నిందితుడి(వృత్తంలోని వ్యక్తి)తో కొత్తకోట సీఐ వెంకటేశ్వర్‌రావు, సిబ్బంది
సాక్షి, కొత్తకోట రూరల్: డ్రైవర్‌గా నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించి ఏకంగా రూ.35లక్షల నగదుతో పరారైన దొంగ డ్రైవర్ దొరికాడు. నగదుతో పరారైన 24 గంటల్లోనే పోలీసులు మూడు టీంలుగా విడిపోయి దొంగను పట్టుకున్నారు. కొత్తకోట సీఐ వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లాకు చెం దిన విషాల్, ఆశోక్ వర్ధన్‌రెడ్డి అనే ఇద్దరు వ్యాపారులు బుధవారం తమ వ్యాపారం నిమిత్తం కడప నుంచి సొంత కారులో రూ.35లక్షల నగదుతో హైదరాబాద్ బయల్దేరారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోకి రాగానే భోజనం చేయడం కోసం ఓ దాబా దగ్గర కారు నిలిపారు. కారులో డ్రైవర్ నందుకుమార్‌తోపాటు విశాల్ తల్లి లక్ష్మీదేవమ్మ, తండ్రి నర్సిరెడ్డి ఉండగా భోజనం కొరకు అందరూ కారు దిగగా లక్ష్మీదేవమ్మ మాత్రం నిద్రిస్తూ ఉండిపోయింది.
టైర్‌లో గాలికొట్టిస్తానని చెప్పి డబ్బుతో పరార్..
అయితే, ఎలాగైనా డబ్బు కొట్టేయాలనే ఉద్దేశంలో ఉన్న డ్రైవర్ నందుకుమార్ కారు టైర్లో గాలి పట్టిస్తానని చెప్పి కారుతో బయలు దేరాడు. కొత్తకోట మండలం నాటవెళ్లి సమీపంలో గల ఓ పెట్రోల్ పంప్ దగ్గర గాలి పట్టేందుకు కారును ఆపి వెనుక సీట్లో ఉన్న డబ్బు బ్యాగుతో పరారయ్యాడు. కారులోనే నిద్రిస్తున్న లక్ష్మిదేమ్మ కొంత సేపటికి లేచి కొడుకుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పగా సంఘటన స్థలం దగ్గరకు వచ్చి కారుతో పెబ్బేర్ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు.
మూడు టీంలుగా విడిపోయి గాలింపు
ఆశోక్ వర్దన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తకోట సీఐ వెంకటేశ్వర్‌రావు అదేశానుసారం మూడు టీంలుగా విడిపోయి డ్రైవర్ ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ అధారంగా గాలింపు చేపట్టారు. అధార్‌కార్డు అడ్రస్ బీదర్ ఉండటంతో అక్కడకు ఒక టీంను పంపించి వివరాలు రాబట్టారు. బీదర్‌లో పోలీసులు తనకోసం వచ్చారని తెలుసుకున్న నందుకుమార్ హైదరాబాద్ వచ్చాడు.
అక్కడ సైతం తాను అద్దెకు ఉంటున్న ఇంటి దగ్గర విచారిస్తున్నారని గుర్తించి తన అక్క దగ్గరకు వెళ్లేందుకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వెళ్తుండగా కాపుకాసిన పోలీసులు జడ్చర్ల బస్టాండ్‌లో నిందితుడిని పట్టుకొని అతని వద్ద ఉన్న రూ.30లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కొత్తకోట ఎస్‌ఐ సతీష్, పెబ్బేర్ ఎస్‌ఐ విజయ్‌కుమార్, పెద్దమందడి ఎస్‌ఐ విజయ్‌భాస్కర్, కానిస్టేబుల్స్ యుగంధర్‌గౌడ్, తిరుపతిరెడ్డిని సీఐ వెంకటేశ్వర్‌రావు అభినందించారు. నిందితుడి నుండి మిగతా డబ్బును రాబట్టేందుకు విచారించి రిమాండ్‌కు పంపుతామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment