మైసూరు: రైలు పట్టాల పక్కన ఉండే ఇనుప కంచె కింద ఇరుక్కున్న ఓ అడవి ఏనుగు ప్రాణాల కోసం పెనుగులాడింది. ఈ ఘటన మైసూరు జిల్లా సరగోరు తాలూకా ఎన్.బేగూరు అటవీ ప్రాంతంలో జరిగింది. అటవీ ప్రాంతంలో నుంచి ఒక మగ ఏనుగు బేగూరులో సంచరించి బుధవారం ఉదయం తిరిగి అడవికి బయలుదేరింది. ఈ సందర్భంలో రైలు పట్టాల కంచెను దాటేందుకు యత్నించి దాని కింద చిక్కుకుని పెనుగులాడసాగింది. అనేక ప్రయత్నాలు చేస్తూ నరకయాతన అనుభవించింది. ఏనుగు ఘీంకారాలు విని ప్రజలు అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు వచ్చి కడ్డీలను తొలగించి గజరాజును రక్షించారు.
ముదుమలై శరణాలయంలో ఏనుగు మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయంలో ఓ ఏనుగును గుర్తుతెలియని వ్యక్తులు చిత్ర హింసలు పెట్టి, అది మరణించే రీతిలో వ్యవహరించి ఉండడం బుధవారం వెలుగులోకి వచ్చింది. ముదుమలై పులుల శరణాలయం తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ సింగార అటవీ ప్రాంతంలో గాయాలతో 40 ఏళ్ల ఓ ఏనుగు కొద్ది రోజులుగా తిరుగుతూ వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, వైద్య బృందాలు ఆ ఏనుగుకు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆ ఏనుగు మృతిచెందింది. ఆ మృతదేహానికి జరిపిన పోస్టుమార్టంలో ఏనుగుకు చిత్రహింసలు పెట్టి ఉండడం వెలుగు చూసింది. ఏనుగు చెవిలో నిప్పు కణికలు, యాసిడ్ తరహాలో పదార్థం ఉండడంతో ఎవరో చిత్రహింసలకు గురి చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వీటి వల్ల ఏర్పడిన గాయాలతోనే ఏనుగు మృతిచెంది ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment