రమణీయం..రంగనాథుడి రథోత్సవం
జూపాడుబంగ్లా: బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథ స్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారిని బంగారు తొడుగుతో అలంకరించి పట్టువస్త్రాలతో ముస్తాబు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుంచారు. గ్రామంలోని ఆలయాల వద్దకు తీసుకెళ్లి పూజలు జరిపారు. అనంతరం బంతి, మల్లె, సంపెంగ తదితర పూలతో దేదీప్యమానంగా అలంకరించిన రథంపై స్వామివారిని అధిష్టింపజేశారు. ఆయకట్టుదారులైన కుమ్మరులు బోనం తీసుకొచ్చారు. రథం ముందు పూర్ణాహుతి బలిని ఇచ్చారు.
ఆలయ పూజారి నాగిరెడ్డి కుమారుడు ఈశ్వరరెడ్డి స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఐజయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, సర్పంచ్ లక్ష్మిదేవమ్మ, ఆలయ ఈఓ సుబ్రమణ్యం నాయుడు, కమిటీ చైర్మన్ రాయపు చిన్నరంగారెడ్డి... రథంలోని స్వామివారికి, రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథాన్ని జయ జయ ధ్వానాల మధ్య గోవింద నామాన్ని స్మరిస్తూ ముందుకు కదిలించారు. భక్తులు.. స్వామివారి రథోత్సవాన్ని తిలకించి తన్మయత్వంతో ఊగిపోయారు.
రథాన్ని రథశాల నుంచి 100 మీటర్ల దూరం లాగి తిరిగి వెనక్కి తెచ్చి రథశాల వద్దకు చేర్చారు. మండే ఎండలను లెక్కచేయకుండా రథోత్సవాన్ని కనులారా తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ వినోద్‌కుమార్, నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి అధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.