tartur
-
సైబర్ సైకో ..
సత్తుపల్లి : కొద్దిపాటి పరిచయమున్న మహిళను ఫేస్బుక్, వాట్సాప్‌లో వేధిస్తున్న వ్యక్తి(సైబర్ సైకో)ని సత్తుపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించారు. విలేకరుల సమావేశంలో సత్తుపల్లి సీఐ ఎం.వెంకటనర్సయ్య తెలిపిన వివరాలు.. సత్తుపల్లి మండలానికి చెందిన ఓ యువతి, అస్ట్రేలియాలో నివసిస్తోంది. ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేటప్పుడు కూకట్పల్లి చాంద్రాయనగర్కు చెందిన గుడ్డేటి రాఘవేందర్‌తో కొద్దిపాటి పరిచయం మాత్రమే ఉంది. అతడు కొంతకాలంగా ఆమెకు ఫేస్బుక్, వాట్సాప్‌లో అసభ్య పోస్టింగ్‌లు పెడుతున్నాడు. ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి తెలిపింది. ఆయన ఈ నెల 7న సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న నిందితుడు రాఘవేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, శనివారం కోర్టుకు అప్పగించారు. -
అవ్వా క్షమించు..
మాయమవుతున్నాడమ్మో... మనిషన్నవాడు... అవును..మానవత మాయమైపోతుంది. ముసలితనంలో కాళ్లు చచ్చుబడిపోయి.. మంచానికే పరిమితమైన ఆ ముదుసలిని చిత్ర హింసలు పెట్టడానికి అసలు మనసెలా వచ్చింది. కర్రతో కొడుతున్నా... బాధను పైకి వ్యక్త పరిస్తే.. మరలా కొట్టడం... రాక్షసత్వానికి నిదర్శనం. ఆస్తి తన కుమారుడి పేరున రాయాలని వృద్ధురాలిని హింసించడం పలువురిని కంటతడిపెట్టించింది. స్థానికులు స్పందించారు. ఈ హింసను చూసి తట్టుకోలేక.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వారి బండారం బయటపడింది. రాజమహేంద్రవరం క్రైం : రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతి భర్త దొరయ్య మృతి చెందాడు. పుష్పవతికి వారసులు లేరు. దీంతో తన చిన్నమ్మ కుమార్తె చెల్లెలయ్యే రాజమహేంద్రవరం హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న ప్రగడ మంగాదేవి ఇంట్లో కొంత కాలంగా ఉంటోంది. పుష్పవతి పేరున రాజానగరం మండలం తోకాడ వద్ద ఒక ఇల్లు, స్థలం ఉండడంతో మంగాదేవి ఆమెను నరేంద్రపురం నుంచి తీసుకువచ్చి మూడు నెలలుగా తన కుమారుడి పేరున స్థలం, ఇల్లు రాయాలని చిత్రహింసలకు గురి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. కాళ్లు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమైన పుష్పవతిని సంతకం చేయాలంటూ నిత్యం జుట్టుపట్టుకొని కర్రతో కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. కదలలేని స్థితిలో ఉండి కొట్టినప్పుడు బాధతో అరిస్తే మరలా ఆ ఆరుపులు ఆపేవరకూ కొట్టేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనను చుట్టుపక్కల వారు గమనించి వీడియో తీసి సోషల్ మిడియాలో పెట్టడంతో కలకలం మొదలైంది. స్థానికుల సహాయంలో వృద్ధురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మహిళా సంఘాల నాయకులు మంగాదేవిని నిలదీసినప్పుడు ఆమె ఎవరో తెలియదని, అనాదను చేరదీసి చూస్తున్నామంటూ ఆమె బుకాయించేందుకు ప్రయత్నించింది. నిందితురాలు ప్రగడ మంగాదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాణాపాయ స్థితిలో పుష్పవతి ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో పుష్పవతి ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. మంచానికే పరిమితమైన ఆమెను కర్రతో కాళ్లమీద, డొక్కలలోను, కడుపు పైన కొట్టడంతో లోపల అవయవాలు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. వృద్ధురాలి వంటి పై ఉన్న గాయాల ఆధారంగా చాలా కాలంగా చిత్రహింసలకు గురి చేస్తోందని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం పుష్పవతి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. -
వన్యప్రాణులు స్వాధీనం
- తర్తూరు తిరునాలలో ప్రదర్శనకు ఉంచిన వాటిపై అధికారులు దాడులు - పునుగు పిల్లి, కొండ చిలువ, తాబేళ్లు స్వాధీనం - ప్రదర్శనకు ఉంచిన వారి అరెస్టు ఆత్మకూరురూరల్: తర్తూరు తిరనాలలో ప్రదర్శన కోసం ఉంచిన వన్యప్రాణులను ఆదివారం ఆత్మకూరు అటవీ డివిజన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రదర్శనకు పెట్టిన హుసేన్‌ను అదుపులోనికి తీసుకుని నందికొట్కూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. జూపాడుబంగ్లా మండలం తర్తూరు తిరునాలలో కర్నూలుకు చెందిన హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు కొన్ని వన్యప్రాణులను ప్రదర్శనకు పెట్టి జనం టికెట్ వసూలు చేసుకుంటున్నారు. ఇందులో అరుదైన పునుగు పిల్లి, కొండచిలువ, రెండు కోతులు, రామచిలుకలు, కంజులు, తాబేలు, ముంగీసలున్నాయి. విషయం తెలుసుకున్న వైల్డ్‌లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో దక్షిణ ప్రాంతీయ విభాగం చెన్నై వారు వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు అందుకు బాధ్యలైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు డీఎఫ్ఓ సెల్వంను ఆదేశించారు. ఈ మేరకు వెలుగోడు ఇన్చార్జ్ రేంజర్ శంకరయ్య సిబ్బందితో వెళ్లి బోన్లలో ఉంచిన వన్యప్రాణులను స్వాధీనం చేసుకుని ఆత్మకూరులోని బైర్లూటి రేంజ్ క్యాంపు కార్యాలయానికి తరలించారు. వాటిని ప్రదర్శనకు పెట్టిన హుసేన్‌ను అదుపులోనికి తీసుకున్న అధికారులు నందికొట్కూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా ఆయన 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. వన్యప్రాణులను అధికారుల ఆదేశాల మేరకు అడవిలో వదిలిపెడతామని రేంజర్ శంకరయ్య తెలిపారు. దాడుల్లో డీఆర్ఓ రంగన్న, ఎఫ్‌బీఓలు మహబూబ్ బాషా, మదన్ కుమార్, టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
తర్తూరులో పారువేట
జూపాడుబంగ్లా: శ్రీలక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా తర్తూరులో గురువారం పారువేటను వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి పల్లకిలో అధిష్టింపజేశారు. స్వామిని పారువేట గుర్రం వద్దకు తీసుకెళ్లి.. పాత రంగస్వామి దేవాలయం సమీపంలో గొర్రెను వదిలిపెట్టారు. పాత రంగనాథస్వామివారికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి పారువేట గుర్రంతో పాటు స్వామివారిని తీసుకొని పారువేట పద్యాలను పాడుకుంటూ భక్తులు స్వామివారిని తిరిగి దేవాలయానికి చేర్చారు. -
రమణీయం..రంగనాథుడి రథోత్సవం
జూపాడుబంగ్లా: బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథ స్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారిని బంగారు తొడుగుతో అలంకరించి పట్టువస్త్రాలతో ముస్తాబు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుంచారు. గ్రామంలోని ఆలయాల వద్దకు తీసుకెళ్లి పూజలు జరిపారు. అనంతరం బంతి, మల్లె, సంపెంగ తదితర పూలతో దేదీప్యమానంగా అలంకరించిన రథంపై స్వామివారిని అధిష్టింపజేశారు. ఆయకట్టుదారులైన కుమ్మరులు బోనం తీసుకొచ్చారు. రథం ముందు పూర్ణాహుతి బలిని ఇచ్చారు. ఆలయ పూజారి నాగిరెడ్డి కుమారుడు ఈశ్వరరెడ్డి స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఐజయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, సర్పంచ్ లక్ష్మిదేవమ్మ, ఆలయ ఈఓ సుబ్రమణ్యం నాయుడు, కమిటీ చైర్మన్ రాయపు చిన్నరంగారెడ్డి... రథంలోని స్వామివారికి, రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథాన్ని జయ జయ ధ్వానాల మధ్య గోవింద నామాన్ని స్మరిస్తూ ముందుకు కదిలించారు. భక్తులు.. స్వామివారి రథోత్సవాన్ని తిలకించి తన్మయత్వంతో ఊగిపోయారు. రథాన్ని రథశాల నుంచి 100 మీటర్ల దూరం లాగి తిరిగి వెనక్కి తెచ్చి రథశాల వద్దకు చేర్చారు. మండే ఎండలను లెక్కచేయకుండా రథోత్సవాన్ని కనులారా తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ వినోద్‌కుమార్, నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి అధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
గరుడ వాహనంపై విహరించిన రంగనాథుడు
జూపాడుబంగ్లా : తర్తూరు శ్రీలక్ష్మీ రంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు గరుడవాహనంపై గ్రామంలో విహరించారు. వేదమంత్రాల మధ్య స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. పట్టువస్త్రాలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పల్లకి గరుడవాహనం వద్దకు తీసుకొచ్చారు. స్వామివారిని వాహనంపై అధిష్టింపజేసి గోవింద నామాన్ని స్మరిస్తూ పురవీధుల్లో తిప్పారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి కాయ, కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గరుడోత్సవాన్ని పురుస్కరించుకొని చందా, గుండు ఎత్తే పందేలను నిర్వహించారు. గెలుపొందిన వారికి స్వామివారిని అలంకరించిన పూలమాలలతో సత్కరించారు. -
హనుమద్వాహనంపై శ్రీరంగనాథుడు
జూపాడుబంగ్లా : తర్తూరు శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజైన ఆదివారం శ్రీలక్ష్మీరంగనాథస్వామి హనుమంతుడి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పన్నీటితో స్నానం చేయించి పంచామృతాభిషేకాలు నిర్వహించి స్వామివారిని పట్టువస్త్రాలతో అలంకరించారు. మల్లెలతో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని భక్తులు కూర్చుండబెట్టారు. అనంతరం గోవింద నామాన్ని స్మరిస్తూ వాహనాన్ని గ్రామ పురవీధుల్లో తిప్పారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారికి కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నేడు గరుడ వాహనసేవ : స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గరుడ వాహన సేవను నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్ రాయపు చిన్నరంగారెడ్డిలు తెలిపారు. -
శేషవాహనంపై శ్రీరంగనాథుడు
తర్తూరు (జూపాడుబంగ్లా): తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం శేషవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పన్నీటితో స్నానం చేయించి పట్టువస్త్రాలతో ముస్తాబుచేశారు. వేదమంత్రాల మధ్య స్వామి, అమ్మవార్లను మల్లెపూలతో అలంకరించి అనంతరం పల్లకిలో ఉంచి ఊరేగింపుగా శేషవాహనం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం భక్తుల జయజయ ధ్వానాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శేషవాహనోత్సవానికి విశిష్టత ఉంది. ఈ రోజు స్వామివారికి మల్లెలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటే తమకు సర్పగండం ఉందని భక్తుల నమ్మకం. దీంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మల్లెపూలలను సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో భక్తులు సమర్పించి మల్లెలతో స్వామివారి, అమ్మవారి మూల విగ్రçహాలు నిండిపోయాయి. ఆదివారం హనుమద్వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్ రాయపురంగారెడ్డి తెలిపారు. -
లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జూపాడుబంగ్లా : తర్తూరు లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పూలచపురం కార్యక్రమంలో భాగంగా స్వామివారు పెళ్లి కుమారుడిగా ముస్తాబయ్యారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల మధ్య çపట్టువస్త్రాలతో స్వామివారిని పెళ్లికుమారుడిగా తీర్చిదిద్దారు. స్వామివారు తర్తూరులో పెళ్లికుమారుడిగా ముస్తాబైన అనంతరం ఇక్కడ పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి కల్యాణం నిర్వహించకపోవటంతో బ్రహ్మోత్సవాల అనంతరం స్వామివారు నెల్లూరు జిల్లాల్లోని శ్రీరంగాపురంలో జరిగే కల్యాణవేడుకలకు తరలివెళ్తారని పూజారులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులకు అన్నదానం నిర్వహించారు. పట్టువస్త్రాలు సమర్పించిన ఆర్ఐ.. లక్ష్మిరంగనాథస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధీంద్ర సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నేడు సింహవాహనసేవ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన గురువారం స్వామివారికి సింహవాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్ రాయపుచిన్నరంగారెడ్డి తెలిపారు. -
బ్రహ్మోత్సవాలకు వేళాయే!
- 5 నుంచి లక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాలు - 14 వరకు వేడుకలు - 12న స్వామివారి రథోత్సవం జూపాడుబంగ్లా: ఎనిమిది శతాబ్దాల క్రితం చెక్కబొమ్మరూపంలో దర్శనమిచ్చి అనంతర కాలం నుంచి కొలిచిన వారికి కొంగుబంగారంగా వెలుగొందుతున్న తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామి.. బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వతేదీన నిర్వహించే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తర్తూరు బ్రహోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయచరిత్ర.. సుమారు 720 ఏళ్లక్రితం జూపాడుబంగ్లా మండలం తర్తూరు ఉల్ఫా వంశానికి చెందిన రాజారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురానికి చెందిన రంగమ్మను పెళ్లి చేసుకున్నారు. ఏటా హోలీ పౌర్ణమినాడు శ్రీరంగాపురంలో జరిగే శ్రీలక్ష్మిరంగనాథస్వామి వారి ఉత్సవాలకు దంపతులు వెళ్లేవారు. వేడుకల అనంతరం ఆడ బిడ్డకు పుట్టింటివారు ఒడిబియ్యం పెట్టడం ఆనవాయితీ. ఒడిబియ్యంలో ఆడరూపంలోని ఓ చెక్కబొమ్మను పెట్టి వచ్చే ఉత్సవాలకు పండంటి బిడ్డను ఎత్తుకుని రావాలని ఆకాంక్షించేవారు. ఆ దంపతులు తర్తూరుకు వచ్చి ఒడిబియ్యాన్ని విప్పిచూడగా అందులోని చెక్కబొమ్మ మగరూపంలోకి మారేది. దీంతో మెట్టినింటివారు కోడలిని మందలించేవారు. అలాగే ఏటా వారి వంశస్తులు ఎవ్వరో ఒకరు చనిపోవడంతోపాటు అనారోగ్యాలకు గురయ్యేవారు. ఇలా మూడు, నాలుగు పర్యాయాలు జరగడంతో ఆగ్రహించిన వారు ఆ చెక్కబొమ్మను పశువులగాడిలోకి విసిరివేయగా స్వామివారు పూనకం వచ్చి తాను శ్రీరంగనాథస్వామిగా పేర్కొన్నాడు. తాను తర్తూరులోనే కొలువుంటానని, ఏటా జాతర నిర్వహించి భక్తితో కొలిస్తే అష్టైశ్వర్యాలు, వంశాభివృద్ధి ప్రసాదిస్తానని చెబుతాడు. అప్పటినుంచి ఉల్ఫా వంశస్తులు స్వామివారు కొలువుదీరిన ఇంటితోపాటు 60 ఎకరాల పొలాన్ని స్వామివారికి దారాదత్తం చేసి ఏటా జాతర నిర్వహించేవారు. అలా ప్రారంభమైన జాతరకు రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. జాతర ప్రత్యేకత.. తర్తూరు జాతర అనగానే కలప, ఎద్దుల విక్రయాలు గుర్తుకొస్తాయి. జాతరలో కడుపేదవాడి నుంచి ధనికుని వరకు అవసరమైన వంటింటి, వ్యవసాయ పనిముట్లు లభిస్తాయి. ప్రస్తుతం అటవిశాఖ అధికారులు నిషేధం విధించడంతో కలప పనిముట్ల స్థానంతో ఇనుముతో తయారుచేసిన వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే జాతరలో విక్రయించే కడ్డీల మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ఈ మాసంపు కడ్డీలను తినడానికి భక్తులు ప్రత్యేకంగా జాతరకు వస్తుంటారు. దేవుని ప్రసాదంగా భావించి ఇళ్లకు తీసుకెళ్లి ఆరగిస్తుంటారు. కళ తప్పుతున్న జాతర.. పన్నెండేళ్ల క్రితం వరకు తర్తూరు జాతర నెలరోజుల పాటు జరుగుతుండేది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి సైతం భక్తులు, రైతులు భారీ సంఖ్యలో వచ్చేవారు. స్వామివారికి మొక్కులు తీర్చుకోవడంతో పాటు వారికి అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం జాతరలో కలప విక్రయాలు, రైతులు ఎద్దులబండ్లపై రావడాన్ని అటవీ అధికారులు నిషేధించడంతో క్రమంగా ప్రాధాన్యం తగ్గిపోతోంది. 12న రథోత్సవం.. ఈనెల 5న ప్రారంభమయ్యే తర్తూరు శ్రీలక్ష్మిరంగనాథస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 12వతేదీన స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన పూజారి వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్ రాయపుచిన్నరంగారెడ్డి తెలిపారు. మొదటి రోజు 5న పూలచపురం, 6న సింహవాహనసేవ, 7 హంససేవ, 8నాగేంద్రునిసేవ, 9 హనుమంతునిసేవ, 10 గరుడసేవ, 11 గజవాహనసేవ, 12 రథోత్సవం, 13 పారువేట, 14 తీర్థావళితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.