సాక్షి, కొల్లాపూర్: కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ వర్గ పోరాటం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య ఆధిపత్య పోరుతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును సముదాయించేందుకు పార్టీ అధిష్టానం చేసిన ప్రయత్నం విఫలమైంది. అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకుండా జూపల్లి వర్గీయులు ఎన్నికల బరిలోకి దిగారు.
మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో జూపల్లి వర్గీయులు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. జూపల్లి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, ప్రచార రథాలను ఏర్పాటు చేశారు. దీంతో కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌లోని ఇరువర్గాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కొల్లాపూర్ పట్టణంపై ఆధిపత్యం సాధించేందుకు ఎమ్మెల్యే, మాజీమంత్రి ఇరువురు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారపర్వం కొనసాగిస్తున్నారు. ఈ అంశాన్ని అధిష్టానం ఎలా పరిగణిస్తుందో వేచి చూడాల్సిందే మరి.
ఆ రెండు పార్టీలూ..
టీఆర్‌ఎస్‌లో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదరడంతో అవకాశం కోసం కాంగ్రెస్, బీజేపీలు ఎదురుచూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 20, కాంగ్రెస్ 19వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. అభ్యర్థుల ఎంపికలో రెండు పార్టీల నాయకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని వార్డుల్లో రెండు పార్టీలు తమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే కొందరు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక సీపీఐ, సీపీఎంలు ఒక్కో వార్డులో పోటీలోకి దిగాయి. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఐదు నుంచి ఎనిమిది వరకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ వార్డుల్లో స్వతంత్రులు, రెబెల్స్ గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికి ఎమ్మెల్యే, మాజీమంత్రి మధ్య నెలకొన్న వర్గపోరు కొల్లాపూర్‌లో తొలిసారిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను రసవత్తరంగా మార్చాయనే చెప్పవచ్చు.
ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారాలు
వర్గపోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తనకున్న బలగంతోనే ఎన్నికల బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్ బీ ఫారాల కోసం భారీగా పోటీ ఉన్నప్పటికీ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎలాగైనా సరే మున్సిపాలిటీని కైవసం చేసుకుని కొల్లాపూర్‌పై తనకున్న పట్టును నిరూపించుకోవాలనే యోచనలో ఎమ్మెల్యే ఉన్నారు. నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నాయకులను ప్రచారంలోకి దించారు.
ఎమ్మెల్యేతోపాటు ఆయన భార్య, తల్లి కూడా ప్రచారపర్వంలో నిమగ్నమయ్యారు. టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, చింతలపల్లి జగదీశ్వర్‌రావులకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు. అధిష్టానం ఆదేశానుసారం వారికి వార్డుల వారీగా బాధ్యతలు ఇస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి నేతలతో సభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఓటర్లను కలుస్తున్న జూపల్లి
టీఆర్‌ఎస్ పార్టీకి పోటీగా అభ్యర్థులను నిలబెట్టవద్దని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని అధిష్టానం చేసిన సూచనను జూపల్లి వర్గం పెద్దగా పట్టించుకోలేదు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో జూపల్లి వర్గీయులు ఎన్నికల బరిలో నిలిచారు. ముందస్తుగానే అంగబలం, అర్ధబలం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు, జూపల్లి మద్దతుదారులు ప్రచార పర్వంలోకి దిగారు. వారంతా వార్డుల వారీగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు.
ఆర్థిక వ్యవహారాలను నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన ప్రజాప్రతినిధి చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు మినహాయించి మిగతా వారంతా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కండువాలు, ఎన్నికల గుర్తులతో ప్రచారాలు చేస్తున్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రహస్యంగా ప్రచారం సాగిస్తున్నారు. బహిరంగంగా కాకుండా ఓటర్ల ఇళ్లకు వెళ్లి మాట్లాడి వస్తున్నారు. ఆయన ప్రచార కార్యక్రమాలకు మీడియాను కూడా దూరంగా ఉంచుతున్నారు. ఆయన వినియోగించే వాహనాల నంబర్ ప్లేట్లను మూడు రోజులపాటు తొలగించారు. మళ్లీ మంగళవారం వాహనాలకు నంబర్ ప్లేట్లను అమర్చారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అపవాదు రాకుండా తనదైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ ఆరా..
కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి ఎన్నికల ప్రక్రియపై చర్చించినట్లు సమాచారం. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తనవర్గం నాయకులను ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీలో దించడంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ అంశంపై ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కొల్లాపూర్‌లో రాజకీయ పరిస్థితుల గురించి మంత్రి కేటీఆర్‌కు వివరించామని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, మిగతా వ్యవహారాలు పార్టీ చూసుకుంటుందని కేటీఆర్ సూచించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment