సీసీ కెమెరాకు చిక్కిన చిరుత
కెమెరాకు చిక్కిన ఆనవాళ్లు.. చిరుతతోపాటు హైనా కూడా..
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి మండల పరిధిలోని జనారణ్యంలో కల కలం సృష్టిస్తున్న చిరుత ఆనవాళ్లను అటవీఅధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఇంద్రకరణ్ గ్రామ శివారు పంటపొలాల్లో సంచరిస్తున్న చిరుత సీసీ కెమెరాలకు చిక్కింది. చిరుతతోపాటు మరో రెండు అటవీ జంతువులు కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పాదముద్రలు సేకరించిన అధికారులు.. వీటి ఆధారంగా ఇక్కడ సంచరిస్తున్నది చిరుతపులి అని అంచనాకు వచ్చి ఆ ప్రాం తంలో సీసీ కెమెరాలు అమర్చారు. రెండు చోట్ల బోన్లు పెట్టి వాటిలో ఎరగా సజీవం గా మేక పిల్లను ఉంచారు. గురువారం ఉదయం మల్లారెడ్డి చెరకు తోట వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా చిరుతపులి చిత్రాలను తీసింది.
నరహరిరెడ్డి గొర్రెల ఫాం వద్ద ఏర్పాటు చేసిన రెండో సీసీ కెమెరాకు బుధవారం రాత్రి 9.08 గంటలకు హైనాను పోలిన జంతువు చిక్కింది. బోను ముందు నుంచే నడుచుకుంటూ వెళ్తున్న జంతువు చిత్రాలను సీసీ కెమెరా తీసింది. ఇంతకు ముందు లభించిన పాదముద్రలను, తాజా గా దొరికిన చిత్రాలను అటవీ అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే పొలాల్లో తిరగుతున్నది చిరుతే అని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మిగిలిన జంతువును ఇంకా నిర్ధారించాల్సి ఉంది. త్వరలోనే వాటిని బంధిస్తామని, ప్రజలు భయపడొద్దని, పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని డీఎఫ్‌వో శివయ్య తెలిపారు.