సాక్షి, కల్వకుర్తి టౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైంది. అలాంటి ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ అవగాహన కల్పిస్తోంది. అయితే, ఓటు వేయాలనే భావన ఉన్నా అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఎలా అనే పరిస్థితి తలెత్తేది. కానీ కొన్నేళ్ల క్రితం ఎన్నికల కమిషన్ ఈవీఎంల్లో నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్) ఆప్షన్‌కు కూడా ప్రవేశపెట్టింది.
దీంతో అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేస్తున్నారు. ఈ సందర్భంగా నోటాకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 13,702 ఓట్లు పోలయ్యాయి. నోటాకు పోలైన ఓట్లలో 36 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కూడా ఉండడం గమనార్హం.
జడ్చర్లలో అత్యధికం
ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలో 14 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా జడ్చర్ల నియోజకవర్గంలో 1,537 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇందులో 5 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇక అత్యల్పంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 581 ఓట్లు పోటాకు పోలయ్యాయి. కాగా, పలు నియోజకవర్గాలలో నోటా కంటే తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం.
గత ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గంలో 14 మంది పోటీ చేయగా అందులో ఎనిమిది మందికి నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా వచ్చాయి. అలాగే కొడంగల్ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్ధులు పోటీ చేయగా ఒక అభ్యర్ధికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. కాగా, నోటాకు పోలయ్యే ఓట్ల సంఖ్య రానురాను పెరగొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా 2014 లో నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్లు, పోలైన ఓట్లు, నోటాకు నమోదైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
- జడ్చర్ల నియోజకవర్గంలో 1,91,077 మంది ఓటర్లకు 1,46,551 ఓట్లు పోలయ్యాయి. ఇక 1,537 ఓట్లు నోటాకు, ఐదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఏడు మంది అభ్యర్ధులు పోటీ చేయగా ఇద్దరికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి.
- నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 2,04,630 మంది ఓటర్లు ఉండగా 1,51,180 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 581 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గానికి పద్నాలుగు మంది అభ్యర్ధులు పోటీచేయగా ఏడుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి.
- కొల్లాపూర్ నియోజకవర్గంలో 2,08,312 మంది ఓటర్లు ఉండగా 1,55,532 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 767 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గానికి 12 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఐదుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు నమోదు కావడం గమనార్హం.
- వనపర్తి నియోజకవర్గంలో 2,36,908 మంది ఓటర్లు ఉండగా 1,68,370 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 860 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి 12 మంది అభ్యర్ధులు పోటీ చేయగా ఆరుగురు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
- మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 2,19,880 మంది ఓటర్లకు గాను 1,48,662 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 607 ఓట్లు నోటాకు, 11 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నోటాకు నమోదయ్యాయి. ఈ నియోజకవర్గంలో 13 మంది అభ్యర్ధులు పోటీ చేయగా ఐదుగురు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
- దేవరకద్ర నియోజకవర్గంలో 2,08,413 మంది ఓటర్లకు 1,50,093 ఓట్లు పోలయ్యాయి. కాగా, పోలైన ఓట్లలో 1,213 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్ధులు బరిలో ఉండగా.. ఇద్దరు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
- అలంపూర్ నియోజకవర్గంలో 2,10,104 మంది ఓటర్లు ఉండగా 1,59,348 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 965 ఓట్లు నోటాకు, మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న 11 మంది అభ్యర్థుల్లో ఐదుగురు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
- గద్వాల నియోజకవర్గంలో 2,12,787 మంది ఓటర్లకు 1,72,603 ఓట్లు పోలయ్యాయి. ఇక పోలైన ఓట్లలో 862 ఓట్లు నోటాకు, ఏడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గానికి పదమూడు మంది అభ్యర్ధులు పోటీచేయగా ఆరుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయి.
- మక్తల్ నియోజకవర్గంలో 2,09,537 మంది ఓటర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా 1,41,756 ఓట్లు పోల్ కాగా, 724 ఓట్లు నోటాకు, నాలుగు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి పద్నాలుగు మంది బరిలో ఉండగా ఇద్దరు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
- నారాయణపేట నియోజకవర్గంలో 1,99,018 మంది ఓటర్లకు గాను 1,36,831 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1,131 ఓట్లు నోటాకు, మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది అభ్యర్ధులు పోటీచేయగా ఇద్దరికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
- కొడంగల్ నియోజకవర్గంలో 1,97,649 మంది ఓటర్లు ఉండగా 1,39,072 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1,136 ఓట్లు నోటాకు, ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా నోటాకు పోలైంది. ఈ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్ధులు పోటీచేయగా శ్రీనివాస్ రెడ్డికి 680 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆయనకు నోటాకు తక్కువగా ఓట్లు వచ్చి నట్లయింది.
- కల్వకుర్తి నియోజకవర్గంలో 1,99,714 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,62,317 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 1,140 ఓట్లు నోటాకు, ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా నోటాకు పోలైంది. ఈ నియోజకవర్గం నుంచి బరిలో పది మంది అభ్యర్ధులు ఉండగా.. ముగ్గురికి నోటా కంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయి.
- అచ్చంపేట నియోజకవర్గంలో 2,04,850 మంది ఓటర్లు ఉండగా 1,47,768 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 1,298 ఓట్లు నోటాకు, ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా నోటాకు పోలయింది. ఈ నియోజకవర్గానికి ఏడుగురు అభ్యర్ధులు పోటీ చేయగా ఇద్దరు అభ్యర్ధులకు నోటాకంటే తక్కువ ఓట్లు రాగా,123 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment