లాక్‌డౌన్‌: మాకు చాన్సొచ్చింది | Lockdown: Wild Animals Take Over The Roads And Streets | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: మాకు చాన్సొచ్చింది

Published Sat, Apr 11 2020 7:02 AM | Last Updated on Sat, Apr 11 2020 8:35 AM

Lockdown: Wild Animals Take Over The Roads And Streets - Sakshi

పులి గాండ్రిస్తుంది. సింహం గర్జిస్తుంది.  ఏనుగు ఘీంకరిస్తుంది. మనిషి? మనిషి.. ‘హారన్‌’ కొడతాడు! గాండ్రించే పులి కూడా గర్జించే సింహం కూడా ఘీంకరించే ఏనుగు కూడా ‘హారన్‌’కు అదిరిపడతాయి. లాక్‌డౌన్‌తో ఇప్పుడు హారన్‌ సౌండ్‌ లేదు. వన్యప్రాణులకు పీస్‌ ఆఫ్‌ మైండ్‌! మనిషి ‘లోపల’ ఉన్నాడు కదా. ఇప్పుడు వాటికి చాన్సొచ్చింది. లోపల్నుంచి బయటికొస్తున్నాయి!

జలంధర్‌ నుంచి కనిపిస్తున్న ధౌలాధర్‌ కొండలు
ఒక్క జంతువులు, పక్షులేనా! నింగి నాట్యమాడుతోంది. నేల విహంగమౌతోంది. చంద్రుడు తెల్లటి గడ్డ పెరుగు. సూర్యుడు మరికొన్ని ఎల్యీడీల వెలుగు. అద్దం తుడిచినట్లు నదులు. కడిగి బోర్లించిన గిన్నెల్లా కనుచూపు కొండలు. బాగుంది కవిత్వం. బ్యాంకుల్లో డబ్బులేవి? బియ్యం డబ్బాల్లో నిల్వలేవి? ఆఫీస్‌లలో కొలువులేవి? వేసవికి సెలవులేవి? కరువు, కవిత్వం ఎప్పుడూ ఉండేవే. లౌక్‌డౌన్‌కు ముందు మాత్రం.. జీవితంలో అది లేదని, ఇది లేదని నోరు చప్పరించలేదా? ఇన్నాళ్లూ ప్రకృతిని బోనులో ఉంచి మనం విహరించాం. ఈ కొన్నాళ్ల బందిఖానా నుంచి ప్రకృతి  వింతలను వినోదిద్దాం.

పునుగుపిల్లి, కోళికోడ్‌ 
మార్చి 25 అర్ధరాత్రి నుంచి మన దగ్గర లాక్‌డౌన్‌ మొదలైంది. దేశానికి 1947లో అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చినట్లే.. నేచర్‌కీ ఇది అర్ధరాత్రి స్వతంత్రం! పది రోజులు గడిచాయి. స్వాతంత్య్రం ఎంత స్వేచ్ఛను ఇస్తుందో ఒక్కో ప్రాణీ మనకు చూపించడం మొదలైంది. ఉత్తరాఖండ్‌లో మూడు సంబార్‌ జాతి జింకలు వీధిల్లోకి వచ్చాయి. తప్పిపోయినట్లు రాలేదు. తాపీగా రొడ్డెక్కాయి. నోయిడాలో నీలంరంగు ఎద్దు (నీల్‌గాయ్‌) తోకను ఆడించుకుంటూ, చేతులు వెనక్కు పెట్టుకుని నెమ్మదిగా.. ‘దారంతా నాదే’ అని నడుస్తున్న మనిషిలా తిరిగింది. డెహ్రాడూన్‌లో గజరాజు షికారు కొట్టింది. కోళికోడ్‌లో చిన్న పునుగుపిల్లి.. ‘ఏమైపోయారు ఈ మనుషులంతా..’ అనో ఏమో.. వెనక్కు చూసుకుంటూ ముందుకు వెళ్లింది. ఆలివ్‌ ‘రిడ్లే’ తాబేళ్లు ఒడిశా బీచ్‌ అలలపై జారుడుబండ ఆడాయి! కర్ణాటకలో ఒక అడవి దున్న మార్కెట్‌లోకి వచ్చింది. ముంబై వీధుల్లో నెమళ్లు నాట్యమాడాయి. పాట్నా దగ్గరి వైమానిక స్థావరంలో చిరుత ఒకటి తిండి మాని మరీ ఆటలు ఆడింది. తిరుపతి ఘాట్‌రోడ్‌లలో లేళ్లు గంతులేశాయి. ఏటూరు నాగారంలో ఎలుగుబంట్లు అభయారణ్యం నుంచి కంచె దాకా వచ్చి ‘వాటీజ్‌ హ్యాపెనింగ్‌! డప్పుల్లేని లోకంలోకి వచ్చిపడ్డామా’ అని జిల్లా పారెస్టు ఆఫీసర్‌ల వైపు చూశాయి.

సంబార్‌ జింకలు, ఉత్తరాఖండ్‌ 
లాక్‌డౌన్‌తో బయటికి వస్తున్న వాటిలో కొన్ని అరుదైన జీవులు. కొన్ని అంతరించిపోతున్న జీవులు. సంబార్‌ జాతి జింకలు బలంగా ఉంటాయి. సంఖ్యలో మాత్రం బలహీనం. ‘రెడ్‌ లిస్ట్‌’లో ఉన్నాయి. పులుగులు, ఎలుగులు, రిడ్లే తాబేళ్లు కదలికలు ఉండేవీ కానీ అస్తమానం కనిపించేవి కావు. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, పోలండ్, ఇంగ్లండ్‌లోనూ అడవుల నుంచి జంతువులు బయటికి వస్తున్నా.. ఇంత పెద్ద దేశంలోని నూటా ముప్పై కోట్ల జనాభా ఒక్కసారిగా ఇళ్లలోనే లాక్‌ అయిపోవడంతో, మన మూగజీవులకు పెద్ద బ్లాక్‌ తొలగిపోయింది. ఎం.ఎస్‌.రామారావు గారు పాడినట్లు.. ‘ఈ విశాల, ప్రశాంత, ఏకాంత..’ లాక్‌డౌన్‌లో మనుషులు నిదురిస్తుంటే.. జంతు ప్రపంచం ఒళ్లు విరుచుకుని లేస్తోంది.

నీల్‌గాయ్, నోయిడా  
జలంధర్‌లో ఈమధ్య ఉదయాన్నే నిద్రలేచి బాల్కనీలోకి వచ్చినవాళ్లు దూరంగా కనిపిస్తున్న ధౌలాధర్‌ కొండల్ని చూసి షాక్‌ తిన్నారు. రాత్రికి రాత్రి ఇంటి ముందుకు కొండ వచ్చేస్తే అలాగే ఉంటుంది మరి. గత ముప్పై ఏళ్లుగా పరిశ్రమల కాలుష్యంలో మసకబారి క్రమంగా అదృశ్యం అయిపోయిన ఆ కొండలు ఈ లాక్‌డౌన్‌లో క్లీన్‌ అయి కళ్లముందుకు వచ్చాయి. దేశంలో ఇంకా చాలా కాలుష్యాలు తగ్గిపోయాయి. ఢిల్లీ, మిగతా మెట్రో నగరాలు వానొచ్చి కడిగేసినట్లుగా అయ్యాయి. బెంగళూరులో ప్రాణవాయువు నాణ్యత పెరిగింది. గంగా యమునా నదీ జలాలు తేటపడ్డాయి. ‘ఆశ్చర్యం’ అంటున్నారు డాక్టర్‌ పి.కె.మిశ్రా. వారణాసిలోని ఐఐటిలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ ఆయన. ‘యమున’ గురించైతే ‘అన్‌బిలీవబుల్‌.. బట్‌ ట్రూ’ అంటుంటోంది కేంద్ర ‘జలశక్తి’ మంత్రిత్వశాఖ. పరిశమ్రలు, కర్మక్రియలు ఆగిపోయి నదులు ప్రక్షాళన అయ్యాయి. అంతా మన మంచికే అనుకోవడం నిర్వేదం కాదు, జీవనవేదం కాదు. వాస్తవం. పరుగుల జీవితంలోని ఈ తాత్కాలిక విరామంలో మన ఇళ్లూ, ఒళ్లు కూడా శుభ్రం అవుతున్నాయి. అవనిద్దాం. అవని చోటును అవనికే ఉంచేద్దాం. 

తేటపడిన ‘యమున’ : వజీరాబాద్‌ బ్యారేజ్, నార్త్‌ ఢిల్లీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement