ఏపీ ఎస్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ హెచ్.వై. దొర
కర్నూలు(రాజ్‌విహార్): వ్యవసాయం కోసం రైతులకు మంజూరు చేసే త్రీఫేజ్ కనెక్షన్లలో పారదర్శకత పాటిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (విద్యుత్ పంపిణీ సంస్థ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ హెచ్.వై. దొర స్పష్టం చేశారు. గురువారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్‌లో కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ, డీఈలు, ఏడీఈలు, ఎస్‌ఏఓ, ఏఓ, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం హెచ్‌టీ కనెక్షన్ల వినియోగదారులతో సమావేశమయ్యారు. ముందుగా అధికారులతో డివిజన్, సబ్‌డివిజన్ల వారిగా పురోగతి, వైఫల్యాలను అడిగి తెలుసుకున్నారు. సీపీడీసీఎల్ నుంచి ఎస్‌పీడీసీఎల్‌లోకి కర్నూలును విలీనం చేశాక జరుగుతున్న పనులపై సమీక్షించారు. వ్యవసాయ కనెక్షన్లకు రైతులు దరఖాస్తు సమయంలో చెల్లించి డీడీల తేదీలను సీనియారిటీ ప్రాతిపదికన మంజూరు చేస్తామన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉంటేనే సమస్యలు తెలుస్తాయని, వీటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతినెల స్పాట్ బిల్లింగ్‌ను 15లోగా పూర్తి చేయాలని, నెలవారి విద్యుత్ బిల్లులను వంద శాతం వసూలే లక్ష్యంగా పని చేయాలన్నారు. వీటితోపాటు సంస్థకు భారంగా మారిన పాతబకాయిలు, యూడీసీ (అండర్ డిస్‌కనెక్షన్)పై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, నిర్వహణపై నిబంధనలు పాటించి అందుకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. వృథా విద్యుత్‌ను అరికట్టి, పొదుపు సూత్రాలను పాటించాలన్నారు.
ఐఆర్ (ఇన్‌ఫ్రా రెడ్) సపోర్టెడ్ టెక్నాలజీ ఉన్న బిల్లింగ్ మిషన్ల ద్వారా బిల్లులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కొత్త కనెక్షన్లు మంజూరు చేయడంలో జాప్యం చేయరాదని, మంజూరైన పనులు వేగవంతంగా పూర్తి చేసి వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు కోతలు లేకుండా 7గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఏర్పడిన ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, రాష్ట్ర విభజన తరువాత కర్నూలుతోపాటు అనంతపురం జిల్లాలను ఎస్‌పీడీసీఎల్‌లో కలపడం కారణంగా కొన్ని ఇబ్బందుల్లో ఈ సమస్య నెకొందన్నారు.
ముఖ్య పట్టణాల్లో ఓల్టేజీ సమస్యను నివారించేందుకు గతంలో మంజూరైన ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు ఈనెలాఖరులోగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందులోభాగంగా ఆదోనిలో ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయని, జిల్లాకేంద్రంలో జిల్లాపరిషత్, ఉస్మానియా కళాశాల, నంద్యాలలోని పద్మావతి నగర్‌లో నిర్మించే సబ్‌స్టేషన్ల పనులు నెలాఖరులోగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తమ పరిధిలోని 8 జిల్లాలకు (సర్కిళ్లలో) వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.13,400కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్ పోస్టుల భర్తీని ప్రభుత్వ నిబంధనల మేరకు చేపడతామన్నారు. సమావేశంలో పర్చేర్ అండ్ మెటీరియల్ మెయింటెనెన్స్ డెరైక్టరు పి.పుల్లారెడ్డి, ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్ డెరైక్టర్లు రాధాకృష్ణ, రామ్‌సింగ్, సీఈ పీరయ్య, ఎస్‌ఈ బసయ్య, కర్నూలు, ఆదోని, నంద్యాల, డోన్ ఆపరేషన్స్ డీఈలు ఉమాపతి, నరేంద్రకుమార్, తిరుపతిరావు, ప్రభాకర్, టెక్నికల్, ఎంఅండ్‌పీ, కన్‌స్ట్రక్షన్, డీపీఈ, ట్రాన్స్‌ఫార్మర్స్ డీఈలు నాగప్ప, నారాయణ నాయక్, ప్రదీప్‌కుమార్, రవీంద్ర, చెంచన్న, ఎస్‌ఏఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
పారదర్శకంగా విద్యుత్ కనెక్షన్ల
Published Fri, Sep 5 2014 1:35 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement