బెక్కెం శివారులో ఓ రైతు పొలంలో కర్రల స్తంభాలపై విద్యుత్ లైన్
సాక్షి, చిన్నంబావి (వనపర్తి): మండలంలోని పలు గ్రామాల్లో కరెంట్ స్తంభాలు లేవు. దీంతో కర్రలనే కరెంట్ స్తంభాలుగా ఉపయోగిస్తూ వ్యవసాయ, డొమెస్టిక్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాలికి, వానకు కర్రలు కూలిపోతే కరెంట్ సరఫరా ఆగిపోతోంది.
పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి..
పెద్దదగడ, వెలగొండ సబ్‌ష్టేషన్ పరిధిలోని గూడెం, బెక్కెం, అమ్మాయిపల్లి, దగడపల్లి, మియాపూర్ తదితర గ్రామాల్లో ఎప్పుడ ఏ ప్రమాదం పొంచి ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నమారు, గూడెం, పెద్దమారు గ్రామల్లో స్తంభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ రోజుల్లో కరెంట్ క్షణం పోతేనే నానా హైరానా పడతాం. అలాంటిది ఈ ప్రాంతాల్లోని ప్రజలకు కరెంట్ సమస్య ప్రధానంగా మారింది. వ్యవసాయ పంటపొలాల్లో మరీ పరిస్థితి దారుణంగా ఉంది. వ్యవసాయపు మోటార్ల దగ్గరికి కనెక్షన్ రావాలంటే దాదాపుగా కి.మీ పైనే కర్రలపై విద్యుత్ కనెక్షన్ రైతులు తీసుకుంటున్నారు. ఇక్కడ సరిపడా స్తంభాలు లేక సర్వీస్ వైర్లు అన్ని కర్రలు, ఇనుప స్తంభాలపైనే ఆసరాగా చేసుకుని ప్రజలు, రైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా ప్రజ లు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. వాటికింది నుం చే రైతులు, ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.
ట్రాన్స్‌పార్మర్ల కొరత..
ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సరిపడ స్తంభాలు, ట్రాన్స్‌పార్మర్‌లు లేవు. గతంలో ఇక్కడ విద్యుత్ చోరీలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ స్తంభాలు,ట్రాన్స్‌పార్మర్‌లు లేకపోవడంతో స్తానిక ప్రజలు నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరెంట్ స్తంభాలు ఇవ్వాలి..
ఈ కర్రలపై కరెంట్ సర్వీస్ వైర్లు పెట్టుకుని స్తంభాల నుంచి వ్యవసాయ పంటపొల్లాలోకి కరెంట్ తీసుకున్నాం. కరెంట్ బిల్లులు రెగ్యులర్‌గా కడుతున్నాం. ఎప్పుడు కూడా మాకు స్తంభాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం లేదు. అందుకే మేమే అందరం కలసి కర్రలపైనే కరెంట్ వైర్లు ఏర్పాటు చేసుకున్నాం. స్తంభాలు ఇవ్వాలని కోరుతున్నాం.
– బాలస్వామి, చిన్నంబావి
పట్టించుకోవడం లేదు
కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు, నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా సమస్యకు పరిష్కారం చూపడం లేదు. అధికారులు స్పందించాలి.
– రాజు, బెక్కెం
Comments
Please login to add a commentAdd a comment