చింపాంజీలు మానవ ఆధిపత్యాన్ని అధిగమిస్తాయ్!
లండన్: సాధారణంగా అడవి జంతువులేవైనా మానవులు నివసించే ప్రాంతాలకు సమీపంలో మనుగడ సాగించలేవు. వాటి జీవనానికి అటవీ ప్రాంతమే అనుకూలంగా ఉంటుంది. కానీ చింపాంజీలు మాత్రం మానవుల ఆధిపత్యం కొనసాగే ప్రాంతాలకు సమీపంలోనూ మనగలవని తాజాగా నిపుణులు గుర్తించారు. మానవుల కార్యకలాపాలు కొనసాగే ప్రాంతం అడవి జీవులకు అనుకూలం కాదు. ఇక్కడ వాటికి మానవుల వల్ల వనరుల కొరత ఏర్పడవచ్చు. తక్కువ సంఖ్యలో మాత్రమే అడవి జంతువులు ఇలాంటి ప్రదేశాల్లో జీవిస్తాయి.
కానీ చింపాంజీలు ఈ పరిస్థితులకు అలవాటు పడగలవని, అవరోధాల్ని అధిగమించి వాటి సంఖ్యను వృద్ధి చేసుకోగలవని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు తెలిపారు. ఉగాండాలోని మానవులు అధికంగా నివసించే ప్రాంతాల్లో వీటి సంఖ్య భారీగా వృద్ధి చెందడమే ఇందుకు నిదర్శనమని వారు అన్నారు. ఉగాండోలోని బుడోంగో, బుగోమాల్లోని అభయారణ్యాల్లో గతంతో పోలిస్తే చింపాంజీల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. పైగా ఈ అభయారణ్యానికి సమీపంలోనే మానవ కార్యకలాపాలు అధికంగా ఉంటాయి. వ్యవసాయ క్షేత్రాలు, మైదానాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి చోట్ల కూడా చింపాంజీల జనాభా పెరగడం పరిశోధకుల్ని ఆశ్చర్యపరిచింది.