జిల్లాలో సీట్ల సర్దుబాటులలో వీడని ఉత్కంఠ.. | Congress Not Confirm To Seat Distribution,Mahabubnagar | Sakshi
Sakshi News home page

జిల్లాలో సీట్ల సర్దుబాటులలో వీడని ఉత్కంఠ..

Published Sat, Nov 10 2018 8:57 AM | Last Updated on Sat, Nov 10 2018 8:57 AM

Congress Not Confirm To Seat Distribution,Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల మరికాస్త ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి పలు వాయిదాల అనంతరం పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ ముఖ్యులు వెల్లడించారు. అందులో భాగంగా ఎలాంటి వివాదం లేని స్థానాల నుంచి బరిలో నిలిచే అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ తరఫున దాదాపు 10 స్థానాలకు పోటీ చేసే నేతల పేర్లను అధిష్టానం ఆమోదించింది. ఆయా స్థానాల్లో అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ టీపీసీసీ ముఖ్యనేతలు మేనిఫేస్టో రూపకల్పనలో భాగంగా దుబాయి పర్యటనకు వెళ్లారు. దీంతో అభ్యర్థుల పేర్లను శనివారం వెల్లడించే అవకాశం అనుమానమేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే వారి విషయమై ఏకాభిప్రాయం కోసం పరిశీలన సాగుతోంది. ఇంకా కాంగ్రెస్‌లో అసంతృప్తులను బుజ్జగించి ఒకేసారి నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యే 12వ తేదీనే మొత్తంఅభ్యర్థుల పేర్లు ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. 
టీడీపీకి మాత్రమే స్థానం 
కాంగ్రెస్‌ నేతృత్వంలో రూపం సంతరించుకున్న మహాకూటమి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాగస్వామ్య పక్షాలకు స్థానం దక్కడం లేదని తెలుస్తోంది. కేవలం కూటమిలోని టీడీపీకి మాత్రమే రెండు స్థానాలు మాత్రమే కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క స్థానం కోసం తీవ్రంగా పట్టుబడుతోంది. స్థానం దక్కించుకోవడానికి ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానంతో సంప్రదింపులు సైతం చేస్తోంది. అయితే టీజేఎస్‌ కోరుతున్న మహబూబ్‌నగర్‌ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా టీడీపీ తరఫున బీసీ అభ్యర్థిని నిలబెడుతుండడంతో... టీజీఎస్‌కు సర్దుబాటు చేసే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. టీజేఎస్‌ తరఫున బరిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలంగాణ ఇంటి పార్టీకి కూడా అవకాశం దక్కడం లేదని తెలుస్తోంది. తెలంగాణ ఇంటి పార్టీ తరఫున బరిలో నిలవాలని భావిస్తున్న యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం మహబూబ్‌నగర్‌ స్థానం కోసం పట్టుబడుతున్నారు. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా సర్దుబాటు చేసే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

అందుకే ఆలస్యమా? 
కాంగ్రెస్‌ తరఫున కొన్ని స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశపడుతున్న వారందరినీ ఇటీవల ఢిల్లీకి పిలిచిన అధిష్టానం నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాదు బరిలో ఎవరు నిలిచినా మిగతా వారు మద్దుత తెలపాలని సూచించింది. పోటీలో నిలవకుండా త్యాగం చేసిన వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామంటూ భరోసా ఇచ్చారు. అందుకు కొందరు సమ్మతించగా.. మరికొన్ని చోట్ల మాత్రం అసంతృప్తులు పార్టీ ఫిరాయించే ప్రమాదముందని కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను మరికాస్త ఆలస్యం చేయడం ద్వారా నామినేషన్ల పర్వం మొదలైతే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా అనేక సమీకరణాల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు మరికాస్త సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అన్ని స్థానాలకు అభ్యర్థులను 12న ప్రకటించే అవకాశమే ఎక్కువగా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

 పొంచి ఉన్న రెబెల్స్‌ బెడద  
    రానున్న ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ పార్టీకి రెబెల్స్‌ బెడద ఖాయమని తెలుస్తోంది. కూటమిలో భాగంగా రెండు స్థానాల్లో పోటీకి దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. అంతేకాదు మరికొన్ని చోట్ల కూడా ఆశావహులు ఎక్కవగా ఉండటంతో ఎంపిక ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా కూటమికి కేటాయించే రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు రెబెల్స్‌గా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి టీడీపీకి అవకాశం కల్పిస్తే టీపీసీసీ కార్యదర్శిగా ఉన్న మారేపల్లి సురేందర్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన అనుచరగణం పత్రికా ప్రకటనలతో హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే మక్తల్‌లో కూడా టీడీపీ అవకావం ఇస్తున్నందున.. కాంగ్రెస్‌ తరఫున జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేసే ఒకటి, రెండు చోట్ల కూడా అసంతృప్తులు బరిలో దిగాలని భావిస్తున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement