Highways Department
-
సెల్ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి
న్యూఢిల్లీ: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ వాహనాలను నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాల్లో 2021లో 1,040 మంది మృతి చెందారు. అదేవిధంగా, రెడ్‌లైట్ పడినా పట్టించుకోకుండా వాహనాలను ముందుకు పోనివ్వడంతో 555 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని, 222 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై గుంతల కారణంగా 3,625 ప్రమాదాలు జరగ్గా, 1,481 మంది మృత్యువాతపడ్డారు. 2021కి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ఇటీవల వెల్లడించిన నివేదిక ఈ అంశాలను పేర్కొంది. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 1,53,972 మంది చనిపోగా, 3,84,448 మంది గాయపడినట్లు ఆ నివేదిక తెలిపింది. -
వనపర్తి–మంత్రాలయం మధ్య నేషనల్ హైవే!
సాక్షి, హైదరాబాద్: వనపర్తి నుంచి గద్వాల మీదుగా మంత్రాలయానికి కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త జిల్లా కేంద్రమైన వనపర్తికి నేరుగా ఏ జాతీయ రహదారి అనుసంధానం లేదు. అలాగే గద్వాల నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు వనపర్తిని గద్వాలతో అనుసంధానిస్తూ.. అక్కడి నుంచి మంత్రాలయానికి నాగులదిన్నె మీదుగా జాతీయ రహదారి నిర్మించే ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ జాతీయ రహదారుల విభాగం నుంచి అందిన ప్రతిపాదనలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ పరిశీలిస్తోందని.. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల నుంచి ఏపీలోని మంత్రాలయానికి వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా ప్రయాణిస్తున్నారు. అదే కొత్త హైవే ఏర్పాటై గద్వాల నుంచి ఐజా మీదుగా వెళ్తే దాదాపు 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. నాలుగు రహదారుల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ వచ్చే రెండేళ్లలో తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సంవత్సరమే పనులు ప్రారంభం కానున్నాయి. మెదక్–ఎల్లారెడ్డి మధ్య 43.9 కిలోమీటర్ల రోడ్డును రూ.399.01 కోట్లతో రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో.. ఎల్లారెడ్డి–రుద్రూరు మధ్య 37.28 కిలోమీటర్ల మార్గాన్ని రూ.499.88 కోట్లతో రెండు వరసల రోడ్డుగా విస్తరించనున్నారు. ఇక ఖమ్మం–కురవి మధ్య 37.43 కిలోమీటర్ల రోడ్డును రూ.455.76 కోట్లతో, ఆదిలాబాద్–బేల మధ్య 32.97 కిలోమీటర్ల రోడ్డును రూ.490.92 కోట్లతో విస్తరించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మెరుగైన రోడ్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
ట్రాఫిక్ ఉల్లంఘనలకు 15 రోజుల్లోగా ఈ–చలాన్
న్యూఢిల్లీ: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇకపై 15 రోజుల్లోగా నోటీసు(ఈ–చలాన్) జారీ చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘన జరిగిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నోటీసును వాహనదారుడికి చేరవేయాలి. చలాన్ సొమ్మును వాహనదారుడు చెల్లించేదాకా సదరు ఎలక్ట్రానిక్ రికార్డును భద్రపర్చాలి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కొత్త నియమాలను అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహన చట్టం–1989కు ఇటీవల సవరణ చేయడం తెల్సిందే. కొత్త రూల్స్ ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, శరీరంపై ధరించే కెమెరా, స్పీడ్ గన్, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్) వంటి సాంకేతిక పరికరాలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. అధికంగా ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కీలకమైన జంక్షన్లు, నోటిఫికేషన్లో ప్రస్తావించిన 132 నగరాలతోపాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని నగరాల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా, హైవేల శాఖ సూచించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేయాలని తెలిపింది. నోటిఫై చేసిన నగరాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్‌లో 17, ఆంధ్రప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 9 నగరాలు ఉన్నాయి. -
బీఐఎస్ నాణ్యత హెల్మెట్లు మాత్రమే..
న్యూఢిల్లీ: ద్విచక్రవాహనదారులకు మరింత భద్రత కల్పించేలా బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే దేశంలో లభించేలా నియమాలను రూపొందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రోడ్డు రవాణా, హైవేల శాఖ ముసాయిదా నివేదికను ఇచ్చింది. దేశంలో బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే తయారు చేసేలా, బీఎస్ఐ సర్టిఫికెట్ ఉండేలా నియమాలు తీసుకొని రానుంది. దీనివల్ల ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు మరణాలపాలయ్యే అవకాశాలు తగ్గుతాయని చెప్పింది. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే నెల రోజుల్లోగా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీకి పంపాలని కోరింది. -
రహదారికి దారేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. వీటి మరమ్మతులపై అధ్యయనం చేసిన రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ.. ఉమ్మడి జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఆయా జిల్లాల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఆర్అండ్బీ ఉన్నతాధికారులు నష్టాన్ని అంచనా వేశారు. ఈ మేరకు ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో దాదాపు 5 వేల కిలోమీటర్లకు పైగా రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటికి తక్షణమే మరమ్మతులు అవసరమని భావించి.. అంచనాలను రూపొందించారు. దాదాపు రూ.300 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. 5 వేల కిలోమీటర్లు.. వాస్తవానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పరిధిలో దాదాపుగా 26,935 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. వీటిలో జాతీయ (2,690 కిలోమీటర్లు), రాష్ట్ర (3,152), మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు (12,079) అదర్ డిస్ట్రిక్ట్ రోడ్లు (9,014) ఉన్నాయి. ఇందులో దాదాపు 5,000 కిలోమీటర్లకుపైగా రోడ్లకు తక్షణమే మరమ్మతులు అవసరం. మరమ్మతుల కోసం గత నెలలో దాదాపు రూ.300 కోట్లు మేర అంచనాలను రూపొందించి పంపినా, ఇంతవరకూ ఆమోదం పొందలేదు. దీంతో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు గతుకుల రోడ్లపై నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి 10 జిల్లాల్లోని వివిధ రహదారులకు చాలా చోట్ల ప్యాచ్‌వర్కులు అత్యవసరం. గుంతలు, గతుకులతో చాలా చోట్ల రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీటికి సరైన సమయంలో మరమ్మతులు నిర్వహించకపోతే.. పరిస్థితి మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంది. ఇంకొన్ని రోజులు వేచి చూసి.. ప్రభుత్వం నుంచి అప్పటికీ ఆమోదం రాకపోతే అత్యవసర నిధుల నుంచి కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. మరీ ఇబ్బందికరంగా ఉన్న చోట అత్యవసర నిధులు కేటాయించి మరమ్మతులు మొదలుపెడతామని చెబుతున్నారు. -
5 కోట్ల నకిలీ డ్రైవింగ్ లెసైన్సులు
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే రోడ్డు రవాణా భద్రతా బిల్లు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా నకిలీ డ్రైవింగ్ లెసైన్స్లున్నాయని.. డ్రైవింగ్ లెసైన్స్ పొందేందుకు చాలామంది నకిలీ డాక్యుమెంట్లను ఇస్తున్నారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఆదివారం రాజ స్తాన్ రవాణా శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసిన రవాణా మంత్రుల సమావేశంలో గడ్కారీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా నకిలీ డ్రైవింగ్ లెసైన్స్‌లను, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు త్వరలోనే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రైవింగ్ లెసైన్స్ నకిలీదని తేలితే సదరు వ్యక్తులకు గరిష్టంగా ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించనున్నారు. నకిలీ లెసైన్స్‌దారుల ఆటకట్టించేందుకు కంప్యూటరైజ్డ్ ఆన్లైన్ టెస్ట్‌లను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి రోడ్డు రవాణా భద్రతా బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్లు గడ్కారీ తెలిపారు. ఇకనుంచి డ్రైవింగ్ లెసైన్స్‌కు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.