power destribution
-
కర్రలే కరెంట్ స్తంభాలు!
సాక్షి, చిన్నంబావి (వనపర్తి): మండలంలోని పలు గ్రామాల్లో కరెంట్ స్తంభాలు లేవు. దీంతో కర్రలనే కరెంట్ స్తంభాలుగా ఉపయోగిస్తూ వ్యవసాయ, డొమెస్టిక్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాలికి, వానకు కర్రలు కూలిపోతే కరెంట్ సరఫరా ఆగిపోతోంది. పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి.. పెద్దదగడ, వెలగొండ సబ్‌ష్టేషన్ పరిధిలోని గూడెం, బెక్కెం, అమ్మాయిపల్లి, దగడపల్లి, మియాపూర్ తదితర గ్రామాల్లో ఎప్పుడ ఏ ప్రమాదం పొంచి ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నమారు, గూడెం, పెద్దమారు గ్రామల్లో స్తంభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ రోజుల్లో కరెంట్ క్షణం పోతేనే నానా హైరానా పడతాం. అలాంటిది ఈ ప్రాంతాల్లోని ప్రజలకు కరెంట్ సమస్య ప్రధానంగా మారింది. వ్యవసాయ పంటపొలాల్లో మరీ పరిస్థితి దారుణంగా ఉంది. వ్యవసాయపు మోటార్ల దగ్గరికి కనెక్షన్ రావాలంటే దాదాపుగా కి.మీ పైనే కర్రలపై విద్యుత్ కనెక్షన్ రైతులు తీసుకుంటున్నారు. ఇక్కడ సరిపడా స్తంభాలు లేక సర్వీస్ వైర్లు అన్ని కర్రలు, ఇనుప స్తంభాలపైనే ఆసరాగా చేసుకుని ప్రజలు, రైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా ప్రజ లు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. వాటికింది నుం చే రైతులు, ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాన్స్పార్మర్ల కొరత.. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సరిపడ స్తంభాలు, ట్రాన్స్పార్మర్లు లేవు. గతంలో ఇక్కడ విద్యుత్ చోరీలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ స్తంభాలు,ట్రాన్స్పార్మర్లు లేకపోవడంతో స్తానిక ప్రజలు నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ స్తంభాలు ఇవ్వాలి.. ఈ కర్రలపై కరెంట్ సర్వీస్ వైర్లు పెట్టుకుని స్తంభాల నుంచి వ్యవసాయ పంటపొల్లాలోకి కరెంట్ తీసుకున్నాం. కరెంట్ బిల్లులు రెగ్యులర్‌గా కడుతున్నాం. ఎప్పుడు కూడా మాకు స్తంభాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం లేదు. అందుకే మేమే అందరం కలసి కర్రలపైనే కరెంట్ వైర్లు ఏర్పాటు చేసుకున్నాం. స్తంభాలు ఇవ్వాలని కోరుతున్నాం. – బాలస్వామి, చిన్నంబావి పట్టించుకోవడం లేదు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు, నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా సమస్యకు పరిష్కారం చూపడం లేదు. అధికారులు స్పందించాలి. – రాజు, బెక్కెం -
విద్యుత్ లైన్లు మృత్యుపాశాలు!
సాక్షి, ఉప్పునుంతల: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. 11కేవీఏ లైన్లు ఇళ్లపై వేలాడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులు, ఉరుములు మెరుపుల సమయంలో మరింత భయపడుతున్నారు. దీంతోపాటు గ్రామాల్లో ఎన్నో ఏళ్ల క్రితం పాతిన స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వ్యవసాయ పొలాల్లో రైతులు కర్ర స్తంభాలపైనే విద్యుత్ లైన్లను అమర్చి ప్రమాదపుటంచున వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి సమస్యలు ఏళ్ల తరబడిగా ప్రజలను వేధిస్తున్నాయి. పలుమార్లు ప్రజాప్రతినిధులకు, సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా ఫలితంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లపై 11కేవీఏ లైన్లు.. మండలంలోని వెల్టూరులోని ఫకీర కాలనీలో 11కేవీఏ విద్యుత్ లైన్లు ఇళ్ల పై నుంచి ఉన్నాయి. దీంతో ఆ కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో పలుమార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. దాసర్లపల్లిలో కూడా అలాగే ఉన్నాయి. మూడేళ్ల క్రితం గాలి దుమారానికి విద్యుత్ లైన్ తీగలు తెగిపడి పశుగ్రాసం, గుడిసెలు కాలిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ లైన్ మారుస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉప్పునుంత మడ్డవోనిపంపు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, తిర్మలాపూర్, తిప్పాపూర్, వెల్టూర్ తదితర గ్రామాల్లో విద్యుత్ లైన్లు ఇళ్లపై ఉన్నాయి. వీటితో పాటు కొన్నేళ్ల క్రితం ఆయా గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేయడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పొలాల్లో.. వ్యవసాయ పొలాల్లో విద్యుత్ లైన్లు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. గుట్టమీది తండా శివా రులో విద్యుత్ తీగలు పూర్తిగా కిందకు వేలాడుతున్నాయి. ఉప్పునుంతల నుంచి కొత్త రాంనగర్ వెళ్లే దారి పక్కన బల్సోని బావి వద్ద రైతులు కొన్నేళ్ల నుంచి రైతులు కర్ర స్తంభాలపైనే విద్యుత్ తీగలు అమర్చుకొని మోటార్లు నడుపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మార్పునకు ప్రొవిజన్ లేదు కాలనీలు, ఇళ్లపై ఉన్న విద్యుత్ లైన్లు మార్చడానికి శాఖాపరంగా ప్రొవిజన్ లేదు. కాలనీ వాసులు, ఇళ్ల యజమానులు లైన్ మార్పిడికి అయ్యే ఖర్చు భరిస్తే మాత్రం అవకాశం ఉన్నచోట ప్రతిపాదనలు తయారుచేసి విద్యుత్ లైన్ మార్పిడి చేసే అవకాశం ఉంది. గ్రామాల్లో కొన్నేళ్ల క్రితం వేసిన కరెంట్ లైన్లు వేలాడుతుంటే, స్తంభాలు ఒరిగిపోతే, బిల్లులు పెండింగ్ లేకుండా చెల్లిస్తే మార్చే అవకాశం ఉంది. వ్యవసాయ మోటారు కనెక్షన్‌కు డీడీలు కట్టిన రైతులకు మాత్రం ఇంతకుముందు మెటీరియర్ డ్రా చేయకుండా ఉంటే ప్రస్తుతం వాటిని పరిశీలించి వారికి వచ్చే మెటీరియల్‌ను ఇప్పిస్తున్నాం. – సురేష్, డిస్కం ఏఈ, ఉప్పునుంతల -
పారదర్శకంగా విద్యుత్ కనెక్షన్ల
ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ హెచ్.వై. దొర కర్నూలు(రాజ్‌విహార్): వ్యవసాయం కోసం రైతులకు మంజూరు చేసే త్రీఫేజ్ కనెక్షన్లలో పారదర్శకత పాటిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (విద్యుత్ పంపిణీ సంస్థ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ హెచ్.వై. దొర స్పష్టం చేశారు. గురువారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్లో కర్నూలు సర్కిల్ ఎస్ఈ, డీఈలు, ఏడీఈలు, ఎస్ఏఓ, ఏఓ, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం హెచ్‌టీ కనెక్షన్ల వినియోగదారులతో సమావేశమయ్యారు. ముందుగా అధికారులతో డివిజన్, సబ్డివిజన్ల వారిగా పురోగతి, వైఫల్యాలను అడిగి తెలుసుకున్నారు. సీపీడీసీఎల్ నుంచి ఎస్‌పీడీసీఎల్‌లోకి కర్నూలును విలీనం చేశాక జరుగుతున్న పనులపై సమీక్షించారు. వ్యవసాయ కనెక్షన్లకు రైతులు దరఖాస్తు సమయంలో చెల్లించి డీడీల తేదీలను సీనియారిటీ ప్రాతిపదికన మంజూరు చేస్తామన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉంటేనే సమస్యలు తెలుస్తాయని, వీటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతినెల స్పాట్ బిల్లింగ్‌ను 15లోగా పూర్తి చేయాలని, నెలవారి విద్యుత్ బిల్లులను వంద శాతం వసూలే లక్ష్యంగా పని చేయాలన్నారు. వీటితోపాటు సంస్థకు భారంగా మారిన పాతబకాయిలు, యూడీసీ (అండర్ డిస్కనెక్షన్)పై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, నిర్వహణపై నిబంధనలు పాటించి అందుకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. వృథా విద్యుత్‌ను అరికట్టి, పొదుపు సూత్రాలను పాటించాలన్నారు. ఐఆర్ (ఇన్ఫ్రా రెడ్) సపోర్టెడ్ టెక్నాలజీ ఉన్న బిల్లింగ్ మిషన్ల ద్వారా బిల్లులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కొత్త కనెక్షన్లు మంజూరు చేయడంలో జాప్యం చేయరాదని, మంజూరైన పనులు వేగవంతంగా పూర్తి చేసి వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు కోతలు లేకుండా 7గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఏర్పడిన ట్రాన్స్ఫార్మర్ల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, రాష్ట్ర విభజన తరువాత కర్నూలుతోపాటు అనంతపురం జిల్లాలను ఎస్పీడీసీఎల్లో కలపడం కారణంగా కొన్ని ఇబ్బందుల్లో ఈ సమస్య నెకొందన్నారు. ముఖ్య పట్టణాల్లో ఓల్టేజీ సమస్యను నివారించేందుకు గతంలో మంజూరైన ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులు ఈనెలాఖరులోగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందులోభాగంగా ఆదోనిలో ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయని, జిల్లాకేంద్రంలో జిల్లాపరిషత్, ఉస్మానియా కళాశాల, నంద్యాలలోని పద్మావతి నగర్లో నిర్మించే సబ్స్టేషన్ల పనులు నెలాఖరులోగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ పరిధిలోని 8 జిల్లాలకు (సర్కిళ్లలో) వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.13,400కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్ పోస్టుల భర్తీని ప్రభుత్వ నిబంధనల మేరకు చేపడతామన్నారు. సమావేశంలో పర్చేర్ అండ్ మెటీరియల్ మెయింటెనెన్స్ డెరైక్టరు పి.పుల్లారెడ్డి, ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్ డెరైక్టర్లు రాధాకృష్ణ, రామ్‌సింగ్, సీఈ పీరయ్య, ఎస్ఈ బసయ్య, కర్నూలు, ఆదోని, నంద్యాల, డోన్ ఆపరేషన్స్ డీఈలు ఉమాపతి, నరేంద్రకుమార్, తిరుపతిరావు, ప్రభాకర్, టెక్నికల్, ఎంఅండ్‌పీ, కన్స్ట్రక్షన్, డీపీఈ, ట్రాన్స్ఫార్మర్స్ డీఈలు నాగప్ప, నారాయణ నాయక్, ప్రదీప్‌కుమార్, రవీంద్ర, చెంచన్న, ఎస్ఏఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.