ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జపాన్.. రైలు కూతలకు కుక్క అరుపులు జోడించిందనే వార్త హాస్యస్పదమే. కానీ ఇది నిజం. భూకంప పరిస్థితుల్లో సైతం ప్రత్యేక ఆటోమేటిక్ లాకింగ్ వ్యవస్థలు కలిగిన జపనీస్ ట్రైన్ టెక్నాలజీకి.. 2018 వరకూ ఆ దేశ వన్యప్రాణులే బ్రేక్స్ వేసేవి.
సూపర్ ఫాస్ట్ షింకన్సేన్ (బుల్లెట్ ట్రైన్) సైతం దూసుకుపోగలిగే జపాన్ రైల్వే ట్రాక్స్‌పై వందలాదిగా జింకలు ప్రాణాలు కోల్పోవడం, ఆ కారణంగా రైల్వే ప్రయాణికులు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకోవడం.. ఇలా జపాన్‌కి పెద్ద సమస్యే వచ్చిపడింది. ట్రాక్స్‌కి, హిల్స్‌కి జరిగే యాక్షన్‌లో కొన్ని ఐరన్ ఫిల్లింగ్స్ ఆకర్షించే రుచిని కలిగి ఉండటంతో.. వాటిని నాకేందుకు జింకలు భారీగా రైల్వే ట్రాక్స్ మీదకు వస్తున్నాయని అధ్యయనాలు తేల్చాయి. అలా వచ్చిన జింకలు రైలు కిందపడి చనిపోయేవి. దాంతో రంగంలోకి దిగిన రైల్వే టెక్నికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్టీఆర్‌ఐ) పరిష్కారం దిశగా అడుగులు వేసింది.
సింహం పేడను తెచ్చి ట్రాక్ పొడవునా జల్లి ఓ ప్రయోగం చేశారు. ఆ వాసనకి అక్కడ సింహాలు ఉన్నాయేమోనన్న భయంతో జింకలు ట్రాక్ మీదకి వచ్చేవి కావట. అయితే వర్షం పడి సింహం పేడ కొట్టుకుపోవడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. శాశ్వత పరిష్కారం కోసం రైలు కూత శబ్దానికి కుక్క అరుపులను జోడించారు. 20 సెకన్ల పాటు కుక్క అరుపులు వినిపిస్తుంటే.. జింకలు ట్రాక్ మీద నుంచి తుర్రుమనడం గమనించిన అధికారులు.. ఇదే పద్ధతిని అవలంబించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో జపాన్ రైళ్లు కుక్కల్లా మొరుగుతున్నాయి. ఐడియా అదుర్స్ కదూ.
చదవండి: Facts About Hair: ఒక వెంట్రుక వయసు దాదాపుగా ఇన్నేళ్లు ఉంటుందట!!
Comments
Please login to add a commentAdd a comment