ranganatha swamy
-
‘టిప్పు సుల్తాన్ పిలిస్తే పలికిన... రంగనాథుడు!’
సాక్షి, మద్దికెర (కర్నూలు): మండల పరిధిలోని పెరవలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథుడు పిలిస్తే పలికే దేవుడిగా నిత్యం పూజలందు కుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఒకరోజు మాత్రమే మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటా రు. అయితే పెరవలి శ్రీరంగనాథుడు సతీసమేతంగా 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భాగ్యం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠంలోని శ్రీమహావిష్ణువును దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని ప్రతీతి. ఈ నెల 13 తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోనున్నారు భక్తులు. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు గరుఢ వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సతీసమేతంగా గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ మల్లికార్జున, దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆలయ చరిత్ర : స్వతహా వైకుంఠ ద్వారం కలిగిన ఈ ఆలయంలో రంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవి సతీసమేతుడై పూజలందుకుంటూ నిత్యం ఉత్తరద్వార దర్శన మిస్తున్నారు. స్వామివారు ద్వాదశ అళ్వారులతో వెలిసిన వైష్ణవ క్షేత్రం. తపమాచరించిన రుషుల దర్శనార్థం శ్రీ మన్నారాయణుడే కపిల మహర్షి అవతారమెత్తి ఇచ్చట సాల గ్రామం ఇచ్చట ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తదుపరి విజయనగరరాజులు హరిహరరాయలు, బుక్కరాయలు క్రీ.శ. 1336–37 సంవత్సరంలో దేవాలయం నిర్మించడంతోపాటు ఆలయ నిర్వహణకు వెయ్యి ఎకరాల మాన్యం ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు : ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఏటా ఫల్గుణ శుద్ధ ద్వాదశి నుంచి బహుళ సప్తమి వరకు బ్రహోత్సవాలు జరుగుతాయి. కర్ణాటకలోని శ్రీరంగ పట్టణం రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్న టిప్పు సుల్తాన్ దండయాత్రలు చేసుకుంటూ ఒకరోజు ఇక్కడి వచ్చారని నానుడి. ఆలయాన్ని ధ్వంసం చేయబోయిన టిప్పు సుల్తాన్‌కు స్వామివారు శక్తిమంతుడని ప్రజలు చెప్పారట. ఈ మేరకు స్వామివారిని పరీక్షించేందుకు ఆయన శ్రీరంగనాథా అని పిలువగా ఓయ్ అంటూ పలికారని నానుడి. దీంతో టిప్పు సుల్తాన్ స్వామివారిని దర్శించుకుని తన అశ్వం ఎంతవరకు పరిగెడితే అంతవరకు స్వామివారికి భూమి ఇచ్చాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. -
కర్రల 'సమరం'
కర్ణాటక, దొడ్డబళ్ళాపురం : సాంప్రదాయాలకు, సంస్కృతికీ పెట్టిందిపేరు భారతదేశం...ఇక్కడ ఆచరించే ధా ర్మిక ఆచరణలు పైకి మాఢనమ్మకంలా కనిపించి నా ఆ ఆచరణ వెనుక బలమైన కారణాలు, నేపథ్యం ఉంటాయి. ఇలాంటి ఆచరణలు గ్రామాల్లో అధికంగా కనిపిస్తాయి. ఈ ఆధునిక యుగంలోనూ ఇలాంటి ధార్మిక ఆచరణ ఒకటి ఉందంటే అతిశయోక్తి కాదుమరి.. జాతరలో జనం వెర్రెత్తి, కత్తులు, కట్టెలు, మారణాయుధాలు గట్రా చేతబట్టి కొట్టుకుంటూ, జంతువులను వేటాడ్డం మీకు తెలుసా? ...దొడ్డబళ్లాపురం తాలూకాలోని హులికుంటె గ్రామంలో ఇలాంటి జాతరే ఒకటి గత ఆరు వందల సంవత్సరాలుగా ఆచరించబడుతూ వస్తోంది. గురువారం సాయంత్రం హులికుంటలో ఈ జాతరను అత్యంత వైభవంగా ఆచరించారు. నేపథ్యం : జాతరకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను గ్రామస్తులు చెబుతారు. మాగడి తాలూకా ఆరాధ్య దైవం రంగనాథస్వామి, దొడ్డబళ్లాపురం తాలూకా హణబె, చుట్టు పక్కల గ్రామస్తుల ఇష్టదైవం హణబె రంగనాథ, హులికుంటె చుట్టు పక్కల గ్రామస్తుల దేవుడు హులికుంటె రంగనాథస్వామి ముగ్గురూ కలిసి హులి టలో రంగనాథ స్వామి గుడి కట్టించి యుద్ధానికి సిద్ధమవుతారు. యుద్ధం ఎందుకు జరిగిందీ గ్రామస్తులు వివరించరు. అది దైవ రహస్యంగా భావిస్తారు. వేట రంగనాథ హూవాడిగ నాయకులను గుర్రాలుగా చేసుకుని సంగీత వాద్యాలతో యుద్ధానికి బయలు దేరతాడు. దారి మధ్యలో చన్నబసవయ్య నపాళ్య వద్ద పాము పుట్టకు పూజలు చేసి, కట్టెలు అంటించి పొగబెట్టి బలి కావాలని గగ్గోలు పెడుతూ ముందుకు సాగుతాడు. ఈ తతంగాన్నే జాతరలో కీలక భాగంగా భావించి ఇప్పటికీ ఆచరించడం ప్రత్యేకత. అక్కడి నుండి కాస్త దూరంలోనే రంగ నాథస్వామికి మంచి వేట దొరికింది. వేట దొరికిన స్థలంలోనే ఒక మండపాన్ని కట్టి ఆ స్వామిని శాంతింపజేయడం జరిగింది. నేటికీ అదే మండపం వద్ద రంగనాథ స్వామికి వేట ముగిసాక ప్రత్యేక పూజలు జరుగుతాయి. అప్పుడు జరిగింది యుద్ధమా? లేక వేటా? అనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ ఈ జాతరను ‘ కోలు బేటె ’ (కట్టెల వేట) జాతరగానే పిలుస్తారు. ఎప్పుడు జరుగుతుంది? : ప్రతి సంవత్సరం డిసెంబరు నెల చివరి గురువారం ఈ జాతర ఆచరిస్తారు. పండిన పంటల కోతలు కోసి ధాన్యాన్ని పొలాల్లోనే సేకరించి ఉంచడం అప్పడు పరిపాటిగా ఉండేది. ధాన్యాన్ని అడవి జంతువులు, ఇతర ప్రాణుల నుండి రక్షించుకునేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు ఇలాంటి వైవిధ్యమైన జాతరకు శ్రీకారం చుట్టారని కూడా చెబుతారు. మరో సమాచారం ప్రకారం ఒకప్పుడు హులికుంట, చుట్టుపక్కల గ్రామాల పరిసరాల్లో దట్టమైన అరణ్యం ఉండేది. డిసెంబరు నెలలో కుందేళ్ల బెడద ఎక్కువగా ఉండేదట. వాటిని నియంత్రించడానికే ఈ వేట పండగ ఆచరిస్తారట. పదిహేను సంవత్సరాల క్రితం వరకూ జాతరలో భాగంగా జనం అడవుల్లో తిరిగి నిజంగానే అడవి జంతువులను వేటాడి తెచ్చి రంగనాథస్వామికి నైవేద్యంగా పెట్టేవారు. అయితే జంతువులను వేటాడ్డం చట్ట విరుద్ధం కావడం వల్ల ఇటీవల జంతువుల వేట కేవలం నామమాత్రానికే మిగిలింది. హలికుంటలోని రంగనాథ స్వామి దేవాలయం నుండి స్వామిని పల్లకీలో ఊనేగింపుగా తీసుకువచ్చి గ్రామం శివాలోగల రంగనాథ స్వామి మండపం వద్ద దించి ప్రత్యేక పూజలు చేసి జాతర ఆచరిస్తారు. ఈ జాతరకు చుట్టుపక్కల 160 గ్రామాల ప్రజలు తరలి వస్తారు. కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు, కట్టెలు చేతబట్టి జనం సాంకేతికంగా కొట్టుకుంటారు. -
రమణీయం..రంగనాథుడి రథోత్సవం
జూపాడుబంగ్లా: బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథ స్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారిని బంగారు తొడుగుతో అలంకరించి పట్టువస్త్రాలతో ముస్తాబు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుంచారు. గ్రామంలోని ఆలయాల వద్దకు తీసుకెళ్లి పూజలు జరిపారు. అనంతరం బంతి, మల్లె, సంపెంగ తదితర పూలతో దేదీప్యమానంగా అలంకరించిన రథంపై స్వామివారిని అధిష్టింపజేశారు. ఆయకట్టుదారులైన కుమ్మరులు బోనం తీసుకొచ్చారు. రథం ముందు పూర్ణాహుతి బలిని ఇచ్చారు. ఆలయ పూజారి నాగిరెడ్డి కుమారుడు ఈశ్వరరెడ్డి స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఐజయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, సర్పంచ్ లక్ష్మిదేవమ్మ, ఆలయ ఈఓ సుబ్రమణ్యం నాయుడు, కమిటీ చైర్మన్ రాయపు చిన్నరంగారెడ్డి... రథంలోని స్వామివారికి, రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథాన్ని జయ జయ ధ్వానాల మధ్య గోవింద నామాన్ని స్మరిస్తూ ముందుకు కదిలించారు. భక్తులు.. స్వామివారి రథోత్సవాన్ని తిలకించి తన్మయత్వంతో ఊగిపోయారు. రథాన్ని రథశాల నుంచి 100 మీటర్ల దూరం లాగి తిరిగి వెనక్కి తెచ్చి రథశాల వద్దకు చేర్చారు. మండే ఎండలను లెక్కచేయకుండా రథోత్సవాన్ని కనులారా తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ వినోద్‌కుమార్, నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి అధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
గరుడ వాహనంపై విహరించిన రంగనాథుడు
జూపాడుబంగ్లా : తర్తూరు శ్రీలక్ష్మీ రంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు గరుడవాహనంపై గ్రామంలో విహరించారు. వేదమంత్రాల మధ్య స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. పట్టువస్త్రాలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పల్లకి గరుడవాహనం వద్దకు తీసుకొచ్చారు. స్వామివారిని వాహనంపై అధిష్టింపజేసి గోవింద నామాన్ని స్మరిస్తూ పురవీధుల్లో తిప్పారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి కాయ, కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గరుడోత్సవాన్ని పురుస్కరించుకొని చందా, గుండు ఎత్తే పందేలను నిర్వహించారు. గెలుపొందిన వారికి స్వామివారిని అలంకరించిన పూలమాలలతో సత్కరించారు.