Attempts To Purchase 4 TRS MLAs, Record With Secret Cameras - Sakshi
Sakshi News home page

ఫామ్‌ హౌస్‌లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు? 

Published Thu, Oct 27 2022 7:46 AM | Last Updated on Thu, Oct 27 2022 8:54 AM

Attempts To Purchase 4 TRS MLAs, Record With Secret Cameras - Sakshi

ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు ప్రయత్నించిన ముగ్గురూ చేసిన ఫోన్‌ కాల్స్‌ ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరికి ఫోన్‌ చేశారు? అనే అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు సాగిన వీరి మంతనాలను నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేశారు.
చదవండి: ఎమ్మెల్యేలకు ఎర?

హర్షవర్ధన్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్‌ రోహిత్‌ రెడ్డిలను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్న సింహయాజులు స్వామి, రామచంద్ర భారతి, నంద కుమార్‌లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి, ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్‌ వేశారు. రోహిత్‌ రెడ్డి ద్వారానే ఈ సమావేశం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో ఉన్న అతడి ఫామ్‌ హౌస్‌లో జరిగేలా కథ నడిపారు. బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారు.  

వేచి చూసి దాడి చేశారు..:
ఎమ్మెల్యేల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రమే ఫామ్‌ హౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్‌తో పాటు ఆరుచోట్ల అత్యాధునికమైన రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు, నిఘా వర్గాలు మారు వేషాల్లో ఫామ్‌ హౌస్‌ చుట్టూ ఉన్నా.. సాయంత్రం ఈ సమావేశం మొదలైన వెంటనే దాడి చేయలేదు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగేవరకు, వారి మాటలతో పాటు అక్కడ జరిగే ప్రతి వ్యవహారం రికార్డు కావడం కోసం వేచి చూశారు. ఆపై దాడి చేసి ముగ్గురితో పాటు డ్రైవర్‌ తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు.

గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు!:
సమావేశం జరిగిన హాలులోని ఓ పక్కగా ఉన్న డైనింగ్‌ టేబుల్‌ వద్ద ఆ ముగ్గురూ, సోఫాల్లో ఎమ్మెల్యేలు నలుగురూ కూర్చున్నారు. ఈ మీటింగ్‌ నేపథ్యంలో రామచంద్ర భారతి మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అవతలి వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో వీలు కాలేదు. అలాగే ఆ ముగ్గురూ ఢిల్లీలో ఉన్న ఓ కేంద్ర పెద్దతో మాట్లాడించాలని ప్రయతి్నంచారని, అయితే ఆయన అందుబాటులో లేరని సహాయకుడు చెప్పిన అంశాలు రికార్డు అయినట్లు తెలిసింది.

3 రోజులు..70 మంది పోలీసులు:
ఈ ఆపరేషన్‌ కోసం నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది 3 రోజులు పని చేశారు. రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 84 సీక్రెట్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. గంటన్నర పాటు సాగిన భేటీ ఈ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పీఠాధిపతిగా ప్రకటించుకున్న సింహయాజులు: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వంలో కీలకంగా వ్యవహరించిన సింహయాజులు స్వామి తిరుపతి వాసి. అన్నమయ్య జిల్లా చిన్న మండ్యం మండలంలో శ్రీమంత్రరాజ పీఠం ఏర్పాటు చేసుకొని, తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు. అది లక్ష్మీ నరసింహ స్వామికి చెందిన పీఠంగా చెబుతూ పలుకుబడి పెంచుకున్నాడు. ఇతడికి తిరుపతిలో సొంత ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

డబ్బు తెచ్చింది నందూయేనా..?:
రామచంద్ర భారతి ఢిల్లీ ఫరీదాబాద్‌లోని ఓ ఆలయ పూజారి కాగా.. కర్ణాటకకు చెందిన నందకుమార్‌ నగరానికి వలసవచ్చి చైతన్యపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్‌ ప్రాంతంలో సదరన్‌ స్పైస్‌ పేరుతో ఓ రెస్టారెంట్‌ నడిపాడు. ఫిల్మీ జంక్షన్‌ అనే రెస్టారెంట్‌ నిర్వహణ సమయంలో దాని స్థల యజమాని అయిన సినీ ప్రముఖుడితో విభేదాలు తలెత్తాయి. ఆపై అవినాష్‌ అనే వ్యక్తితో కలిసి మాణిక్‌చంద్‌ పాన్‌ మసాలా వ్యాపారం చేశాడు.

తర్వాత మాణిక్‌ చంద్‌ బ్రాండ్‌ను తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీలోనూ సౌత్‌ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. వీటితో పాటు నగరంలోని అనేక పబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో భాగస్వామ్యం ఉంది. పలువురు ప్రముఖులు ఇతడి వద్ద పెట్టుబడులు పెట్టారని, కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులతో ఇతడికి స్నేహం ఉందని, హవాలా ఆపరేటర్‌ అని కూడా తెలిసింది. బుధవారం నందు పుట్టిన రోజు కావడంతో ఈ ఫామ్‌ హౌస్‌లో పార్టీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హవాలా ఆపరేటర్‌ కావడంతో డబ్బు తీసుకువచ్చింది నందూయేనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా నిందితులు ముగ్గుర్నీ పోలీసులు ఫామ్‌హౌస్‌ నుంచి తరలించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement