మూడు చెరువుల నీళ్లు తాగించిన టస్కర్..
భువనేశ్వర్: రెండున్నర నెలలకుపైగా అధికారులకు చెమటలు పట్టించిన టస్కర్ కష్టాలు తీరిపోయాయి. అదేంటీ.. అధికారులకు చిక్కులు తెచ్చిన టస్కర్ కష్టాలు రెట్టింపవ్వాలి కానీ తీరడమేంటనే కదా మీ సందేహం. అయితే ఈ వివరాలు తెలుసుకోవాలి. టస్కర్ అనేది 13 ఏళ్ల మగ ఏనుగు. ఒడిషాలోని రెండు అటవీ ప్రాంతాల అటవీశాఖ అధికారులను గత మూడు నెలలుగా మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఈ ఏడాది జనవరిలో అత్తాగఢ్ ఫారెస్ట్ డివిజన్ లోని సుభాషి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి టస్కర్ అనే ఏనుగు తప్పించుకుంది.
ఈ క్రమంలో టస‍్కర్ ఎడమకాలి పాదం ఓ స్కూటర్ టైరులో ఇరుక్కుపోయింది. ఇక అప్పటినుంచీ ఏనుగును పట్టుకునేందుకు 50 మంది వన్యసంరక్షణ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరగా రెండున్నర నెలల తర్వాత సోమవారం సాయంత్రం టస్కర్ కు టైరు బాధ నుంచి విముక్తి కలిగించారు. టైరు ఉన్న సమయంలో ఏనుగు ఎవరికి చిక్కేదికాదని, అదే సమయంలో తమపై ఎదురుదాడికి దిగేదని ఫారెస్ట్ డివిజన్ అధికారి అరుణ్ కుమార్ స్వెయిన్ తెలిపారు.
ఎంతో మంది నిపుణులను రంగంలోకి దించినా ఏనుగును పట్టుకుని టైరు తీసేయడానికి తమకు చాలా సమయం పట్టిందన్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఖారకోలా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి సుభాషి పారెస్ట్ వైపు పరుగులు పెడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఏనుగును మచ్చిక చేసుకున్నారు. ఒడిషా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఇంద్రమణి నాథ్ ఆధ్వర్యంలో టస్కర్ ఎడమ కాలుకు ఉన్న టైరును తొలగించేశారు. ఏనుగును పట్టుకునే క్రమంలో ఫారెస్ట్ గార్డ్ ప్రమోద్ నాయక్ గాయపడ్డాడు. స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టైరు గాయం నుంచి టస్కర్ కూడా కోలుకుంటుదని అటవీశాఖ తెలిపింది.