అంతకు మించి! | TRS Public Meeting In Wanaparthy Polytechnic College | Sakshi
Sakshi News home page

అంతకు మించి!

Published Fri, Mar 30 2018 8:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TRS Public Meeting In Wanaparthy Polytechnic College - Sakshi

వనపర్తి పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట వెలిసిన కటౌట్లు, ఫ్లెక్సీలు

సాక్షి వనపర్తి : నిన్న కాంగ్రెస్‌ సింహగర్జన.. నేడు టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ.. ఇరు పార్టీలు ఒకే వేదికను ఎంచుకోవడం ఒక ఎత్తయితే సింహగర్జనకు వచ్చిన జనానికి మించి నేడు జరిగే బహిరంగ సభలో జనం భారీగా కనిపించాలని టీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాట్లు చేస్తుండటం మరో ఎత్తు. ప్యాలెస్‌ ప్రాంగణంలో పెద్దపెద్ద కటౌట్లు.. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో హడావుడి చేశారు. ఇరుపార్టీల సందడి చూస్తుంటే ఏడాది ముందుగానే ఇక్కడి నాయకులు బల ప్రదర్శనకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. 

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు 
జిల్లాలో నేడు ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించనున్నారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఉదయం 10.20 గంటలకు కొత్తకోట చేరుకొని అక్కడ చేనేత కార్మికులను కలుసుకుంటారు. అటునుంచి మదనాపురం చేరుకొని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ పాఠశాలలో నిర్వహించనున్న సభలో పాల్గొంటారు.

అటు నుంచి కానాయపల్లిలో మిషన్‌భగీరథ బల్క్‌ సప్లయి ప్రారంభించి వనపర్తి మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి 12.15 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి మిషన్‌ భగీరథ ఇంట్రా విలేజ్‌ పనులను సైతం  ప్రారంభించనున్నారు. 12.30 నిమిషాల నుంచి వనపర్తి పట్టణంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలనుంచి 7.30 వరకు జిల్లాకేంద్రంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.  

రాజుకున్న ఎన్నికల వేడి 
సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది ఉన్నా జిల్లాలో రాజకీయ వేడి అపుడే రాజుకుంది. ఒక పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేస్తే మరో పార్టీ దానికి ప్రత్యామ్నాయంగా మరో కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. ఆ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు చేయడం మొదలెట్టారు. సరిగ్గా 25 రోజుల కిందట పాలిటెక్నిక్‌ మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింహగర్జన కార్యక్రమం విజయవంతమైంది.

ఇప్పుడు అదే మైదానంలో టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగసభ నిర్వహించనుంది. అయితే భారీ స్థాయిలో జనా న్ని సమీకరించేంందుకు పది రోజులుగా ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. చోటామోటా నాయకుల సహకారంతో కనీసం 20వేల మందికి పైగా సభకు తరలించాలని వ్యూహం రచించారు.  

కేటీఆర్‌ ప్రసంగంపై చర్చలు  
మంత్రి కేటీఆర్‌ కొన్నిరోజులుగా ఏ జిల్లాలో పర్యటించినా, ఏ సభల్లో పాల్గొన్నా ప్రధాన ప్రతిపక్ష మైన కాంగ్రెస్‌పై, ఆ పార్టీ నాయకులపై మాటల యుద్ధం చేస్తున్న విషయం తెలుస్తూనే ఉంది. అయితే 25 రోజుల కిందట కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన సింహగర్జనలో రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డిలు కేసీఆర్‌పై ఆయన కుటుంబంపై,  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పైనా మాటలతో విరుచుకు పడ్డారు. ఇప్పుడు అదే ప్రాంతంలో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్‌ ఎలాంటి ప్రసంగం చేస్తారోనని సర్వత్రా చర్చనీయాంశమైంది.  

సింగిరెడ్డి దంపతుల విస్తృత ప్రచారం 
బహిరంగ సభను విజయవంతం చేయాలని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిరంజన్‌రెడ్డి ఓ పక్క, ఆయన సతీమణి వాసంతి ఓ పక్క గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గురువారం శ్రీరంగాపురం, జానంపేట, వెంకటాపురం గ్రామాల్లో ఆయన సతీమణి పర్యటిం చగా, జిల్లా కేంద్రం, మదనాపురంలో ఏర్పాటుచేసే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను నిరంజన్‌రెడ్డి పర్యవేక్షించారు. మొదటి సారి గా మంత్రి కేటీఆర్‌ జిల్లాకు రానున్న నేపథ్యంలో కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ఘనస్వాగతం పలకాలనీ, సభకు భారీగా జనాన్ని తీసుకరావాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement