
సాక్షి, అమరచింత: సాధారణంగా మనం ఏటీఎంకు వెళ్లి.. అన్నీ సరిగా నొక్కితేనే కావాల్సిన డబ్బులు వస్తాయి. అలాంటిది ఈ ఏటీఎంలో మాత్రం ఏకంగా కావాల్సిన దాని కంటే ఐదింతలు ఎక్కువ వచ్చింది. వనపర్తి జిల్లా అమరచింతలో రెండేళ్ల క్రితం ప్రైవేట్ సంస్థకు చెందిన ఇండియా–1 ఏటీఎంను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం రూ.100 విత్‌డ్రా కోసం కొడితే ఏకంగా రూ.500 బయటకు రావడంతో ఖాతాదారులు వరుస కట్టారు.
రూ.రెండు వేల విత్‌డ్రా కోసం యత్నిస్తే రూ.10 వేలు రావడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు వచ్చి డబ్బులు డ్రా చేసుకోవడంతో జనసందోహం నెలకొంది. పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు అక్కడ గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టి ఆరా తీసి, ఏటీఎంకు తాళం వేసి నిర్వాహకులకు సమాచారమిచ్చారు.
వంద నోట్ల స్థానంలో రూ.500 నోట్లు పెట్టడం వల్లే..
రెండు రోజులకోసారి ఈ ఏటీఎంలో నగదును నిల్వ చేయడానికి వస్తున్న సిబ్బంది తప్పిదం వల్లే ఇలా జరిగిందని బయటపడింది. రూ.100 నోట్ల కట్టల స్థానంలో రూ.500 నోట్లను పెట్టారు. దీంతో రూ.100 విత్‌డ్రా కోసం నొక్కితే రూ.500 వచ్చా యని నిర్వాహకులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇలా కొన్ని గంటల్లోనే రూ.5,80,000 అదనంగా విత్‌డ్రా అయ్యాయని తేలింది. చివరకు సీసీకెమెరాల ఆధారంగా ఏటీఎం కార్డు, ఖాతా నంబర్లు సేకరించి డ్రా చేసుకున్న అధిక మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఫోన్లలో ఖాతాదా రులకు సమాచారం ఇచ్చారు. చివరకు రూ.1.2 లక్షలు రికవరీ చేశారు. కాగా, ఈ వ్యవహారంలో ఏటీఎం సిబ్బందికి ఖాతాదారులు సహకరించాలని లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా మని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment