
శేషాచలంలో మూగవేదన...
ప్రమాదాల్లో అరుదైన జాతుల మృత్యువాత
ఏటా పెరుగుతున్న ప్రమాదాలు
వన్యప్రాణి సంరక్షణ పట్టని టీటీడీ ఫారెస్ట్ విభాగం
తిరుమల : ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న సామెత తిరుమల శేషాచలానికి చక్కగా సరిపోతుందేమో?. అరుదైన జంతుజాతులకు శేషాచలం ఆవాసమని అధికారులు ఊదరగొడుతున్నా.. ఆ స్థాయిలో వాటి సంరక్షణ గురించి పట్టించుకోవడంలేదు. ఫలితంగా తిరుమలకొండ రెండు ఘాట్లలో రోజూ అనేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి. క్రమంగా ఈ జంతుజాతులు క్షీణదశకు చేరుకుంటున్నాయన్న సత్యాన్నీ అధికారులు గుర్తించలేకపోతున్నారు.
మృత్యువాత
తిరుమల కొండ రెండు ఘాట్ రోడ్లలోనూ శ్రీవారి దర్శనం కోసం రోజూ 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వేకువజాము 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలవరకు వాహనాలు క్షణం కూడా సమయం ఇవ్వకుండా ప్రయాణిస్తుంటాయి. మిగిలిన మూడు గంటలూ టీటీడీ, ప్రభుత్వ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి.
మలుపులతో కూడిన ఈ రెండు ఘాట్‌రోడ్లలోనూ ఆహారాన్వేషణ కోసం అటుఇటు రోడ్లు దాటుతున్న జంతుజాతులు వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. ఇందులో చిరుతలు, జింకలు, దుప్పులు, పునుగు, పందులు, ముళ్లపందులు, గండ్రంగులు (కొండముచ్చులు) ఉన్నాయి. రోజూ 0.5 నుంచి 1 శాతం వరకు జంతువులు ప్రమాదాల బారినపడుతున్నట్లు నిపుణులు గతంలోనే లెక్కగట్టారు.
రక్షణ చర్యలపై టీటీడీ ఫారెస్ట్ తీవ్ర నిర్లక్ష్యం
టీటీడీ పరిధిలోని జంతుజాతుల రక్షణపై సంబంధిత విభాగం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రక్షణకు పెద్దపీట వేస్తున్న అధికారులు జంతువుల విషయంలో మాత్రం శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. ‘ఆ.. జంతువులే కదా.. ఒకటి చనిపోతే మరొకటి పుట్టుకొస్తుందిలే?’ అన్నధోరణితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.
అటకెక్కిన సిఫారసులు
జంతు మరణాలు తగ్గించేందుకు రెండు ఘాట్‌రోడ్లలోనూ ఇనుప కంచె నిర్మించాలని నిర్ణయించారు. అదే సందర్భంలో రోడ్లు కింది భాగంలో జంతువులు అటుఇటు తిరిగేలా ప్రత్యేకంగా కల్వర్టులు కూడా నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో ఏ ఒక్కటి అమలు కాలేదు. దీనివల్ల జంతు మరణాలు పెరుగుతున్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణతోపాటు అరుదైనజంతుజాతుల భవిష్యత్ మనుగడ కోసమైన ప్రస్తుత టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అయినా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకృతి ప్రేమికులు విజ్ఞప్తి చేశారు.
అమలుకాని వన్యప్రాణి చట్టం
ఐదున్నర హెక్టార్ల విస్తీర్ణంలోని తిరుమల శేషాచల అటవీ ప్రాంతమంతా శ్రీవేంకటేశ్వర అభయారణ్యం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ అరుదైన జంతుజాతులు ఉన్నాయి. దేవాంగపిల్లి, పునుగుపిల్లి, బంగారు బల్లి, చుక్కల జింక, కృష్ణజింక, అడవిగొర్రె, కణితి, దుప్పులు, రేసుకుక్కలు, ఎలుగుబంట్లు, చిరుతపులులు ఉన్నాయి. వీటితోపాటు నెమళ్లు, పాలపిట్ట, తోక పిట్టలు, అడవి కోళ్లు వంటి వేలాది రకాల ఎన్నెన్నో అరుదైన జాతులకు ఈ అటవీప్రాంతం కేంద్రంగా ఉంది.
వీటిలో చాలావరకు అంతరించే దశలో ఉన్నాయి. వీటి సంరక్షణ కోసం ఫారెస్ట్ విభాగం కృషి అంతంత మాత్రమే. అడవుల పరిరక్షణకు అనేక చట్టాలున్నా అవి టీటీడీ పరిధిలోని అడవుల్లో అమలు కావటం లేదు. భక్తుల పేరుతో టీటీడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ఫారెస్ట్ విభాగానికి ప్రధానంగా అడ్డుపడుతున్నాయి. భక్తుల ముసుగులో దట్టమైన అటవీ ప్రాంతాన్ని దశలవారీగా నాశనం చేస్తున్నా నిలువరించే దాఖలాలు కనిపించడం లేదు.