Japan Technology
-
చెక్కుచెదరని సౌధం
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కలలకు ప్రతి రూపం. పట్టణాల నుంచి పల్లెల వరకు అభివృద్ధి వేగవంతం అయింది. ఇళ్ల మధ్య సీసీ రోడ్లు ఎత్తు పెరగడంతో పూర్వం రోజుల్లో ఎంతో అపురూపంగా నిర్మించుకున్న ఇల్లు లోతట్టుగా మారింది. రూ.లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని వాస్తు, ఇతర కారణాలతో కొన్ని పరిస్థితుల్లో ఆ ఇంటిని కూల్చేసి పునర్నిర్మించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంటికి ఎలాంటి నష్టం జరగకుండా లిఫ్టింగ్, షిఫ్టింగ్ జపాన్ టెక్నాలజీతో ఎన్నంతస్తుల భవనాలనైనా సునాయాసంగా అమాంతంగా ఎత్తేస్తున్నారు. ఈ టెక్నాలజీతో భవన యజమానులకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. పొదలకూరు: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. పల్లెల నుంచి పట్టణాల వరకు జనావాసాలు పెరుగుతున్నాయి. అందుకునుగుణంగా రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ రహదారులు ఎత్తుగా మారడంతో కొన్నేళ్ల క్రితం ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న కలల సౌదాలు లోతట్టులోకి మారిపోతున్నాయి. వర్షాకాలంలో ముంపు సమస్యలు ఒక ఎత్తైతే.. వాస్తుకు ఇది విరుద్ధంగా మారి ఆ ఇంటి యజమానులు కష్ట, నష్టాలు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిణామాల్లో ఎన్నో ఏళ్ల క్రితం పాతతరం తీపి జ్ఞాపకాలతో ఉన్న ఇంటిని కూల్చేయాలంటే కొందరి మనస్సు అంగీకరించదు. మరి కొందరు తాత తండ్రులు నిర్మించిన ఇంటిని పదిలంగా చూసుకుంటారు. ప్రతి ఇటుక పెద్దల కష్టార్జితంతో పెట్టినట్టు భావించి పాత ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. ఉన్న ఇంటిని ధ్వంసం చేయాల్సి వస్తే తల్లడిల్లిపోతారు. మూడు అడుగులు ఎత్తుకు.. పట్టణంలోని తొగటవీధిలో మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన నర్ల చిన్నపరెడ్డి ఇంటిని లిఫ్టింగ్ టెక్నాలజీతో మూడు అడుగుల ఎత్తు లేపుతున్నారు. బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ మొత్తం జాకీల సహాయంతోనే ఉంటుంది. లిఫ్టింగ్‌కు సాధార జాకీలు, షిఫ్టింగ్‌కు రన్నింగ్ జాకీలను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇంజినీర్ల పర్యవేక్షణలో శిక్షణ పొందిన బిహార్‌కు చెందిన కూలీలు చేపడుతున్నారు. నర్ల చిన్నపరెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి లిఫ్టింగ్ కంపెనీ వివరాలు తెలుసుకుని 30 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటి జ్ఞాపకాలను చెక్కు చెదరకుండా రోడ్డుకు మూడు అడుగుల ఎత్తులో ఉండేలా లిఫ్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం కంపెనీకు రూ.3.80 లక్షలు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ కంపెనీ ఇంజినీరు పర్యవేక్షణలో పదిహేను రోజులుగా పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 1.5 అడుగుల మేర భవనాన్ని ఎత్తు లేపారు. మరో 1.5 అడుగుల ఎత్తు లేపాల్సి ఉందని వెల్లడించారు. టెక్నాలజీ సాయం.. భవనం పదిలం లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ (భవనం ఎత్తు లేవపడం, పక్కకు జరపడం) టెక్నాలజీ ఇప్పుడు వారి కష్టాలను తొలగిస్తోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో లిఫ్టింగ్ టెక్నాలజీ కొత్తమీ కాకున్నా గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి రావడం విశేషం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంస్థ పాత ఇళ్లను చెక్కు చెదరకుండా ఇంటి యజమాని జ్ఞాపకాలను వారితోనే ఉంచే విధంగా పనిచేస్తోంది. పొదలకూరులో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆలోచనే లేని సమయంలో బిల్డింగ్ లిఫ్టింగ్ టెక్నాలజీని వినియోగించుకుని తమ పాత ఇంటిని ఎత్తు లేపుకుంటున్న వైనం పరిశీలిస్తే సాంకేతికత గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తుందని అర్థం అవుతుంది. లిఫ్టింగ్, షిఫ్టింగ్ సురక్షితం భవనాల లిఫ్టింగ్, షిఫ్టింగ్ సురక్షితమని పనులు చేయించుకుంటున్న ఇంటి యజమానులు అంటున్నారు. ఈ టెక్నాలజీతో ఇప్పటికే చాలా చోట్ల బిల్డింగ్స్‌ను పైకి లేపడం, వాస్తురీత్యా పక్కకు జరపడం చేపట్టారు. వెంకటగిరి–ఏర్పేడు మార్గమధ్యంలో మల్లాం వద్ద హైవే రోడ్డు నిర్మాణం కోసం సేకరించిన భవనాన్ని 104 అడుగులు జరిపి మరో ప్లాటులో ఏర్పాటు చేసినట్టు లిఫ్టింగ్ ఇంజినీరు వెల్లడించారు. సుమారు 14 అడుగుల వరకు టెక్నాలజీతో భవనాలను ఎత్తు లేపవచ్చునంటున్నారు. ఒంగోలు, గూడూరుల్లో చాలా ఇళ్లను ఎత్తులేపారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం భవంతులు, దేవాలయాలను ఎత్తులేపడం, పక్కకు జరపడం పూర్తి చేశారు. షిఫ్టింగ్ టెక్నాలజీలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలుస్తోంది. పాత జ్ఞాపకాలు.. తక్కువ ఖర్చు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇంటి జ్ఞాపకాలు చెదరకుండా తక్కువ ఖర్చుతో భవనాన్ని లిఫ్టింగ్ చేస్తున్నారు. ఇదే ఇంటిని కూలదోసి అదే స్థలంలో నిర్మించాలంటే సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుంది. లిఫ్టింగ్ టెక్నాలజీతో ఇంటిని ఎత్తు లేపడంతో పాటు ఇతర రీ మోడలింగ్‌కు మరో రూ.10 లక్షల ఖర్చుతోనే పాత భవనాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకోవచ్చని లిఫ్టింగ్ ఇంజినీర్లు అంటున్నారు. గతేడాది శ్రీనివాసపురంలో చెన్నైకు చెందిన లిఫ్టింగ్ కంపెనీ పాత భవనాన్ని జాకీల సాయంతో ఎత్తు లేపింది. ఇంటిని కూల్చేందుకు ఇష్టం లేక మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన మా ఇల్లు రోడ్లు అభివృద్ధి చెందడంతో లోతట్టుగా మారింది. అప్పటి పరిస్థితుల్లో ఎత్తులోనే నిర్మించుకున్నా.. ఇల్లు లోతట్టుగా మారడంతో వాస్తుకు విరుద్ధంగా ఉండడంతో ఇళ్లు కూల్చి కట్టడం తప్పనిసరి. అయితే పాత ఇల్లు కూల్చేందుకు ఇష్టం లేక లిఫ్టింగ్ టెక్నాలజీతో భవనాన్ని ఎత్తు లేపుకుంటున్నాం. చాలా చోట్ల విచారించే ఈ సాహసానికి పూనుకున్నాం. ఈ ప్రాంతంలో కొత్త అయినప్పటికీ సలహాలు తీసుకుని పెద్దలను ఒప్పంచి పనులు చేయిస్తున్నాం. ఈ విధానం వల్ల చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది. – నర్ల శ్రీనివాసులురెడ్డి, ఇంటి యజమాని, పొదలకూరు ఖర్చు తక్కువతో సమస్యకు పరిష్కారం భవనాన్ని చెక్కు చెదరకుండా లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ పనులు చేపడతాం. ఏ డేళ్లుగా ఈ రంగంలో ఇంజినీరుగా కొనసాగుతూ సొంతంగా కంపెనీని ఏర్పాటు చేసుకున్నాం. కూలీలకు సైతం శిక్షణ ఇచ్చి జాగ్రత్తలు పాటిస్తూ లిఫ్టింగ్ పనులు చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీరిక లేనంతగా పనులు ఉన్నాయి. జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు పెరుగుతున్న మెటీరియల్, కూలీల ఖర్చులతో కొత్తగా భవనం నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఈ టెక్నాలజీలతో చాలా తక్కువలో ఇంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. – ఎస్.అనిల్‌కుమార్, ఇంజినీరు -
తెలుసా..! ఈ దేశంలో రైళ్లు కుక్కల్లా మొరుగుతాయట.. ఎందుకంటే..
ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జపాన్.. రైలు కూతలకు కుక్క అరుపులు జోడించిందనే వార్త హాస్యస్పదమే. కానీ ఇది నిజం. భూకంప పరిస్థితుల్లో సైతం ప్రత్యేక ఆటోమేటిక్ లాకింగ్ వ్యవస్థలు కలిగిన జపనీస్ ట్రైన్ టెక్నాలజీకి.. 2018 వరకూ ఆ దేశ వన్యప్రాణులే బ్రేక్స్ వేసేవి. సూపర్ ఫాస్ట్ షింకన్సేన్ (బుల్లెట్ ట్రైన్) సైతం దూసుకుపోగలిగే జపాన్ రైల్వే ట్రాక్స్‌పై వందలాదిగా జింకలు ప్రాణాలు కోల్పోవడం, ఆ కారణంగా రైల్వే ప్రయాణికులు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకోవడం.. ఇలా జపాన్‌కి పెద్ద సమస్యే వచ్చిపడింది. ట్రాక్స్‌కి, హిల్స్‌కి జరిగే యాక్షన్‌లో కొన్ని ఐరన్ ఫిల్లింగ్స్ ఆకర్షించే రుచిని కలిగి ఉండటంతో.. వాటిని నాకేందుకు జింకలు భారీగా రైల్వే ట్రాక్స్ మీదకు వస్తున్నాయని అధ్యయనాలు తేల్చాయి. అలా వచ్చిన జింకలు రైలు కిందపడి చనిపోయేవి. దాంతో రంగంలోకి దిగిన రైల్వే టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్టీఆర్ఐ) పరిష్కారం దిశగా అడుగులు వేసింది. సింహం పేడను తెచ్చి ట్రాక్ పొడవునా జల్లి ఓ ప్రయోగం చేశారు. ఆ వాసనకి అక్కడ సింహాలు ఉన్నాయేమోనన్న భయంతో జింకలు ట్రాక్ మీదకి వచ్చేవి కావట. అయితే వర్షం పడి సింహం పేడ కొట్టుకుపోవడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. శాశ్వత పరిష్కారం కోసం రైలు కూత శబ్దానికి కుక్క అరుపులను జోడించారు. 20 సెకన్ల పాటు కుక్క అరుపులు వినిపిస్తుంటే.. జింకలు ట్రాక్ మీద నుంచి తుర్రుమనడం గమనించిన అధికారులు.. ఇదే పద్ధతిని అవలంబించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో జపాన్ రైళ్లు కుక్కల్లా మొరుగుతున్నాయి. ఐడియా అదుర్స్ కదూ. చదవండి: Facts About Hair: ఒక వెంట్రుక వయసు దాదాపుగా ఇన్నేళ్లు ఉంటుందట!! -
జపాన్ టెక్నాలజీతో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సంస్థ టెరీ (ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్) జపాన్ సాంకేతిక పరిజ్ఞానం అందించనుంది. విద్యుత్ వ్యయం నియంత్రణ, పారిశ్రామిక పురోగతి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో (ఎస్ఎమ్ఈ) 35 శాతం వరకు కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ స్ట్రాటజీస్ (ఐజీఈఎస్)తో కలసి టేరీ సంస్థ బుధవారం న్యూఢిల్లీలో వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్–2020ని నిర్వహించింది. ఈ వివరాలను రాష్ట్ర ఇంధనశాఖ మీడియాకు వెల్లడించింది. సదస్సులో టెరీ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ మాట్లాడుతూ ఇంధన సామర్ధ్యం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయన్నారు. జపాన్ ఇండియా టెక్నాలజీ మ్యాచ్ మేకింగ్ ప్లాట్ ఫామ్ (జేఐటీఎమ్ఎమ్పీ) ద్వారా ఐజీఈఎస్ తో కలసి టేరీ సంస్థ ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌కు అందించనుందన్నారు. ఇంధన సామర్థ్య చర్యలకు పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇంధన పొదుపుకు ఏపీలో ఎక్కువ అవకాశాలున్నట్టు టెరీ అధ్యయనంలో వెల్లడైందని మాథుర్ తెలిపారు. ఇంధన పొదుపు అమలుకు ఐక్యరాజ్యసమితి పారిశ్రామికాభివృద్ధి సంస్థ (యూనీడో), జీఈఎఫ్ వంటి వివిధ అంతర్జాతీయ సంస్థలు పెద్దఎత్తున నిధులు సమకూరుస్తున్నట్లు అజయ్ మాథుర్ తెలిపారు. చౌక విద్యుత్తే లక్ష్యం సదస్సులో ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి సందేశాన్ని ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి చదివారు. చౌక విద్యుత్ సాధన లక్ష్యానికి ఏపీ కట్టుబడి ఉందని, విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య వెనుక పరమార్థం ఇదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రైతులు, పేదవర్గాల ప్రయోజనానికి విద్యుత్ రంగంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ భక్రే, ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ స్ట్రాటజీస్ (ఐజీఈఎస్) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కజుహికో టేకుచి, యునిడో ప్రతినిధి డాక్టర్ రెనే వాన్ బెర్కెల్ తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు 21 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. -
వాయు కాలుష్యంపై జ‘ప్లాన్’ !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు పోతోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కాలుష్య నిర్మూలనలో అద్భుత ఫలితాలు సాధించిన జపాన్ దేశ అనుభవా లను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెట్రో రైలు భవన్లో మంగళవారం జపాన్ ప్రతినిధి బృందంతో ఆయన సమావేశం అయ్యారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో వాయు నాణ్యతను పెంచేందుకు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని వారిని కోరారు. చెత్త ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, వేస్ట్ టూ ఎనర్జీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులు, స్పాట్ ఇన్సినరేషన్ ప్లాంట్ల ఏర్పాటు వంటి అంశాలపై జపాన్ సహకారం తీసుకుంటామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం లో తెలంగాణ ప్రభుత్వం ముందు వరసలో ఉంటుందన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు అవతలకు కాలుష్య పరిశ్రమలు అతి కాలుష్య కారక పరిశ్రమలను నగరం నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు అవతలకు తరలిం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ పరిశ్రమల్లో అత్యుత్తమ కాలుష్య నియంత్రణ పద్ధతులను అనుసరిస్తామన్నా రు. త్వరలో ఏర్పాటు కానున్న ఫార్మాసిటీ వంటి ప్రాజె క్టులో అంతర్భాగంగానే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కాలుష్య నియంత్రణ పద్ధతు లను పాటించనున్నామని వివరించారు. తమ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఇప్పటికే వాయు కాలుష్య, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియంత్రణ పద్ధతుల అధ్యయనానికి జపా న్లో పర్యటన చేసిందని, తమ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇక్కడి పరిస్ధితులను అధ్య యనం చేసేందుకు జపాన్ బృందం ఇక్కడ మూడురోజుల పాటు పర్యటిస్తోందన్నారు. జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో), క్లీన్ అథారిటీ ఆఫ్ టోక్యో ప్రతినిధులు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారని మంత్రి తెలిపారు. వీరు బీబీనగర్ పవర్ ప్లాంటు, జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సందర్శిస్తా రన్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పర్యటించి, ఇక్కడి పరిస్థితులకు అనుగు ణంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాయు కాలుష్య నియంత్రణ పద్ధతులపై ఒక నివేదిక ఇస్తారని కేటీఆర్ తెలిపారు. తమ దేశంలో పాటిస్తున్న కాలుష్య నియంత్రణ పద్ధతులను జపాన్ ప్రతినిధి బృందం ఈ సమావేశంలో వివరించింది. ముఖ్యంగా టోక్యో క్లీన్ ఎయిర్ అథారిటీ ఆధ్యర్యంలో చేపట్టిన కార్యక్రమా లను తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేయ నున్న క్లీన్ ఎయిర్ అథారిటీకి సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామంది. -
ఇదీ.. మన బుల్లెట్
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు సబర్మతిలో ముంబై– అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 508 కిలోమీటర్లలో 468 కి.మీ (92 శాతం) 20 మీటర్ల ఎత్తులో ఉండే ఎలివేటెడ్ మార్గం. అంటే మన మెట్రోలాగా స్తంభాలపై వెళుతుంది. 27 కిలోమీటర్లు భూగర్భ టన్నెల్. ఇందులో ఏడు కిలోమీటర్లు సముద్రగర్భంలో ఉంటుంది. బాంద్రా–కుర్లా వద్ద టన్నెల్ ప్రారంభమై థానే వద్ద ముగుస్తుంది. 13 కిలోమీటర్ల మార్గం భూమి మీద ఉంటుంది. ముంబై– అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు ప్రయాణించే దూరం : 508 కిలోమీటర్లు ముంబై, థానే, విరార్, బోయ్సర్, వాపి, బిలిమొర, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి 12 స్టేషన్లు గంటకు బుల్లెట్ రైలు వేగం.గరిష్టంగా 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 320 ప్రయాణ సమయం సూరత్, వడోదర స్టేషన్లలో మాత్రమే ఆగితే 2 గంటల 7 నిమిషాల్లో గమ్యం చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలోనూ ఆగితే 2 గంటల 58 నిమిషాల్లో గమ్యం చేరుతుంది. ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది. 165 సెకన్లు ఒక్కో స్టేషనులో ఈ రైలు రెండు నిమిషాల నలభై ఐదు సెకన్లు మాత్రమే ఆగుతుంది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూపాయలు కోట్లలో.. 1,10,000 ► 88,000 కోట్లు ఈ ప్రాజెక్టుకు జపాన్ ఇస్తున్న రుణం. 50 ఏళ్లలో తిరిగి చెల్లించాలి. 15 ఏళ్ల మారటోరియం వెసులుబాటు కూడా ఉంది. నామమాత్రపు వడ్డీ 0.1 శాతమే. జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జికా) ఈ రుణాన్ని ఇస్తోంది. ► డిసెంబరు 2023 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలి. అయితే భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగష్టు 15, 2022 నాటికే ప్రాజెక్టు పూర్తవ్వాలని మోదీ ఆశిస్తున్నారు. అవసరమయ్యే భూమి(ఎకరాల్లో) 2,039 జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బుల్లెట్ రైళ్లు 24 ముంబై– అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైళ్లు రోజుకు వేయనున్న ట్రిప్పులు (అప్ అండ్ డౌన్) 35 బుల్లెట్ రైలు ప్రయాణికుల సామర్థ్యం 750 జపాన్ టెక్నాలజీ.. షిన్కాన్సెన్ హైస్పీడ్ రైల్ టెక్నాలజీని జపాన్ భారత్‌కు బదలాయిస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో మన అవసరాలకు తగ్గట్లుగా మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు. బుల్లెట్ రైలు వ్యవస్థను నడపడానికి అవసరమయ్యే ఉద్యోగుల సంఖ్య: 4,000 నిర్మాణ సమయంలో 20 వేల కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. టికెట్ ధర ప్రస్తుత ఏసీ టికెట్ ధర కంటే 1.5 శాతం ఎక్కువగా ఉంటుంది. రూ. 3,000 నుంచి 5,000 మధ్య ఉండొచ్చు. విమానధరలు కూడా 5,000 దాకా ఉన్నాయి. ముందుగా బుక్ చేస్తే తక్కువ ధరలకు వస్తాయి. విమాన ప్రయాణం సమయం 70 నిమిషాలే. అయితే విమానాశ్రయానికి రాకపోకలకు, చెక్ ఇన్, దిగాక లగేజీ కోసం వెయిట్ చేయడం... తదితర కారణాల వల్ల చాలా సమయం వృథా అవుతోంది. బుల్లెట్ రైలు ప్రయాణం చాలా సురక్షితం. 1964లో జపాన్ బుల్లెట్ రైలు వ్యవస్థను ప్రారంభించాక ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పెద్ద ప్రమాదం ఒక్కటి కూడా జరగలేదు. ఏ ఒక్క ప్రయాణికుడు మృతి చెందలేదు. ఠంచనుగా సమయానికి వచ్చేస్తాయి. ఆలస్యం ఉండదు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్