
సాక్షి, హైదరాబాద్: వనపర్తి నుంచి గద్వాల మీదుగా మంత్రాలయానికి కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త జిల్లా కేంద్రమైన వనపర్తికి నేరుగా ఏ జాతీయ రహదారి అనుసంధానం లేదు. అలాగే గద్వాల నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు వనపర్తిని గద్వాలతో అనుసంధానిస్తూ.. అక్కడి నుంచి మంత్రాలయానికి నాగులదిన్నె మీదుగా జాతీయ రహదారి నిర్మించే ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.
తెలంగాణ జాతీయ రహదారుల విభాగం నుంచి అందిన ప్రతిపాదనలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ పరిశీలిస్తోందని.. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల నుంచి ఏపీలోని మంత్రాలయానికి వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా ప్రయాణిస్తున్నారు. అదే కొత్త హైవే ఏర్పాటై గద్వాల నుంచి ఐజా మీదుగా వెళ్తే దాదాపు 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
నాలుగు రహదారుల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్
వచ్చే రెండేళ్లలో తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సంవత్సరమే పనులు ప్రారంభం కానున్నాయి. మెదక్–ఎల్లారెడ్డి మధ్య 43.9 కిలోమీటర్ల రోడ్డును రూ.399.01 కోట్లతో రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో.. ఎల్లారెడ్డి–రుద్రూరు మధ్య 37.28 కిలోమీటర్ల మార్గాన్ని రూ.499.88 కోట్లతో రెండు వరసల రోడ్డుగా విస్తరించనున్నారు.
ఇక ఖమ్మం–కురవి మధ్య 37.43 కిలోమీటర్ల రోడ్డును రూ.455.76 కోట్లతో, ఆదిలాబాద్–బేల మధ్య 32.97 కిలోమీటర్ల రోడ్డును రూ.490.92 కోట్లతో విస్తరించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మెరుగైన రోడ్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment