సాక్షి, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య బహిరంగ చర్చ సాగక ముందే రచ్చరచ్చ అయింది. కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్దిరోజులుగా వారి మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది. ఇరువురు నేతల మధ్య చర్చావేదిక నిర్వహించేందుకు ఉదయం చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు.
పది గంటలకు జూపల్లి ఇంటిని చర్చావేదికగా వారు ఖరారు చేసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచే కొల్లాపూర్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. జూపల్లి నివాసం వద్ద సైతం భారీ బందోబస్తు నిర్వహించారు. హర్షవర్ధన్‌రెడ్డి సుమారు రెండు వేలమంది కార్యకర్తలతో కలసి జూపల్లి ఇంటి వైపు ర్యాలీగా బయలుదేరారు.
స్థానిక పోలీస్‌స్టేషన్ ముందుకు రాగానే పోలీసులు నిలువరించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
దమ్ముంటే నిరూపించాలి: జూపల్లి
తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించాలని జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. ఆరోపణలపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తానని, నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తానని అన్నారు. తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్యే పారిపోయారని వ్యాఖ్యానించారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను బ్యాంకుల్లో తీసుకున్న రూ.ఆరు కోట్ల అప్పును 2007లోనే వడ్డీతో సహా రూ.14 కోట్లు చెల్లించానని పేర్కొన్నారు. ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని ఎన్జీటీలో కేసు వేసింది ఎవరు? తర్వాత ఎందుకు విత్‌డ్రా అయ్యారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి’అని జూపల్లి ప్రశ్నించారు.
అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోను: బీరం
కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆటంకం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు సింగిల్‌విండో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘ప్రజల ఆస్తులను, బ్యాంకులను మోసం చేసిన ఘనత నీదే కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఈ రోజు బహిరంగ చర్చకు పిలిచి మొహం చాటేసుకున్నావు. ఇక నుంచి నీ ఆటలు, మాటలు సాగనివ్వబోం’అని జూపల్లిని ఉద్దేశించి హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: జూపల్లి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
Comments
Please login to add a commentAdd a comment