చిన్నారి గొంతులో సీసా మూత.. | the baby swallowed the battle lid | Sakshi
Sakshi News home page

చిన్నారి గొంతులో సీసా మూత..

Published Thu, Mar 16 2017 7:49 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

the baby swallowed  the battle lid

వనపర్తి: ఎనిమిది నెలల బాలుడు సీసా మూతను మింగటంతో వైద్యులు చాకచక్యంగా వ్యవహరించి మూతను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘనత వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు దక్కింది. పెళ్లయిన పదేళ్లకు పుట్టిన బాబుకి ప్రమాదం తప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. 
 
వనపర్తి జిల్లా కేంద్రం రాంనగర్‌ కాలనీకి చెందిన యాదగిరి, లత దంపతులకు ఎనిమిది నెలల దేవేంద్ర ఉన్నాడు. గురువారం ఇంట్లో ఆడుకుంటూ మెంతో ప్లస్‌ బామ్‌ మూత మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. ఆహార వాహికకు అడ్డంగా ఉండిపోవడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్‌ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. గొంతులో మూత వాయునాళానికి అడ్డం పడితే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. చివరి ప్రయత్నంగా వారు వనపర్తి ప్రజా వైద్యశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటామని హామీ ఇవ్వడంతో వైద్యులు ఎక్స్‌-రే తీసి మూత గొంతు కింది భాగంలో ఉందని గుర్తించారు.

తర్వాత బాలుడికి మత్తు ఇచ్చి.. ఎలాంటి సర్జరీ లేకుండా ‘క్రొకడైల్‌ ఫిరెక్స్‌’ అనే పరికరం సహాయంతో డాక్టర్లు మురళీధర్‌, హరికిషన్‌ చాకచక్యంగా తొలగించారు. ఆ సందర్భంగా ప్రజావైద్యశాల నిర్వాహకుడు డాక్టర్‌ మురళీధర్‌ మాట్లాడుతూ మొదట్లో కర్నూల్‌కు రెఫర్‌ చేద్దామనుకున్నామన్నారు. అక్కడికి వెళ్లేలోపు ప్రమాదం జరగవచ్చని భావించి.. తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచడంతోనే మూతను తొలగించామని చెప్పారు. 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement