
గేటుకు వేలాడుతున్న బాడ్జర్
లండన్ : వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటు పడుతున్న ఓ బీబీసీ యాంకర్ మీద కొందరు దుండగులు కక్ష గట్టారు. అతడ్ని భయపెట్టడానికి చనిపోయిన జంతువుల కళేబరాలను ఇంటి గేటుకు వేలాడదీస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్ హాంప్‌షేర్‌లోని మార్చ్‌వుడ్‌కు చెందిన ప్రముఖ బీబీసీ యాంకర్ క్రిష్ పాక్‌హామ్ వన్యప్రాణుల సంరక్షణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాక్‌హామ్ చేస్తున్న ప్రచారం నచ్చని కొందరు అతడిపై కక్ష కట్టారు.
బాడ్జర్ కలేబరంతో పాక్‌హామ్
చనిపోయిన అడవి జంతువుల కళేబరాలను అతడి ఇంటి గేటుకు వేలాడ దీయటం ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం చనిపోయిన రెండు కాకుల మెడకు తాడుకట్టి వాటిని అతడి ఇంటి గేటుకు వేలాడదీశారు. ఆ తర్వాత ఓ చనిపోయిన నక్కను ఇంటి ఆవరణలో పడేశారు. గత గురువారం అర్థరాత్రి కూడా ప్రమాదంలో చనిపోయిన ఓ ఆడ బాడ్జర్‌ను( జంతువు) అతడి ఇంటి గేటు మధ్యలో వేలాడదీశారు. ఆ రాత్రి ఇంటికి వచ్చిన అతడు గేటుకు వేలాడదీసి ఉన్న బాడ్జర్ కళేబరాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశాడు.
గేటుకు వేలాడుతున్న కాకులు
అతడికి ఏడుపు తెప్పించిన మరో విషయం ఏంటంటే ఆ బాడ్జర్ ఇదివరకే ప్రసవించింది. పిల్లల తల్లిని వేలాడదీసిన క్రూరులపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్‌హామ్ మాట్లాడుతూ.. ‘‘ నేనిది తట్టుకోలేకపోతున్నాను. ఈ సంఘటననుంచి త్వరగా కోలుకుంటానని అనుకుంటున్నా. వీటికంతా నేను భయపడేది లేదు. చాలా స్పష్టంగా చెప్పాను ఇలాంటి చెత్తపనులు చేసి నన్ను మీరు ఆపలేరని. చుట్టుప్రక్కలవారే ఈ పనిచేస్తున్నారని అర్థమవుతోంది. వాళ్లకు తెలుసు నేనెక్కడ ఉంటానో. ఎట్టిపరిస్థితుల్లోనూ నేను చేసేపనిని ఆపను. ఎందుకంటే నేను చేస్తున్న పని మంచిదని నాకు తెలుస’ని అన్నారు.

ఇంటి ఆవరణలో నక్క కలేబరం
Comments
Please login to add a commentAdd a comment