ఆయనకు జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఇష్టం.. | Kollapur MLA Beeram Harshavardhan Reddy personal time with sakshi | Sakshi
Sakshi News home page

శత్రువు వచ్చి అడిగినా సాయం చేశా: ఎమ్మెల్యే బీరం

Published Sun, May 5 2019 6:17 PM | Last Updated on Sun, May 5 2019 6:28 PM

Kollapur MLA Beeram Harshavardhan Reddy personal time with sakshi - Sakshi

సాక్షి, కొల్లాపూర్‌: సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయడమే ఇష్టం. నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సాయం చేశాను. శత్రువు వచ్చి కోరినా వెనకాడలేదు. మా ఊరు కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామం. నా చిన్నతనం నుంచి నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చేసే సేవలు గమనించేవాడిని. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు సేవచేసే అవకాశం ఉంటుంది.  విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. చదువు పూర్తయిన తర్వాత లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. అందుకు మా నాన్న, అమ్మ, నా భార్య ప్రోత్సాహం, సహకారం చాలా ఉంది. నన్ను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులంతా సహకారం అందించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందించాను. మా ఇంటి దేవుడు లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో రాణించగలుగుతున్నాను..’’ అని అన్నారు కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి. శనివారం ఆయన ‘సాక్షి’ పర్సనల్‌ టైమ్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.          

‘మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా నాన్న లక్ష్మారెడ్డి, అమ్మ బుచ్చమ్మ, భార్య విజయ. మా నాన్న సింగోటం సర్పంచ్‌గా, డీసీసీబీ డైరెక్టర్‌ గా, అప్పట్లో టీడీపీ నాయకుడిగా పనిచేశారు. ఎన్‌టీఆర్‌ హయాంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినా కుటుంబం కోసం వదులుకున్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మా ఇంటికి వచ్చేవారు. ఎవరికి ఏ ఆపద, ఏ సమస్య ఉన్నా చేతనైనంతవరకు సాయం చేశాం. నాన్న సేవాభావం చూసే రాజకీయాల్లోకి రావాలనే కోరిక నాలో మొదలైంది. నాటి నుంచి నేటి వరకు ఆ మార్గంలోనే నడుస్తున్నాను. నాకు ఇద్దరు అక్కలు ఉమాదేవి, సువర్చల..  పాఠశాల చదువు అంతా పదోతరగతి వరకు కొల్లాపూర్‌లోనే కొనసాగింది. ఇంటర్, డిగ్రీ, లా హైదరాబాద్‌లో పూర్తి చేశాను. 2001లో హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించాను. పదేళ్ల వరకు పూర్తిగా ఈ వృత్తిలోనే కొనసాగాను. చిన్నప్పటి నుంచే సామాజిక సేవ చేయడంపై ఇష్టం ఉండేది. 2010–11నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చాను.  

శత్రువుకైనా సాయం చేశా.
ఎవరైనా సరే నా వద్దకు వచ్చినవారందరికీ సాయం చేశాను. శత్రువు వచ్చి సాయం అడిగితే కూడా చేశా. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక తోడ్పాటు అందించా. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ రోడ్ల పరిస్థితి బాగా లేదు. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగునీరు అందని దుస్థితి. దీనిని పూర్తిగా మార్చివేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం. దేశంలోనే ప్రత్యేకత ఉన్న కొల్లాపూర్‌ మామిడికి మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు కల్పించాలి. పూర్తి స్థాయిలో సామాన్యుడికి అందుబాటులో ఉండి వారి కష్టాలను తీర్చాలన్నది నా లక్ష్యం.  

ఫ్యామిలీకి సమయం కేటాయించేందుకు యత్నిస్తా..
రాజకీయాల్లో బిజీగానే ఉంటా. అయినప్పటికీ ఫ్యామిలీకి సమయం కేటాయించేందుకు యత్నిస్తాను. నా భార్య విజయనే అన్నీ చూసుకుంటుంది. 70 ఏళ్ల వయసులోనూ అమ్మా, నాన్న నాకు ఎంతో తోడ్పాటు, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. నిత్యం సలహాలు ఇస్తున్నారు. కుటుంబానికి ఎక్కువగా సమయం ఇవ్వలేదు. ఎప్పుడైనా తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. సింగోటంలోని లక్ష్మీనర్సింహస్వామిని ప్రతిరోజూ దర్శించుకుంటాం. 2010లో ఒకసారి యూరప్‌ వెళ్లాం. పూర్తిగా నేను రాజకీయాల్లో ముందుకు వెళ్లడానికి నా భార్య సహకారం మరువలేనిది. బిజీలో ఒకవేళ నేను టిఫిన్‌ చేయకుండా బయటికి వెళ్తే కారులో పెడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని ఆమెనే దగ్గరుండి చూసుకుంటుంది. ఫ్యామిలీనే నా బలం. వారి వల్లనే స్వేచ్ఛగా రాజకీయాలు చేయగలుగుతున్నాను. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి, యోగక్షేమాలు అడిగి పంపించడం అమ్మానాన్నలతోపాటు నా భార్యకు అలవాటు.  

జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఇష్టం
ప్రజలు ఎంతో నమ్మకంతో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారు. మేము సహకరిస్తేనే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సేవ చేయగలుగుతారు. ఇంట్లో విషయాల కన్నా ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఆయనకు సహకరించడం నా బాధ్యత. సేమియా పాయసం, అంబలి, జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఆయనకు చాలా ఇష్టం. అందరినీ ఈజీగా నమ్మడమే ఆయన బలం, బలహీనత. వాళ్ల అమ్మ సలహాలు ఎక్కువగా తీసుకుంటారు. పొలిటికల్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి సమస్యలు తెలుసు. కుటుంబం అందరం కలిసి భోజనం చేస్తాం. అత్తయ్య, మామయ్య సలహాలు, ప్రోత్సాహం, ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉన్నాయి. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. 2007 నవంబర్‌ 25న జరిగింది. అప్పుడప్పుడూ సినిమాలు చూస్తాం. పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. పండుగలు, శుభకార్యాలకు ఫ్యామిలీ అందరం కలిసి పాల్గొంటాం. 

ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా ఉండాలి
రాజకీయ నాయకుడిగా ఏ స్థాయిలో ఉన్నా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే నా కోరిక. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నాకు కుటుంబసభ్యులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. రాత్రి 11 గంటల వరకు అమ్మానాన్న, అక్కలు, భార్య ప్రచారంలో పాల్గొన్నారు. 2018లో మరోసారి పోటీ చేసి ప్రజల దీవెనలతో గెలుపొందాను. వృత్తిపరంగా వచ్చిన సంపాదనను రాజకీయాల్లో ఖర్చు చేశాను. రాజకీయాల్లో సంపాదించాలనే కోరిక లేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రంగంలోకి వచ్చాను. ఇన్నేళ్లుగా ప్రజల్లో మంచి పేరు, ఆశీర్వాదం సంపాదించగలిగాను. నిత్యం ప్రజల మధ్య ఉండటమే ఇష్టం. నాకు కుటుంబం పూర్తిగా సహకరించింది. బయటికి వెళ్లిన సందర్భం తక్కువనే. గెలిచినా, ఓడినా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. కొల్లాపూర్‌ ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా ఉండాలని కోరిక. ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకాన్ని పెంచుతా. ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ సేవకుడిగా ఉంటాను.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement