ప్రమాదంలో ఏనుగులు, తాబేళ్లు, పంగోలిన్, జింకలు
పులులు, బల్లులు, నక్షత్ర తాబేళ్లు, బుల్‌బుల్ పిట్టల్నీ వదలని వేటగాళ్లు
వాటి శరీర భాగాల కోసం క్రూరంగా వేటాడుతున్న వైనం
ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి
ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 40కిపైగా కేసులు
ఎంత కఠిన చట్టాలున్నా ఆగని స్మగ్లింగ్
వన్యప్రాణుల అక్రమ రవాణా మన దేశంలో అంతకంతకూ పెరిగిపోతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సరిహద్దులు, ఎయిర్‌పోర్టుల ద్వారా వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. దీనికి చెన్నై, ముంబై ఎయిర్‌పోర్టులు కీలక హబ్‌లుగా మారాయని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో చెబుతోంది.
ఈ ఏడాదిలో అక్రమ రవాణాకు సంబంధించి 40కిపైగా కేసులు నమోదయ్యాయి. వన్యప్రాణుల దంతాలు, విడిభాగాలు, చర్మానికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా జరుగుతోంది. ప్రధానంగా రైనో (ఖడ్గమృగం) కొమ్ము, పులి శరీర భాగాలు సంప్రదాయ ఔషధాల తయారీకి వినియోగిస్తారు. వాటి మాంసాన్ని కొన్నిచోట్ల తింటారు కూడా.
అతిపెద్ద వ్యవస్థీకృత నేరాల్లో నాలుగోది
అడవి జంతువుల అక్రమ రవాణా వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం దెబ్బతినడంతోపాటు జీవవైవిధ్యం సమతుల్యత లోపిస్తోంది. ఆరి్థక వ్యవస్థలపైనా దీని ప్రభావం పడుతోంది. అక్రమ రవాణా అనేక దేశాలలో విస్తరించింది. రక్షిత వన్యప్రాణులను వేటాడటం, స్మగ్లింగ్ చేయడం, చట్టవిరుద్ధంగా సేకరించడం, పట్టుకోవడం వంటివి నిరాటంకంగా జరుగుతోంది.
డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, నకిలీల తర్వాత నాలుగో అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరంగా వన్యప్రాణుల అక్రమ రవాణా కొనసాగుతున్నట్టు గుర్తించారు. ఈ అక్రమ రవాణా విలువ సంవత్సరానికి రూ.1,500 కోట్లు ఉంటుందని వైల్డ్ లైఫ్ నిపుణులు చెబుతున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్న టాప్–20 దేశాల్లో మన దేశం ఒకటి. విమానాల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్న టాప్–10 దేశాల్లో మన దేశం కూడా ఉండటం గమనార్హం.
ఏనుగుదంతాలదే మొదటి స్థానం
స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశం నుంచి అత్యధికంగా అక్రమ రవాణా అవుతున్నవి ఏనుగు దంతాలు. ఆ తర్వాత తాబేళ్లు. వీటిలో నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఖడ్గమృగం కొమ్ముల వ్యాపారం కూడా పెరిగింది. ఇటీవల కాలంలో పాంగోలిన్ వేట, అక్రమ రవాణాకు మన దేశం ప్రధాన కేంద్రంగా మారింది. పులుల శరీర భాగాల వ్యాపారం కూడా యథేచ్ఛగా కొనసాగుతోంది.
స్నేక్‌హెడ్ ఫిష్, జీబ్రా లోచ్ వంటి అలంకార చేపలను లైవ్ అక్వేరియంలో ఉంచడం కోసం అక్రమ రవాణా చేస్తుండడంతో వాటి సహజ ఆవాసాలు అంతరించిపోతున్నాయి. వీటితోపాటు నక్కలు, ఎలుగుబంట్లు, చిరుతలు, ముంగిసలు, కప్పలను అక్రమంగా రవాణా చేసి వాటి శరీర భాగాలను ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.
రవాణా జరిగే రూట్లు
మనదేశంలోనూ, మన దేశం నుంచి ఇతర దేశాల్లోకి వన్యప్రాణుల అక్రమ రవాణా ప్రధానంగా రెండు మార్గాల ద్వారా జరుగుతున్నట్టు గుర్తించారు. ఈశాన్య ప్రాంతంలోని పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఎక్కువ రవాణా జరుగుతుండగా, విమానాశ్రయాల ద్వారా రెండో మార్గంలో జరుగుతోంది. దిమాపూర్, గౌహతి, ఇంఫాల్ వంటి ఈశాన్య నగరాల నుంచి నేపాల్, మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఖడ్గమృగాల కొమ్ములు, పులి భాగాలు, పాంగోలిన్ పొలుసుల అక్రమ రవాణా విపరీతంగా జరుగుతున్నట్టు గుర్తించారు.
ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దులో పక్షులు, సరీసృపాల అక్రమ రవాణా కూడా చాలా ఎక్కువగా ఉంది. నక్షత్ర తాబేళ్లు ప్రపంచంలోనే అత్యధికంగా రవాణా అవుతున్న వన్యప్రాణులు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వీటిని థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియాకు విమానాల ద్వారా సరఫరా చేస్తున్నారు.
విమానాల్లో తీసుకెళ్లే లగేజీల రూపంలో 50 శాతానికిపైగా రవాణా ఎక్కువగా జరుగుతోంది. మరో 15 శాతం రవాణా ఎయిర్ కార్గో ద్వారా జరుగుతోంది. చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో తరచూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి.
ఇవీ కారణాలు
ప్రపంచంలో 8 శాతం వన్యప్రాణులు మన దేశంలో ఉండగా.. అధిక జనాభా వల్ల వన్యప్రాణుల ఉత్పత్తులు మన మార్కెట్లలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి. ఒకసారి మార్కెట్లలోకి వచి్చన తర్వాత వాటిని గుర్తించడం అసాధ్యంగా మారుతోంది.
చైనా, మయన్మార్, పలు ఆగ్నేయాసియా దేశాలతో సరిహద్దులు ఉండడం, పెరుగుతున్న విమానయాన మార్కెట్, వేగంగా విస్తరిస్తున్న విమానాశ్రయాలు, సోషల్ మీడియాను కూడా ఆన్‌లైన్ మార్కెట్లుగా ఉపయోగిస్తుండడంతో అక్రమ రవాణా పెరిగిపోతోంది.
– సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment