సాక్షి, వనపర్తి: నామినేషన్ మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. గంటలు గడుస్తున్నా కొద్దీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. క్షణక్షణాన్ని లెక్కించుకుంటూ అధిష్టానం పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న మహాకూటమి తరఫున కొల్లాపూర్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థులు ఎవరనే విషయం ఇంకా తేలకపోవడంతో కాంగ్రెస్, టీడీపీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారితో పాటు ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.
నామినేషన్లు దాఖలుచేసేందుకు చివరి గడువు ఈనెల 19వ తేదీతో ముగియనుంది. ప్రచారానికి పట్టుమని 15రోజు సమయం కూడా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆశావహులు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో పొత్తు, సీట్ల విషయం కొలిక్కి వచ్చాక కూడా అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఖరారు చేయకపోవడంతో టికెట్లను ఆశిస్తున్న వారు లోలోపల రగిలిపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత65 మందికి, రెండో విడత 10 మందికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా కూటమిలోని టీడీపీ ఇప్పటివరకు 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు.
ఇద్దరి మధ్యే తీవ్రపోటీ
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి మహాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించనున్నారు. 2014ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి వెంట పార్టీలో చేరిన జగదీశ్వర్‌రావు టికెట్‌ను ఆశిస్తున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి గత ఎన్నికల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు గట్టిపోటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య కేవలం 6శాతం మాత్రమే తేడా ఉంది.
ఈసారి టికెట్ వస్తుందని నాలుగేళ్లుగా అనుకుంటూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన హర్షవర్ధన్‌రెడ్డికి కొన్నినెలల క్రితం కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌రావు మధ్య నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి జగదీశ్వర్‌రావుకు మద్దతి ఇస్తుండగా, హర్షవర్ధన్‌రెడ్డికి మాజీమంత్రి డీకే అరుణ టికెట్ ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సిద్ధమైన జాబితాలో హర్షవర్ధన్‌రెడ్డి పేరు ఖరారైందని వస్తున్న వార్తలో ఏమేర నిజం ఉందో అభ్యర్థులే తేల్చుకోవాల్సి ఉంది.
బీసీలకు దక్కేనా..?
దేవరకద్ర నియోజకవర్గం సీటును నిన్న మొన్నటి వరకు పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయిస్తారని వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే ఈ స్థానాన్ని కేటాయిస్తారని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన డోకూరి పవన్‌కుమార్‌రెడ్డి ఈ సారి కూడా తనకే టికెట్ వస్తుందని భావిస్తున్నారు.
కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నుంచి బీసీలకు ఒక్క స్థానమైనా కేటాయించలేదనే అపవాదు నెలకొనే అవకాశం ఉందని భావించి బీసీ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్, రామేశ్వర రావు ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల పెద్దగా సమయం లేకపోవడంతో నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రగిలిపోతున్న కేడర్
కొల్లాపూర్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాలకు మహాకూటమి అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించకపోవడంతో డోకూరి పవన్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులు లోలోపల రగిలిపోతున్నారు. పవన్‌కుమార్‌రెడ్డికి శనివారంలోగా టికెట్ ప్రకటించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఆయన అనుచరులు ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొల్లాపూర్‌లోనూ హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులు పార్టీ అధిష్టానం తీరుపై కోపంతో రగిలిపోతున్నారు. ఇదిలాఉండగా, టీఆర్‌ఎస్ రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించడంతో నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే అన్ని గ్రామాలు, మండలాలను చుట్టేశారు. ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. కానీ కూటమి అభ్యర్థులు ఎవరనే విషయం తేలకపోవడంతో కిందిస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తల్లోనూ నైరాశ్యం నెలకొంది. ఏదేమైనా నామినేషన్లకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో నేడోరేపో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇన్ని రోజుల పాటు టికెట్లను ఆశించి ఎదురుచూసిన అభ్యర్థులకు టికెట్లు రాకపోతే పరిస్థితి ఏమిటన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment