పాలిటెక్నిక్ కళాశాల పరిశీలనకు వెళ్తున్న పాపిరెడ్డి, నిరంజన్‌రెడ్డి
వనపర్తి: తెలంగాణ రాష్ట్రంలో మరో ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి రెండు ట్రిపుల్ ఐటీలు మంజూరైతే.. నాడు తెలంగాణ ప్రాంతంలోని బాసరలో ఒకటి, ఆంధ్రా ప్రాంతంలోని నూజివీడులో మరోటి ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఒక్కో ట్రిపుల్ ఐటీ కళాశాలలు వచ్చాయి. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలోని బాసరలో మాత్రమే ట్రిపుల్ ఐటీ ఉంది. దక్షిణ తెలంగాణలో బాసర యూనివర్సిటీ అనుబంధంగా మరో కళాశాల ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వనపర్తిలో సంస్థానాధీశుల నుంచి విద్యకు ఇస్తున్న ప్రాముఖ్యతను వివరిస్తూ ట్రిపుల్ ఐటీని వనపర్తిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ లేఖరాశారు. వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్, 130కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం, 15 కిలోమీటర్ల దూరంలో 44 జాతీయ రహదారి ఉన్నాయని నిరంజన్‌రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణంలోకి తీసుకుని ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన వనరులు, స్థలం, భవనా లు ఉన్నాయా అనే విషయం పరిశీలించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.
స్థలాలు, భవనాల పరిశీలన
ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన వనరులు, స్థలాలు, భవనాలు ఇతర అంశాలను పరిశీలించేందుకు సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, వైస్‌చైర్మన్ లింభాద్రి, సభ్యులు నరసింహారెడ్డి వనపర్తికి వచ్చారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వారికి వనపర్తిలో ప్రభుత్వ భవనాలు, స్థలాలు, విద్యుత్, నీటివసతి, రహదారులు, ఇదివరకే ఇక్కడ ఉన్న విద్యాలయాల వివరాలను వెల్లడించారు. తాత్కాలికంగా ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన భవనాలు ప్రస్తుత ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనాన్ని చూపించారు. అలాగే, శాశ్వత నిర్మాణానికి కావాల్సిన ప్రభుత్వ స్థలాలను ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాల పక్కనే ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చిన అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం వారు నిరంజన్‌రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
అంతా ఓకే...
బాసరలో ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీకి అనుబంధంగా కళాశాల ఏర్పాటుకు కావాల్సిన అన్నిసౌకర్యాలు వనపర్తిలో ఉన్నాయని ప్రొఫెసర్ పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే విషయం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్య చేరువ అవుతుందన్నారు. మండల, గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతిలో ఫలితాల మెరిట్ ఆధారంగా ట్రిపుల్ ఐటీలో సీట్ల ఎంపిక ఉంటుందని తెలిపారు. పదో తరగతి తర్వాత ఆరేళ్ల పాటు రెసిడెన్షియల్ వసతితో ఉన్నత సాంకేతిక విద్యను పేద విద్యార్థులకు అందిస్తామన్నారు. వనపర్తి తాత్కాలిక, శాశ్విత కళాశాల ఏర్పాటు, అధ్యాపకులు, సిబ్బంది నివాసానికి యోగ్యమైన ప్రాంతంగా గుర్తించామన్నారు. రవాణా పరంగా హైదరాబాద్– బెంగుళూరు హైవే, వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్ తదితర సౌకర్యాలు ఉన్నాయన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ నిర్వహణ కొనసాగుతున్న సంస్థానాధీశుల రాజమహల్‌ను, కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. వారితో పాటు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ బి.లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.
ట్రిపుల్‌ఐటీ వస్తే.. పరిశ్రమలు
పరిశ్రమల్లో పని చేసేందుకు కావాల్సిన మ్యాన్‌పవర్ ట్రిపుల్ ఐటీ నుంచి వస్తుందని నిరంజన్‌రెడ్డి అన్నారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు అయితే ఇక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తాయని తెలిపారు. విశ్వవిద్యాలయాల సమతుల్యతల మేరకు ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ ఉండడంతో రెండోది దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. పాలమూరు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో వనపర్తిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment