వన్యప్రాణులు స్వాధీనం
వన్యప్రాణులు స్వాధీనం
Published Mon, Apr 17 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM
- తర్తూరు తిరునాలలో ప్రదర్శనకు ఉంచిన వాటిపై అధికారులు దాడులు
- పునుగు పిల్లి, కొండ చిలువ, తాబేళ్లు స్వాధీనం
- ప్రదర్శనకు ఉంచిన వారి అరెస్టు
ఆత్మకూరురూరల్: తర్తూరు తిరనాలలో ప్రదర్శన కోసం ఉంచిన వన్యప్రాణులను ఆదివారం ఆత్మకూరు అటవీ డివిజన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రదర్శనకు పెట్టిన హుసేన్‌ను అదుపులోనికి తీసుకుని నందికొట్కూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
జూపాడుబంగ్లా మండలం తర్తూరు తిరునాలలో కర్నూలుకు చెందిన హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు కొన్ని వన్యప్రాణులను ప్రదర్శనకు పెట్టి జనం టికెట్ వసూలు చేసుకుంటున్నారు. ఇందులో అరుదైన పునుగు పిల్లి, కొండచిలువ, రెండు కోతులు, రామచిలుకలు, కంజులు, తాబేలు, ముంగీసలున్నాయి. విషయం తెలుసుకున్న వైల్డ్‌లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో దక్షిణ ప్రాంతీయ విభాగం చెన్నై వారు వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు అందుకు బాధ్యలైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు డీఎఫ్‌ఓ సెల్వంను ఆదేశించారు. ఈ మేరకు వెలుగోడు ఇన్‌చార్జ్ రేంజర్ శంకరయ్య సిబ్బందితో వెళ్లి బోన్లలో ఉంచిన వన్యప్రాణులను స్వాధీనం చేసుకుని ఆత్మకూరులోని బైర్లూటి రేంజ్ క్యాంపు కార్యాలయానికి తరలించారు. వాటిని ప్రదర్శనకు పెట్టిన హుసేన్‌ను అదుపులోనికి తీసుకున్న అధికారులు నందికొట్కూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా ఆయన 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. వన్యప్రాణులను అధికారుల ఆదేశాల మేరకు అడవిలో వదిలిపెడతామని రేంజర్ శంకరయ్య తెలిపారు. దాడుల్లో డీఆర్‌ఓ రంగన్న, ఎఫ్‌బీఓలు మహబూబ్ బాషా, మదన్ కుమార్, టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement