సమయంలో నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కాగా, ఆధునీకరణ పనులు మార్చి, ఏప్రిల్, మే, జూన్ లేదా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ల్లోనే చేపట్టాల్సి ఉంది. ఈ సమయంలో నీటి విడుదల కోసం రైతులు ఆందోళన చేయడం.. పనులు సాగుతున్నాయని కాంట్రాక్టర్లు నీటి విడుదలను వ్యతిరేకించడంతో సంబంధిత అధికారులు సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువ ఆధునీకరణ పనులు 15 ప్యాకేజీలుగా విభజించి.. పనులు ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రధాన కాలువకు మొదటి ఆయకట్టు ప్రాంతంలోని ఒకటో ప్యాకేజీ, ఎనిమిదవ ప్యాకేజీల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సకాలంలో రాకపోవడంతో ఆలస్యమయ్యాయి. దీంతో ప్రధాన కాలువ మొదటి ప్యాకేజీ పరిధిలో 10 కిలోమీటర్ల దూరం గల కాలువ కట్టకు ముళ్ల పొదల తొలగింపు పనులు జరిగాయి. ఎనిమిదో ప్యాకేజీ పరిధిలో కాలువ కట్టకు మట్టితో బలోపేతం పనులకు ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి సాగర్ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులు వేగంగా పూర్తి చేయించాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు.