సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్‌ బకాయిలు | Electricity Dues For Irrigation Projects In Mahabubnagar | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్‌ బకాయిలు

Published Sat, Sep 28 2019 11:02 AM | Last Updated on Sat, Sep 28 2019 11:03 AM

Electricity Dues For Irrigation Projects In Mahabubnagar - Sakshi

నెట్టెంపాడు ఎత్తిపోతల పంపులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు

సాక్షి, మహబూబ్‌నగర్‌: పాలమూరు సాగునీటి పథకాలకు అసలే అరకొర కేటాయింపులు ఉండడంతో విద్యుత్‌ బిల్లుల చెల్లింపుకు జాప్యం జరుగుతోంది. అయితే ప్రతిసారి బడ్జెట్‌లో మంజూరైన నిధుల్లో పనులు, పునరావాసం, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, ఇతరాత్ర ఖర్చులు ఇలా అన్ని కేటగిరీలకు అవసరం మేరకు కేటాయిస్తారు. ఇందులో విద్యుత్‌ బిల్లుల కోసం కేటాయించిన నిధుల్లోనూ భారీగా కోత విధించి కనీసం పదిశాతం కూడా చెల్లించకపోవడంతో బిల్లులు ప్రతినెలా గుట్టల్లా పేరుకుపోతున్నాయి.

దీంతో ఆ భారం విద్యుత్‌ సంస్థకు గుదిబండగా మారింది. ప్రస్తుతం ఐదు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.1,641.57 కోట్ల మేర విద్యుత్‌ బకాయిలు ఉండడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఇలాంటి బిల్లుల పెండింగ్‌ ఇతర రంగాలకు చెందినవి అయితే వాటికి విద్యుత్‌ సరఫరా నిలిపేసే పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు విద్యుత్‌ సరఫరా నిలిపేసే ప్రసక్తే లేకుండా పోయింది.

ఇదీలా ఉంటే కనీసం బడ్జెట్‌లో జరిగిన కేటాయింపుల మేరకైనా బిల్లులు చెల్లిస్తే అంత సమస్య ఉండదని విద్యుత్‌ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల బిల్లుల చెల్లింపులు సంబంధిత శాఖ ద్వారా నేరుగా ట్రాన్స్‌కోకు ఉండడంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. 

భారీ మోటార్లు.. బిల్లులు తడిసిమోపెడు 
కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్వహణ కోసం ప్రభుత్వం 30మెగావాట్లతో కూడిన 15మోటార్లు ఏర్పాటు చేసింది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 17 మెగావాట్లతో కూడిన ఏడు మోటార్లు నడుస్తున్నాయి. భీమా 1,2 ఎత్తిపోతలకు సంబంధించి రెండు చోట్లా 12మెగావాట్లతో కూడిన మూడు మోటార్లు, నాలుగు మెగావాట్లతో కూడిన మూడు మోటార్లు పని చేస్తున్నాయి. కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సంబంధించి ఐదు మెగావాట్లతో కూడిన నాలుగు మోటార్లు పని చేస్తున్నాయి. మోటార్లన్నీ భారీగా ఉండడంతో పంపులు పని చేసే సమయాన్ని బట్టి నెలకు కనిష్టంగా రూ.50లక్షలు గరిష్టంగా రూ.2కోట్ల వరకు విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి.  

రూ.328.21బడ్జెట్‌లో రూ.6.32 కోట్లే..  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న నాలుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల నిర్వహణకు రూ.328.21కోట్ల కేటాయింపు జరిగింది. అందులో రూ.97.97 కోట్లతో విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గత నెలాఖరు వరకు కేవలం రూ. 6.32 కోట్లు మాత్రమే విద్యుత్‌ బిల్లులు చెల్లించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓటాన్‌ అకౌంట్‌లో రూ. 67.74 కోట్లు కేటాయించగా.. రూ. 18.01 కోట్లు విద్యుత్‌ బిల్లుల కోసం కేటాయించారు. కానీ అందులో నయాపైసా కూడా విద్యుత్‌ బిల్లుల కోసం ఖర్చు చేయలేదు. కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.146 కోట్ల కేటాయించగా... అందులో రూ.69.89 కోట్లు విద్యుత్‌ బకాయిలకు కేటాయించారు.

అయినా అందులో నయాపైసా కూడా బిల్లులు చెల్లించలేదు. దీంతో పాత బకాయిలతో కలిపి మొత్తం రూ. 1433.06 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజీవ్‌ భీమా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి రూ.64.31 కోట్లు కేటాయించగా... రూ. 6.32 కోట్ల విద్యుత్‌ బిల్లులు చెల్లించారు. పాత బకాయిలతో కలిపి రూ. 104.70కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కోయిల్‌సాగర్‌ పథకానికి సంబంధించి ఓటాన్‌ అకౌంట్‌లో రూ. 50.16 కోట్లు కేటాయించగా.. విద్యుత్‌ బిల్లుల కోసం రూ. 1.29 కేటాయించారు.

కానీ అందులో ఒక్కరూపాయి కూడా విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. ఇదీలావుంటే.. ఈ నెల 9న ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్‌లో ఎత్తిపోతల పథకాలకు కేవలం రూ. 79 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ కేటాయింపులు నిర్మాణ పనుల పెండింగ్‌ బిల్లులకే సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో నయాపైసా కూడా విద్యుత్‌ బిల్లుల కోసం చెల్లించలే ని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. 

నిధుల సమస్య ఉంది  
జిల్లాలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు సంబం ధించిన విద్యుత్‌ బకాయిలు చెల్లించాలంటే అవసరం మేరకు నిధుల కేటాయింపులు లేవు. పథకాల వారీగా మంజూరైన నిధుల్లో నిర్మాణ పనులు, పునరావాసం, విద్యుత్‌ బకాయిలు, ఇతరాత్ర ఖర్చుల విభజన చేసుకుని వాటిలో ఏది ఎంత అవసరమో గుర్తించి అందులో ఖర్చు చేస్తాం. విద్యుత్‌ బిల్లులకు అరకొర కేటాయింపులు ఉండడంతోనే చెల్లింపుకు జాప్యం జరుగుతోంది. 
– ఖగేందర్, సీఈ 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

నెట్టెంపాడు లిఫ్టు–2 మార్లబీడు పంపుల నుంచి విడుదలవుతున్న జలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement