ఖిల్లాఘనపురం బ్రాంచ్ కెనాల్ నుంచి పారుతున్న కేఎల్‌ఐ నీరు
సాక్షి, వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లా.. పేరు వినగానే కరువు కాటకాలు, వలస కార్మికులు గుర్తుకొస్తారు.. తలాపున కృష్ణమ్మ బిరబిరా ప్రవహిస్తున్నా తాగునీటికి తిప్పలు అన్నీఇన్ని కావు. ఏటా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కువగా మెట్ట పంటలను సాగుచేసేవారు.
ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే పంట చేతికొచ్చేది లేదంటే అప్పులే మిగిలేవి. కానీ ప్రస్తుతం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ఫేజ్ 1, భీమా ఫేజ్ 2 పనులు శరవేగంగా కొనసాగి.. ఆయన మరణానంతరం నెమ్మదించాయి.
2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌గా మార్చారు. అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తిచేసి వాగులు, వంకలు, అందుబాటులో ఉన్న కాల్వల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు. దీంతో వనపర్తి నియోజకవర్గం పరిధిలో 70వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
ఫలితంగా ఎన్నో ఏళ్లుగా వలసలపై ఆధారపడ్డ చాలామంది సొంతూరుకు తిరిగి వస్తున్నారు. ఉన్న ఎకరా, రెండెకరాల పొలంలో పంటలు సాగుచేసుకుని స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో సాగునీటి అంశం కీలకంగా మారింది. నేతాలంతా తామంటే తాము సాగునీరు ఇచ్చామని చెప్పుకుంటున్నారు.
వైఎస్ హయాంలోనే కేఎల్‌ఐ పనులు
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులకు 1984లో సర్వేచేయగా, 1991లో నాగర్‌కర్నూల్‌లో కల్వకుర్తి, నెట్టెంపాడు పథకాలకు కలిపి సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 1999లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేగుమాన్‌గడ్డ వద్ద శిలాఫలకం వేసినా పనులు ముందుకు సాగలేదు.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా కేఎల్‌ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పనులను ప్రారంభించారు. కేఎల్‌ఐ పథకానికి 2014 సంవత్సరానికి ముందు రూ.2,716.23 కోట్లు ఖర్చుచేయగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1,196కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. పనులు చివరి దశలో ఉన్నాయి.
రాజీవ్‌భీమా పథకానికి మొత్తం రూ.2,316 కోట్లు ఖర్చుచేయగా, 2014కు ముందు రూ.1,953 కోట్లు, ఆ తర్వాత రూ.363కోట్లు ఖర్చుచేశారు. 2014కు ముందు ఈ రెండు పథకాల కింద ఆయకట్టు సైతం తక్కువగా ఉంది. అప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో ఆయకట్టు పెరగలేదు.
కేఎల్‌ఐ కింద 2014 వరకు 13,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం 3.50 లక్షల ఎకరాలకు చేరింది. రాజీవ్ భీమా కింద 2014 వరకు 12వేల ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 2014 వరకు కేఎల్‌ఐ, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద సుమారు 40వేల ఎకరాల ఆయకట్టు ఉండేది. కానీ ఈ ఏడాది ఖరీప్ సీజన్ నాటికి ఉమ్మడి జిల్లాలో సుమారు 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
వనపర్తికి జలసిరి
కేఎల్‌ఐలో ముందుగా 25 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత దానిని 40 టీఎంసీలకు పెంచారు. దాని ఫలితంగానే నేడు జిల్లాలోని ఖిల్లాఘనపురం బ్రాంచ్ కెనాల్, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌లు చేపట్టడానికి అవకాశం ఏర్పడింది. ఈ రెండింటి కింద సుమారు 45వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలకు నిలయంగా ఉన్న ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్‌పేట, వనపర్తి మండలాల నుంచి ఈ కాల్వలు వెళ్తుండటంతో నేడు నియోజకవర్గంలోని వేల ఎకరాల భూములు సాగులోకి వచ్చాయి. వర్షాలు కురువకపోయినా ప్రస్తుతం అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపారుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా వరి, వేరుశనగ పంటలతో పచ్చగా కనిపిస్తుంది.
రైతుల ఓటు ఎటు వైపు?
తాము ముందుగా అధికశాతం ప్రాజెక్టు పనులను పూర్తిచేయడంతోనే సాగునీరు వచ్చిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉండకపోతే ఎప్పటికీ ఈ ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేవి కాదని, సాగునీరు అందడం పాలమూరు రైతుల కు కలగానే మిగిలిపోయేదని టీఆర్‌ఎస్ నా య కులు అంటున్నారు.
వనపర్తి నియోజకవర్గం లోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్‌పేట, రే వల్లి, వనపర్తి మండలాల్లో కేఎల్‌ఐ, భీమా కాల్వల ద్వారా నీరు వచ్చింది. మరి ఎన్నికల్లో ఓటు వేసే ముందు రైతులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ అంతటా కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి జిల్లెల చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment