
పాడి పశువులకూ ‘ఆధార్’
- ఐదేళ్లలో అన్నింటికీ యూనిక్ నంబర్
- రేపటి నుంచి జిల్లాలో ‘పశుసంజీవని’
అనంతపురం అగ్రికల్చర్ : మనుషుల మాదిరిగానే పాడి పశువులకూ ‘ఆధార్’ నంబర్ ఇవ్వనున్నారు. ‘పశుసంజీవని’ పేరుతో రేపటి (జూన్ 1) నుంచి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పాలిచ్చే ఆవులు, గేదెలను గుర్తించి వాటికి యూనిక్ నంబర్ ఇవ్వనున్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎం) పథకం కింద వచ్చే ఐదేళ్లలో అంటే 2022 నాటికి దేశవ్యాప్తంగా వంద శాతం పశుసంపదకు యూనిక్ నంబర్లు కేటాయించనున్నారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జూన్ ఒకటిన లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ), పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి జిల్లాలో శ్రీకారం చుట్టనున్నాయి.
ఈ విషయాన్ని డీఎల్‌డీఏ చైర్మన్ అల్లు రాధాక్రిష్ణయ్య, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఒక పశువుకు ఇచ్చిన నంబర్ దేశంలో మరెక్కడా ఇంకో పశువుకు కేటాయించకుండా అత్యంత పకడ్బందీగా ఆన్‌లైన్ చేయనున్నట్లు వారు వెల్లడించారు. గ్రామాల వారీగా సిబ్బంది సర్వే చేసి పశువులతో పాటు రైతుల వివరాలనూ నమోదు చేసుకుని వాటికి యూనిక్ నంబరు, ట్యాగ్ ఇస్తారన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయడంతో పాటు పశువులకు ఇచ్చే మేత వివరాలు, టీకాలు, వైద్య చికిత్సకు సంబంధించిన వివరాలను కంప్యూటరీకరణ చేయనున్నట్లు తెలిపారు. పశువులను అమ్మినా, కొన్నా వాటి వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పారు.
యూనిక్ నంబర్ కేటాయించడం వల్ల పశుసంపదకు సంబంధించిన పక్కా గణాంకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనివల్ల పశు పథకాల అమలు, బడ్జెట్ కేటాయింపులు సులభతరమవుతాయన్నారు. మేలు జాతి పశుసంపద అభివృద్ధి, అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులను అదుపులో ఉంచడం, చికిత్సా విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నివారించడం, పాల ఉత్పత్తి రెట్టింపు చేయడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, ఈ–మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం వంటి వాటికి కూడా ఈ గణాంకాలు దోహదపడతాయన్నారు.