అడుగడుగునా అడ్డంకులే.. | Palamuru Rangareddy Project Had To Face Obstacles To Construct | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అడ్డంకులే..

Published Mon, Sep 9 2019 11:20 AM | Last Updated on Mon, Sep 9 2019 11:22 AM

Palamuru Rangareddy Project Had To Face Obstacles To Construct - Sakshi

వట్టెం రిజర్వాయర్‌ వద్ద సర్వే చేస్తున్న సిబ్బంది

సాక్షి, మహబూబ్‌నగర్‌: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందుగా నార్లాపూర్‌ రిజర్వాయర్‌ పనులకు సంబంధించి అటవీ శాఖ నుంచి క్లియరెన్స్‌ లేదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిధులు విడుదల కాలేదు. ఈ కారణంగా ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మిస్తున్న నార్లాపూర్, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్ల కాల్వ పనుల్లో పురోగతి ఆశించిన మేరకు కనిపించలేదు. తాజాగా నిధుల సమస్య తీరిందంటే ఆయా రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారు. ఇన్ని చిక్కుల మధ్య గడువులోగా పనులను పూర్తి చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. 

నిధులు మంజూరైనా.. 
ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గత నెల 28న ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ వాటి పరిధిలో నిర్మాణ దశలో ఉన్న కర్వెన, వట్టెం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కావడంతో ఇకపై ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాలని, వచ్చే ఖరీఫ్‌ నాటికి ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు అధికారులూ అసంపూర్తి పనుల పూర్తితోపాటు కొత్తగా చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించారు. అయితే పనులు చేపట్టాలంటే ముందుగా తమకు రావాల్సిన పరిహారం విషయాన్ని తేల్చాలంటూ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో గడువులోగా పనుల పూర్తి సంబంధిత అధికారులకు సవాల్‌గా మారింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను స్థానిక మంత్రుల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

ఉదండాపూర్‌ ప్రాజెక్టు.. 
జడ్చర్ల మండల పరిధిలో వల్లూరు– ఉదండాపూర్‌ గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న 15.97 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ పనులు ఆటంకాల మధ్య కొనసాగుతున్నాయి. రిజర్వాయర్‌ నిర్మాణ పనులకు సంబంధించి 5,107 ఎకరాలను సేకరించాలని గుర్తించారు. సాగునీటి సౌకర్యం కలిగిన భూములకు ఎకరానికి రూ.6.50 లక్షలు, బీడు భూములకు రూ.5.50 లక్షలు ఇవ్వాలని రేటు ఖరారు చేశారు. అందు లో భాగంగా ఉదండాపూర్‌ నిర్వాసితులకు 900 ఎకరాలకు ఇప్పటి వరకు రూ.65.5 కోట్ల పరిహారం అందజేశారు.

మరో 480 ఎకరాలకు ఇం కా సుమారు రూ.18 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంది. అలాగే వల్లూరు నిర్వాసితులకు సంబంధించి 1,200 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు వంద ఎకరాలకు రూ.73 కోట్ల వరకు పరిహారం అందజేశారు. 

సకాలంలో అందని డబ్బులు 
సేకరించిన భూములకు సంబంధించి రైతులకు సకాలంలో పరిహారం డబ్బులు ఇవ్వలేదు. రైతుల ఆందోళనలు, నిరసనల అనంతరం దశల వారీగా పరిహారాన్ని అందించారు. అయితే ఎకరాకు ఇచ్చిన పరిహారానికి బహిరంగ మార్కెట్‌లో వంద చదరపు గజాల ప్లాటు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంకా చాలా మంది రైతులకు పరిహారం అందాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ముంపునకు గురయ్యే వల్లూరు, ఉదండాపూర్‌ గ్రామాలతోపాటు వాటి పరిధిలోని ఒంటిగుడిసె తండా, తుమ్మలకుంట తండా, ర్యాగడిపట్ట తండా, చిన్నగుట్టతండాలకు సంబంధించి ఇంతవరకు పునరావాస చర్యలు చేపట్టలేదు.

ఆయా గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా నిర్మించే ఇళ్లకు స్థల సేకరణ జరగలేదు. ఇటీవల ఉదండాపూర్‌ గ్రామానికి ఇళ్ల నిర్మాణాలకు గాను బండమీదిపల్లి గ్రామ శివారులో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి చదును చేసే పనులు ప్రారంభించారు. వల్లూరుకు సంబంధించి ఇప్పటి వరకు స్థలాన్ని ఖరారు చేయలేదు. 

కరివెన రిజర్వాయర్‌ 
భూత్పూర్‌ మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు సంబంధించి 6,676 ఎకరాలు భూమి సేకరించాల్సి ఉండగా వంద శాతం సేకరించారు. రూ.760 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పనులు రూ.425 కోట్ల ఖర్చుతో దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. అయితే ఈ రిజర్వాయర్‌ కోసం కొత్తూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని బోరోనిగుట్టతండా, కర్వెన గ్రామ పంచాయ తీలోని ఏకులగట్టు తండా, ఎల్కిచర్ల గ్రామ పంచాయతీలోని భట్టుపల్లి తండా ప్రజల వ్యవసాయ భూములతోపాటు ప్రజలు ఇళ్లు కోల్పోయారు. వీరిలో కొందరికి 123 జీఓ ప్రకారం ప్రభుత్వం ఎకరానికి రూ.3.50 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు అందజేసింది. 

ఏదుల రిజర్వాయర్‌ 
రేవల్లి మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు సంబంధించి 5,470 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 5,011 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణ వివిధ దశల్లో ఉంది. రూ.664 కోట్ల వ్యయానికి గాను రూ.642 కోట్లు ఖర్చు చేసి 98 శాతం పనులను పూర్తి చేశారు.

వట్టెం రిజర్వాయర్‌ 
బిజినేపల్లి మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు 4,526 ఎకరాలు సేకరించాల్సి ఉండగా దాదాపు 4 వేలు సేకరించారు. రూ.6 వేల కోట్ల వ్యవయానికి గాను రూ.1,800 కోట్లతో 30 శాతం పనులు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి తిమ్మాజిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి, బిజినేపల్లి మండలంలోని కారుకొండతండా, అనెకాన్‌పల్లి, అనెకాన్‌పల్లితండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండా వట్టెం గ్రామాల పరిధిలో 4,230 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు 3,370 ఎకరాల భూమి సేకరణ పూర్తి కాగా మరో 860 ఎకరాలు పెండింగ్‌లో ఉంది.

పెండింగ్‌లో ఉన్న భూములకు సంబంధించి నిర్వాసితులకు పంటలను బట్టి రూ.3.50 లక్షల నుంచి రూ.5.50 లక్షలకు అందించింది. అయితే కొంతమంది రైతులు మాత్రం మల్లన్న సాగర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన పరిహారం ప్రకారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు, ప్రభుత్వం తరఫున డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన కేసీఆర్‌కు సైతం వినతిపత్రం అందజేశారు.

నార్లాపూర్‌ రిజర్వాయర్‌ 
కొల్లాపూర్‌ మండలంలో చేపట్టిన నార్లాపూర్‌ రిజర్వాయర్‌కు సంబంధించి మొత్తం 2,465 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,275 ఎకరాలు సేకరించారు. రూ.760 కోట్ల వ్యయానికి గాను రూ.425 కోట్లు ఖర్చు చేసి 60 శాతం పనులు పూర్తిచేశారు. రెండో ప్యాకేజీలో భాగంగా సున్నపుతండా వద్ద డిస్ట్రీబ్యూటరీ గేట్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్‌ వరకు కాల్వలు తవ్వుతున్నారు. ఈ కాల్వ పనులు కుడికిళ్ల గ్రామ సమీపంలో 1.5 కి.మీ మేరకు నిలిచిపోయాయి.

ఈ ప్రాంతంలో 267 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇక్కడ రైతులు భూములు ఇవ్వడానికి మొదటి నుంచి ఒప్పుకోవడం లేదు. గతంలో కేఎల్‌ఐ ప్రాజెక్టు కాల్వల్లో తమ భూములు కోల్పోయామని, మిగిలిన భూములను రెండోసారి పాలమూరు ప్రాజెక్టు కోసం లాక్కోవడం తగదని ప్రభుత్వాన్ని కోరుతున్న వీరు మల్లన్నసాగర్‌ నిర్వాసితుల తరహాలో ఎకరాకు రూ.15 లక్షలు చొప్పున ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు.

ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.5.50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కుడికిళ్లలో పావు ఎకరం భూమి కూడా ఇప్పుడు తాము కొనుగోలు చేయలేమని, పరిహారం పెంచితేనే భూములు ఇస్తామని రైతులు చెబుతున్నారు. పరిహారంపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే సర్వేకు మా భూముల్లోకి రావాలని రైతులు గతంలో ఆందోళనలు చేపట్టారు. దీంతో రెండు రోజుల క్రితం భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు భూ సేకరణ సర్వే పూర్తిచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement