
శ్రీరంగాపూర్‌లోని రంగనాయకస్వామి ఆలయం
సాక్షి; శ్రీరంగాపూర్ (కొత్తకోట): ఇక్కడి రంగనాథస్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా సెలవు రోజుల్లో వివిధ రాష్ట్రాల నుండే గాక విదేశాల నుంచి సైతం భక్తులు పర్యాటకులు అధికంగా వస్తుంటారు. వనపర్తి జిల్లాలోనే అత్యధిక శిల్ప సంపద కలిగిన ఈ ఆలయం చుట్టూ నీటితో కళకళలాడే రంగసముద్రం చెరువు ఉంది. ఇది రమణీయంగా ఉంటుంది. ఇక్కడి మ్యూజియంలో ప్రసిద్ధిగాంచిన తంజావూరు చిత్రపటాలను భద్రపరిచారు. ఏటా హోలి రోజు ఇక్కడ పగలు రంగనాయకస్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమాలు రాజా రాజరామేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతాయి.
సినిమా, సీరియల్ షూటింగ్‌లకు ప్రత్యేకత
రంగనాయకస్వామి ఆలయం చుట్టూ నీటితో కళకళలాడుతున్న చెరువు ఉండడంతో పాటు పురాతన ఆలయం, గోపురాలు, శిల్పాలు ఉండడంతో చాలా సినిమాలు, తరచూ సీరియల్ షూటింగులు ఇక్కడే జరుగుతుంటాయి.
ఆలయాన్ని చేరుకోండి ఇలా..
హైదరాబాద్ నుంచి 160 కి.మీ. దూరంలో శ్రీరంగాపూర్ ఉంటుంది. 44వ జాతీయ రహదారిపై పెబ్బేరు మీదుగా 10 కి.మీ. వెళితే ఈ ఆలయం వస్తుంది. వనపర్తి జిల్లా కేంద్రం నుంచి 25 కి.మీ. ఈ ఆలయానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ఆటోలు నిత్యం అందుబాటులో ఉంటాయి.