Telangana Politics: Bargaining For Purchase Of Four TRS MLAs - Sakshi
Sakshi News home page

నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర?

Published Thu, Oct 27 2022 2:22 AM | Last Updated on Thu, Oct 27 2022 10:56 AM

Bargaining for purchase of four TRS MLAs In Telangana - Sakshi

హైదరాబాద్‌ శివార్లలోని అజీజ్‌నగర్‌లో ఉన్న పీవీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయించేలా నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నికను ప్రభావితం చేసేలా ఓ జాతీయ పార్టీ అండదండలతో వ్యూహాత్మక బేరసారాలు జరిగినట్టు ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ టీఆర్‌ఎస్‌ ఆరోపించడం.. ఆ నలుగురు హార్డ్‌కోర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తామేం చేసుకుంటామంటూ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొట్టిపారేయడం చర్చనీయాంశంగా మారాయి. 

అజీజ్‌ నగర్‌ ఫామ్‌హౌజ్‌ వేదికగా.. 
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), పైలట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), రేగ కాంతారావు (పినపాక)లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర బుధవారం రాత్రి ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే భారీ ఎత్తున డబ్బులిస్తామని.. పదవులు, కాంట్రాక్టులు అప్పగిస్తామని ఆ ముగ్గురు ఎర వేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.

ఈ ప్రలోభాలకు వేదిక అయిన రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ పరిధిలో ఉన్న పీవీఆర్‌ ఫామ్‌హౌజ్‌పై దాడి చేసి.. ఫరీదాబాద్‌కు చెందిన రాంచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు, కేంద్ర మంత్రికి సన్నిహితుడని చెప్తున్న నందకుమార్‌ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

ఈ ప్రలోభాలకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే తాము దాడి చేశామన్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్‌హౌజ్‌కు చేరుకుని.. ముగ్గురు వ్యక్తులతో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపినట్టు సమాచారం. తర్వాత సైబరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) దాడులు జరిగాయి.

ఈ సందర్భంగా భారీగా నగదు, సెల్‌ఫోన్లు, వాహనాలను స్వాదీనం చేసుకున్నట్టు ప్రచారం జరిగినా.. పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.వంద కోట్లతోపాటు పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల్లో గువ్వల బాలరాజు మినహా మిగతా ముగ్గురు కాంగ్రెస్‌ తరఫున గెలిచి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరినవారే. 
 
ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో..: స్టీఫెన్‌ రవీంద్ర 
దాడి అనంతరం ఫామ్‌హౌజ్‌ వద్ద సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ‘‘తమను కొందరు ప్రలోభపెడుతున్నారని ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు దాడులు చేశాం. ఫరీదాబాద్‌ పీఠాధిపతి ఈ మొత్తం వ్యవహారంలో కీలక మంతనాలు సాగించారు.

డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టినట్టు ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ప్రలోభాలకు ప్రయతి్నంచారు, ఇతర అంశాలు ఏమిటన్నది దర్యాప్తు చేస్తాం. డబ్బు ఇచ్చారా? ఇస్తే ఎంత ఇచ్చారు? ఎక్కడి నుంచి వచి్చంది? ఎవరు తీసుకువచ్చారనే వివరాలు సేకరిస్తాం..’’ అని తెలిపారు. 

ఆ ముగ్గురూ ఎవరు? 
ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో ఓ దేవాలయంలో ఉండే రాంచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌శర్మ, తిరుపతిలో ఓ పీఠానికి అధిపతిగా చెప్పుకొనే సింహయాజులు, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దక్కన్‌ ప్రైడ్, అంబర్‌పేటలో సెలబ్రేషన్స్‌ పేరిట హోటళ్లను నిర్వహిస్తున్న నందకుమార్‌.. ఈ ముగ్గురూ ఎమ్మెల్యేల ప్రలోభం కేసులో నిందితులుగా ఉన్నారు.

వారు కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో నందకుమార్‌కు చెందిన హోటళ్లు, ఫామ్‌హౌజ్‌లలో ఉంటున్నట్టు సమాచారం. నందకుమార్‌ ఓ కేంద్ర మంత్రికి సన్నిహితుడని.. ఈ ముగ్గురూ కలిసి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని టీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేస్తోంది. 

 
మూడు రోజులుగా స్కెచ్‌ వేసి.. 
పార్టీ ఫిరాయించాలంటూ సంప్రదించిన ముగ్గురు వ్యక్తులను పట్టించేందుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారని.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రెడహ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పక్కా ప్లాన్‌ వేశారని రాజకీయ, పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాల మేరకు.. ప్రలోభాల అంశంపై నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారమిచ్చారు. తాము పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.100 కోట్లు, కాంట్రాక్టులు, కేంద్రం ఆధీనంలోని పదవులు ఇస్తామంటూ ఎర వేశారని వివరించారు.

అయితే నేరుగా ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే అసలు విషయం బయటపడదని భావించిన పోలీసులు.. బేరసారాలు సాగిస్తూ, అడ్వాన్సులు ఇచ్చే సమయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం నిఘావర్గాలతోపాటు సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల సూచన మేరకు.. సదరు ముగ్గురితో ఎమ్మెల్యేలు సంప్రదింపులు కొనసాగించారు.

అడ్వాన్స్‌ ఇచ్చేందుకు ఆ ముగ్గురు వ్యక్తులు సిద్ధమవడంతో బుధవారం అజీజ్‌నగర్‌లోని పైలట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌజ్‌కు రావాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని చిత్రీకరించేందుకు పోలీసులు రహస్య కెమెరాలు, ఇతర నిఘా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నుంచే ఫామ్‌హౌస్‌ పరిసర ప్రాంతాల్లో కాపు కాశారు. కూలీలు, చిన్న వ్యాపారులు, స్విగ్గీ, జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా మారువేషాలు వేసుకుని నిఘా పెట్టారు.

నలుగురు ఎమ్మెల్యేలు సాయంత్రం 5 గంటల సమయంలో, కాసేపటి తర్వాత ముగ్గురు వ్యక్తులు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. సమావేశం మొదలైందని, డబ్బుతో కూడిన రెండు సంచులు లోపలికి వచ్చాయని ఎమ్మెల్యేల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడి చేసిన అధికారులు సింహయాజులు, రాంచంద్రభారతి, నందకుమార్‌లతోపాటు తిరుపతి అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
రూ.15 కోట్లు స్వాదీనం? 
పోలీసులు తమదాడి సందర్భంగా ఓ కారును, రెండు బ్యాగుల్లో రూ.15 కోట్ల నగదు, సెల్‌ఫోన్లు, ఇతర పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సింహయాజులు, రాంచంద్రభారతి, నందకుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారితో వచ్చిన తిరుపతి అనే వ్యక్తి తాను కారు డ్రైవర్‌నని చెప్పడంతో వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు స్వా«దీనం చేసుకున్న కారు గంధవరం దిలీప్‌కుమార్‌ పేరిట ఉందని.. ఆయన ఎవరు? ఆ ముగ్గురితో సంబంధంలు ఏమిటన్నది ఆరా తీస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 
 
పరిచయాలే పెట్టుబడిగా వ్యాపారాలతో..! 
అంబర్‌పేట: నందకుమార్‌ కుటుంబం కర్ణాటక నుంచి వచ్చి అంబర్‌పేట డీడీ కాలనీలో స్థిరపడ్డారని.. ఆయన తండ్రి శంకరప్ప హైదరాబాద్‌ నగర పీస్‌ కమిటీ సభ్యులని స్థానికులు చెబుతున్నారు. ఆయనకు పోలీసుశాఖలో ఉన్న పరిచయాలను కుమారుడు నందకుమార్‌ వినియోగించుకుని పలు వ్యాపారాల్లో అడుగుపెట్టారని అంటున్నారు. ప్రధానంగా హోటల్‌ రంగంలో ఉన్న నందకుమార్‌పై పలు ఆరోపణలూ ఉన్నాయని పేర్కొంటున్నారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నందకుమార్‌కు పరిచయమని.. తన హోటళ్ల ప్రారంభోత్సవాలకు కిషన్‌రెడ్డిని ఆహ్వానించారని చెబుతున్నారు. నందకుమార్‌ స్థానికంగా పెద్దగా కనిపించరని.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల అంశం అంబర్‌పేటలో చర్చనీయాంశంగా మారిందని పేర్కొంటున్నారు. 
  
ఎవరా ముగ్గురు? 
ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో ఓ దేవాలయంలో పురోహితుడు రామచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌శర్మ.. తిరుపతిలో ఓ పీఠానికి అధిపతిగా చెప్పే సింహయాజులు.. హైదరాబాద్‌లో హోటల్స్‌ వ్యాపారం చేసే నందకుమార్‌ 

ఎలా ఆపరేషన్‌? 
ఎమ్మెల్యేల సమాచారం మేరకు పక్కాగా ప్లాన్‌ వేసిన పోలీసులు. కూలీలు, చిన్న వ్యాపారులు, స్విగ్గీ, జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ వేషాల్లో నిఘా. అంతా ఫామ్‌హౌజ్‌లోకి చేరుకున్నాక, డబ్బు సంచులు వచ్చాయని ఎమ్మెల్యేలు సమాచారమిచ్చాక దాడి. రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్టు. 

ఏం ఇస్తామన్నారు?
పార్టీ మారితే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని పదవులు ఇస్తామంటూ ప్రలోభపెట్టారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దాడి సందర్భంగా పోలీసులు రూ.15 కోట్లు పట్టుకున్నట్టు ప్రచారం జరిగింది. దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement