tusker
-
‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం.... భూమాతకు తీరని శోకం!
భూమండలంపై అత్యంత భారీకాయంతో సంచరించే శాకాహార బాహుబలిగా ఏనుగు మనందరికీ చిరపరిచితం. ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సర్వసాధారణంగా కనిపించే ‘సవన్నా’, ‘అటవీ’జాతి ఏనుగులు అత్యంత వేగంగా అంతర్థానమవుతున్నాయి. అటవీప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిన మానవ కార్యకలాపాలు, విస్తరిస్తున్న వ్యవసాయం, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో.. సర్వేచేసిన ప్రాంతాల్లో సవన్నా జాతి ఏనుగుల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ‘ఫారెస్ట్’జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా 90 శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కల్పిస్తోంది.అత్యంత తెలివి అత్యంత తెలివితేటలతోపాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగు పేరొందింది. 1964 నుంచి 2016 సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని 475 భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృతస్థాయి గణన, పరిశోధన చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇంతటి విస్తృత సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. సంబంధిత నివేదిక సోమవారం వెల్లడైంది. దీనిలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. సవన్నా, ఫారెస్ట్ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా 77 శాతం తగ్గిపోయింది. విడిగా చూస్తే సవన్నా జాతి 70 శాతం, ఫారెస్ట్ జాతి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు గుంపులగుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అవి ఒక్కటికూడా లేవని సర్వేలో తేలింది. అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘‘తగ్గిపోయిన సంఖ్యను ఎలాగూ పెంచలేము. ఉన్న ఏనుగుల సంఖ్యా వేగంగా క్షీణిస్తోంది. మాలి, చాద్, నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయింది’’ అని కొలరాడో స్టేట్ వర్సిటీలో వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ విభాగ ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ చెప్పారు.కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకోర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు. ప్రభుత్వాల చొరవ, స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య అక్కడ పెరిగింది. బొట్సావా, జింబాబ్వే, నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగానే ఉంది. ‘‘కొన్ని చోట్ల మనం విజయం సాధించాం. ఈ విషయంలో మనకు మనం శెభాష్ చెప్పకోవాల్సిందే. అయితే ఇంకా ఏఏ ప్రాంతాల్లో విజయావకాశాలు ఉన్నాయో కనిపెట్టి కార్యసాధకులం కావాల్సిన తరుణమొచ్చింది’’అని ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ అన్నారు.ఏనుగు దంతాలపై మోజుతో.. చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు. వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని జంతుప్రేమికులు చెబుతున్నారు. అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను, ఆహార వనరులను కోల్పోతున్నాయి. చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!‘‘అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం. ఎన్నో రకాల చెట్ల కాయలు, పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణంచేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి. నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం భూమాతకు తీరని శోకం’’ అని సౌత్ ఆఫ్రికాలోని నెల్సన్ మండేలా యూనివర్సిటీలోని ఆఫ్రికన్ కన్జర్వేషన్ ఎకాలజీ అధ్యయనకారుడు, నివేదిక సహరచయిత డేవ్ బల్ఫోర్ ఆందోళన వ్యక్తంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు!
ఒకటి రెండు సింహాలు ఉంటేనే మిగిలిన జంతువులు హడలిపోతాయి. అలాంటిది ఒంటరిగా ఉన్నప్పుడు పదికిపైగా సింహాలు ఒక్కసారిగా వెంటపడితే అంతే ఇక.. వాటికి ఆహారమైపోయినట్లేనని భావించాల్సిందే. అయితే.. తనను వేటాడేందుకు 14 ఆడ సింహాలు వెంటపడుతున్నా జవలేదు ఓ గజరాజు. ఒంటరిగా ఉన్న బెదరకుండా వాటి బారి నుంచి తప్పించుకుంది. సింహాలను గజరాజు ఏవిధంగా ఎదిరించిందనే విషయాన్ని చెబుతూ ఆ దృశ్యాలను అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఒంటరిగా ఉన్న ఏనుగును 14 ఆడ సింహాలు వేటాడేందుకు ప్రయత్నించినా.. వాటిపై గెలిచింది. ఇక్కడ అడవికి రాజు ఎవరు అని ఊహిస్తున్నారు?’ అని రాసుకొచ్చారు. వీడియోలో.. ఓ నదిలోకి నీళ్లు తాగేందుకు వచ్చిన గజరాజుపై దాడి చేశాయి సింహాలు. ఓ సింహం దానిపైకి ఎక్కి అధిమిపట్టే ప్రయత్నం చేయగా.. మిగిలినవి కాళ్లు, ఇతర భాగాలను నోట కరిచేందుకు యత్నించాయి. వాటిబారి నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది ఏనుగు. కాళ్లతో తంతూ తొండంతో కొడుతూ చెదరగొట్టింది. అయినా.. అవి వెనక్కి తగ్గకపోవటంతో నీటిలోకి వెళ్లింది. కొంత దూరం వరకు వెళ్లిన సింహాలు.. ఇక ఏనుగు తమకు చిక్కదని భావించి వెనుదిరిగాయి. Lone tusker takes on 14 lionesses & wins… Who should be than king of forest ? Via Clement Ben pic.twitter.com/kYbZNvabFv — Susanta Nanda IFS (@susantananda3) August 27, 2022 ఇదీ చదవండి: పొలంలో నిద్రిస్తున్న మహిళపైకి నాగుపాము.. ఎలా తప్పించుకుందంటే? -
పలమనేరు: రోడ్డుపై మదపుటేనుగు హల్చల్
సాక్షి, పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు– గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిపై ముసలిమొడుగు వద్ద మదపుటేనుగు శుక్రవారం హల్చల్ చేసింది. సమీపంలోని కౌండిన్య అభయారణ్యం నుంచి రోడ్డుపైకి వచ్చిన ఏనుగు రోడ్డును దాటి తూర్పు వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ కారణంగా వెళ్లలేక రోడ్డుపైనే 2 గంటలపాటు తిరుగుతూ ఉండిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఏనుగు తిరుగుతుండటంతో జనం భయంతో పరుగులు తీశారు. చాలాసేపు అక్కడే ఉన్న మదపుటేనుగు తిరిగి కృష్ణాపురం అటవీ ప్రాంతం వైపుగా వెళ్లిపోయింది. -
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుంది
మైసూరు: రైలు పట్టాల పక్కన ఉండే ఇనుప కంచె కింద ఇరుక్కున్న ఓ అడవి ఏనుగు ప్రాణాల కోసం పెనుగులాడింది. ఈ ఘటన మైసూరు జిల్లా సరగోరు తాలూకా ఎన్.బేగూరు అటవీ ప్రాంతంలో జరిగింది. అటవీ ప్రాంతంలో నుంచి ఒక మగ ఏనుగు బేగూరులో సంచరించి బుధవారం ఉదయం తిరిగి అడవికి బయలుదేరింది. ఈ సందర్భంలో రైలు పట్టాల కంచెను దాటేందుకు యత్నించి దాని కింద చిక్కుకుని పెనుగులాడసాగింది. అనేక ప్రయత్నాలు చేస్తూ నరకయాతన అనుభవించింది. ఏనుగు ఘీంకారాలు విని ప్రజలు అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు వచ్చి కడ్డీలను తొలగించి గజరాజును రక్షించారు. ముదుమలై శరణాలయంలో ఏనుగు మృతి సాక్షి, చెన్నై: తమిళనాడులోని నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయంలో ఓ ఏనుగును గుర్తుతెలియని వ్యక్తులు చిత్ర హింసలు పెట్టి, అది మరణించే రీతిలో వ్యవహరించి ఉండడం బుధవారం వెలుగులోకి వచ్చింది. ముదుమలై పులుల శరణాలయం తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ సింగార అటవీ ప్రాంతంలో గాయాలతో 40 ఏళ్ల ఓ ఏనుగు కొద్ది రోజులుగా తిరుగుతూ వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, వైద్య బృందాలు ఆ ఏనుగుకు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆ ఏనుగు మృతిచెందింది. ఆ మృతదేహానికి జరిపిన పోస్టుమార్టంలో ఏనుగుకు చిత్రహింసలు పెట్టి ఉండడం వెలుగు చూసింది. ఏనుగు చెవిలో నిప్పు కణికలు, యాసిడ్ తరహాలో పదార్థం ఉండడంతో ఎవరో చిత్రహింసలకు గురి చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వీటి వల్ల ఏర్పడిన గాయాలతోనే ఏనుగు మృతిచెంది ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైరల్: పిచ్చెక్కినట్లుగా కొట్టుకున్న పులులు అమెజాన్లో ఆవు పిడకలు.. ఛీ రుచిగా లేవంటూ.. -
మూడు చెరువుల నీళ్లు తాగించిన టస్కర్..
భువనేశ్వర్: రెండున్నర నెలలకుపైగా అధికారులకు చెమటలు పట్టించిన టస్కర్ కష్టాలు తీరిపోయాయి. అదేంటీ.. అధికారులకు చిక్కులు తెచ్చిన టస్కర్ కష్టాలు రెట్టింపవ్వాలి కానీ తీరడమేంటనే కదా మీ సందేహం. అయితే ఈ వివరాలు తెలుసుకోవాలి. టస్కర్ అనేది 13 ఏళ్ల మగ ఏనుగు. ఒడిషాలోని రెండు అటవీ ప్రాంతాల అటవీశాఖ అధికారులను గత మూడు నెలలుగా మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఈ ఏడాది జనవరిలో అత్తాగఢ్ ఫారెస్ట్ డివిజన్ లోని సుభాషి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి టస్కర్ అనే ఏనుగు తప్పించుకుంది. ఈ క్రమంలో టస్కర్ ఎడమకాలి పాదం ఓ స్కూటర్ టైరులో ఇరుక్కుపోయింది. ఇక అప్పటినుంచీ ఏనుగును పట్టుకునేందుకు 50 మంది వన్యసంరక్షణ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరగా రెండున్నర నెలల తర్వాత సోమవారం సాయంత్రం టస్కర్ కు టైరు బాధ నుంచి విముక్తి కలిగించారు. టైరు ఉన్న సమయంలో ఏనుగు ఎవరికి చిక్కేదికాదని, అదే సమయంలో తమపై ఎదురుదాడికి దిగేదని ఫారెస్ట్ డివిజన్ అధికారి అరుణ్ కుమార్ స్వెయిన్ తెలిపారు. ఎంతో మంది నిపుణులను రంగంలోకి దించినా ఏనుగును పట్టుకుని టైరు తీసేయడానికి తమకు చాలా సమయం పట్టిందన్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఖారకోలా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి సుభాషి పారెస్ట్ వైపు పరుగులు పెడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఏనుగును మచ్చిక చేసుకున్నారు. ఒడిషా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఇంద్రమణి నాథ్ ఆధ్వర్యంలో టస్కర్ ఎడమ కాలుకు ఉన్న టైరును తొలగించేశారు. ఏనుగును పట్టుకునే క్రమంలో ఫారెస్ట్ గార్డ్ ప్రమోద్ నాయక్ గాయపడ్డాడు. స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టైరు గాయం నుంచి టస్కర్ కూడా కోలుకుంటుదని అటవీశాఖ తెలిపింది.