వాల్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్న జనవిజ్ణాన వేదిక నాయకులు
వనపర్తి విద్యావిభాగం: రాష్ట్రంలో మూఢనమ్మకాలను శాశ్వతంగా దూరం చేసేందుకు మూఢనమ్మకాల నిరోధన చట్టాన్ని ప్రవేశపెట్టాలని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కోశాధికారి జితేందర్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో జనవిజ్ఞాన వేదిక వనపర్తి జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని విడుదల చేయాలని వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ఎదుగుతున్నా మూఢనమ్మకాలను పాటించడంలో తగ్గడం లేదన్నారు.
నేటికీ రాష్ట్రం నలుమూలలా ఎక్కడో ఒకచోట చేతబడి, బాణామతి, మంత్రాలు, క్షుద్రపూజలు వంటివి కొనసాగుతూ దాడులు, హత్యలు చేసుకునే పరిస్థితి కొనసాగుతుందన్నారు. మూఢనమ్మకాలతో జరుగుతున్న సంఘటనలు సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment