వృద్ధురాలి జుట్టు పట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యం (నిందితురాలు మంగాదేవి)
మాయమవుతున్నాడమ్మో... మనిషన్నవాడు... అవును..మానవత మాయమైపోతుంది. ముసలితనంలో కాళ్లు చచ్చుబడిపోయి.. మంచానికే పరిమితమైన ఆ ముదుసలిని చిత్ర హింసలు పెట్టడానికి అసలు మనసెలా వచ్చింది. కర్రతో కొడుతున్నా... బాధను పైకి వ్యక్త పరిస్తే.. మరలా కొట్టడం... రాక్షసత్వానికి నిదర్శనం. ఆస్తి తన కుమారుడి పేరున రాయాలని వృద్ధురాలిని హింసించడం పలువురిని కంటతడిపెట్టించింది. స్థానికులు స్పందించారు. ఈ హింసను చూసి తట్టుకోలేక.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వారి బండారం బయటపడింది.
రాజమహేంద్రవరం క్రైం : రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతి భర్త దొరయ్య మృతి చెందాడు. పుష్పవతికి వారసులు లేరు. దీంతో తన చిన్నమ్మ కుమార్తె చెల్లెలయ్యే రాజమహేంద్రవరం హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న ప్రగడ మంగాదేవి ఇంట్లో కొంత కాలంగా ఉంటోంది. పుష్పవతి పేరున రాజానగరం మండలం తోకాడ వద్ద ఒక ఇల్లు, స్థలం ఉండడంతో మంగాదేవి ఆమెను నరేంద్రపురం నుంచి తీసుకువచ్చి మూడు నెలలుగా తన కుమారుడి పేరున స్థలం, ఇల్లు రాయాలని చిత్రహింసలకు గురి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు.
కాళ్లు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమైన పుష్పవతిని సంతకం చేయాలంటూ నిత్యం జుట్టుపట్టుకొని కర్రతో కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. కదలలేని స్థితిలో ఉండి కొట్టినప్పుడు బాధతో అరిస్తే మరలా ఆ ఆరుపులు ఆపేవరకూ కొట్టేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనను చుట్టుపక్కల వారు గమనించి వీడియో తీసి సోషల్ మిడియాలో పెట్టడంతో కలకలం మొదలైంది. స్థానికుల సహాయంలో వృద్ధురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మహిళా సంఘాల నాయకులు మంగాదేవిని నిలదీసినప్పుడు ఆమె ఎవరో తెలియదని, అనాదను చేరదీసి చూస్తున్నామంటూ ఆమె బుకాయించేందుకు ప్రయత్నించింది. నిందితురాలు ప్రగడ మంగాదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రాణాపాయ స్థితిలో పుష్పవతి
ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో పుష్పవతి ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. మంచానికే పరిమితమైన ఆమెను కర్రతో కాళ్లమీద, డొక్కలలోను, కడుపు పైన కొట్టడంతో లోపల అవయవాలు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. వృద్ధురాలి వంటి పై ఉన్న గాయాల ఆధారంగా చాలా కాలంగా చిత్రహింసలకు గురి చేస్తోందని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం పుష్పవతి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment