TRANSCO department
-
‘ట్రాన్స్‌కో’నిర్లక్ష్యానికి రైతు బలి
తిరుమలాయపాలెం: విద్యుత్ (టాన్స్‌కో)శాఖ అధికా రుల నిర్లక్ష్యం ఓ రైతును బలితీసుకుంది. కూలీలు వచ్చేలోపే వరిపొలం కరిగట్టు చేయాలనే తపనతో బురుదగొర్రు ఎత్తుకెళ్తున్న ఆ రైతును వేలాడుతున్న విద్యుత్ తీగలు మృత్యువు రూపంలో కబళించాయి. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని బచ్చోడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బచ్చోడు గ్రామానికి చెందిన అంగిరేకుల ఉప్పయ్య(41) తనకున్న ఎకరం పొలంలో నాటు వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇనుప గొర్రు(బురదగొర్రు)ని ఎడ్లతో తీసుకుపోయే వీలులేకపోవడంతో ఆదివారం ఉదయం భుజంపై ఎత్తుకుని పొలం గట్టు మీదుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతా నికి గురయ్యాడు. పొలంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన చుట్టు పక్కల రైతులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. అప్పటికే ఉప్పయ్య ప్రాణాలు కోల్పోయి విగత జీవిగా పడి ఉన్నాడు. పొలం దమ్ము చేయాలనే ఆత్రంలో చేతికి అందే ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. దీంతో మృత్యువాతపడ్డాడు. రైతుల పంట చేలల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రాణాలు హరిస్తున్నాయి. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఉప్పయ్య మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడి భార్య సుభద్ర, కుమారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంతో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఉప్పయ్య మృతిచెందాడని ఆరోపిస్తూ గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు బచ్చోడు విద్యుత్‌సబ్‌స్టేషన్ ఎదుట ఆందో ళన నిర్వహించారు. మృతుడి కుటుంబానికి ఉద్యోగ, రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యుత్‌శాఖ ఏడీ కోటేశ్వరరావు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, ఎన్డీ మండల కార్యదర్శులు నర్సయ్య, రాజేంద్రప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు జక్కుల యాదగిరి, ఉప్పయ్య, కొండల్, రమణ, కాంగ్రెస్ నాయకులు సకినాల యాదగిరి, ఎన్డీ నాయకులు గొర్రెపాటి రమేష్, తిమ్మిడి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
మరో 2 వేల విద్యుత్ కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ శాఖ త్వరలో మరో 2 వేల పోస్టులను భర్తీ చేయనుందని తెలంగాణ ట్రాన్స్‌కో తెలిపింది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలు కలిపి మొత్తం 12,171 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేశాయని, మరో 22,637 మంది విద్యుత్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేసుకున్నాయని పేర్కొంది. కొత్త నియామకాలతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రూపంలో గత ఐదేళ్లలో మొత్తం 34,808 మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అత్యధిక మందికి ఉద్యోగాలిచ్చిన విభాగంగా విద్యుత్ శాఖ రికార్డు సృష్టించిందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే విద్యుత్ సంస్థల ఆదాయంలో 9 శాతం ఉద్యోగుల వేతనాలకు వెచ్చిస్తున్నామని, వేతనాల చెల్లింపులో తెలంగాణ విద్యుత్ శాఖ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొంది. మిగతా రాష్ట్రాల్లో 5 నుంచి 7 శాతం వరకే జీతభత్యాలకు చెల్లిస్తున్నారని తెలిపింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 1,17,177 మందికి ఉద్యోగావకాశం లభించిందని ట్రాన్స్‌కో తెలిపింది. విద్యుత్ శాఖలోనే ఎక్కువ నియామకాలు జరగడం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ ఫలితమే. ప్రైవేటులో కాకుండా జెన్ కో ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరగాలని ఆయన నిర్ణయించారు. దీంతో ఉత్పత్తి ప్లాంట్లలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాం.ఉద్యోగ భద్రత లేకుండా, ఏజెన్సీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన 22,637 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సంస్థలో విలీనం చేసుకోవాలనే మానవతా నిర్ణయం కూడా సీఎందే. వారి ఆర్టిజన్ల సర్వీసు నిబంధనల (స్టాండింగ్ ఆర్డర్ల)ను కూడా హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందిస్తున్నాం. పెద్ద ఎత్తున నియామకాలు జరపడమే కాకుండా, కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. – ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు -
కర్రలే కరెంట్ స్తంభాలు!
సాక్షి, చిన్నంబావి (వనపర్తి): మండలంలోని పలు గ్రామాల్లో కరెంట్ స్తంభాలు లేవు. దీంతో కర్రలనే కరెంట్ స్తంభాలుగా ఉపయోగిస్తూ వ్యవసాయ, డొమెస్టిక్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాలికి, వానకు కర్రలు కూలిపోతే కరెంట్ సరఫరా ఆగిపోతోంది. పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి.. పెద్దదగడ, వెలగొండ సబ్‌ష్టేషన్ పరిధిలోని గూడెం, బెక్కెం, అమ్మాయిపల్లి, దగడపల్లి, మియాపూర్ తదితర గ్రామాల్లో ఎప్పుడ ఏ ప్రమాదం పొంచి ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నమారు, గూడెం, పెద్దమారు గ్రామల్లో స్తంభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ రోజుల్లో కరెంట్ క్షణం పోతేనే నానా హైరానా పడతాం. అలాంటిది ఈ ప్రాంతాల్లోని ప్రజలకు కరెంట్ సమస్య ప్రధానంగా మారింది. వ్యవసాయ పంటపొలాల్లో మరీ పరిస్థితి దారుణంగా ఉంది. వ్యవసాయపు మోటార్ల దగ్గరికి కనెక్షన్ రావాలంటే దాదాపుగా కి.మీ పైనే కర్రలపై విద్యుత్ కనెక్షన్ రైతులు తీసుకుంటున్నారు. ఇక్కడ సరిపడా స్తంభాలు లేక సర్వీస్ వైర్లు అన్ని కర్రలు, ఇనుప స్తంభాలపైనే ఆసరాగా చేసుకుని ప్రజలు, రైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా ప్రజ లు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. వాటికింది నుం చే రైతులు, ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాన్స్పార్మర్ల కొరత.. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సరిపడ స్తంభాలు, ట్రాన్స్పార్మర్లు లేవు. గతంలో ఇక్కడ విద్యుత్ చోరీలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ స్తంభాలు,ట్రాన్స్పార్మర్లు లేకపోవడంతో స్తానిక ప్రజలు నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ స్తంభాలు ఇవ్వాలి.. ఈ కర్రలపై కరెంట్ సర్వీస్ వైర్లు పెట్టుకుని స్తంభాల నుంచి వ్యవసాయ పంటపొల్లాలోకి కరెంట్ తీసుకున్నాం. కరెంట్ బిల్లులు రెగ్యులర్‌గా కడుతున్నాం. ఎప్పుడు కూడా మాకు స్తంభాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం లేదు. అందుకే మేమే అందరం కలసి కర్రలపైనే కరెంట్ వైర్లు ఏర్పాటు చేసుకున్నాం. స్తంభాలు ఇవ్వాలని కోరుతున్నాం. – బాలస్వామి, చిన్నంబావి పట్టించుకోవడం లేదు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు, నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా సమస్యకు పరిష్కారం చూపడం లేదు. అధికారులు స్పందించాలి. – రాజు, బెక్కెం -
విద్యుత్ శాఖకు కోర్టు షాక్
ధర్మారం: బాధితుని కుటుంబానికి పరిహారం అందించటంలో విఫలమైన విద్యుత్ శాఖ అధికారులకు పెద్దపల్లి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. విద్యుత్ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశించింది. వివరాలివీ.. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన రవి అనే యువకుడు1999లో విద్యుత్‌షాక్‌తో చనిపోయాడు. ఈ మరణానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ అతని కుటుంబసభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు పరిహారంగా రూ.1.50 లక్షలు చెల్లించాలని 2001లో ఆదేశించింది. అయితే, అధికారులు చెల్లించలేకపోయారు. దీంతో కోర్టు మరోసారి గడువు పొడిగించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనిపై మృతుని కుటుంబసభ్యులు న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన న్యాయస్థానం విద్యుత్ శాఖ కార్యాలయాన్ని జప్తు చేసి, నష్ట పరిహారం అందజేయాలని అధికారులను బుధవారం ఆదేశించింది. ఈ మేరకు కోర్టు సిబ్బంది ధర్మారం ఎన్పీడీసీఎల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, తాము పరిహారం వెంటనే చెల్లిస్తామని ఇన్చార్జి ఏడీఏ సంపత్ చెప్పటంతో కోర్టు సిబ్బంది వెనుదిరిగారు. -
అక్రమార్కులకు షాక్!
సాక్షి, నిజామాబాద్: ఎన్పీడీసీఎల్లో అక్రమార్కులపై డిస్కం యాజమాన్యం ఉక్కుపాదం మోపుతోం ది. చేయి తడపనిదే పనిచేయని అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలో ఓ ఏడీఈతో సహా నలుగురు ఏఈలపై ఏకంగా సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా మరో డివిజనల్ ఇంజినీర్‌ను కూడా సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలు ఆ శాఖ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఏవైనా అక్రమాలు జరిగితే విచారణ పేరుతో జాప్యం చేయడంతో పాటు, కింది స్థాయి సిబ్బందిని బలిచేసి, ఉన్నతాధికారులు తప్పించుకోవడం పరిపాటిగా మారుతోంది. కానీ ట్రాన్స్‌కో విషయంలోకి మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఏకంగా ఇంజనీరింగ్ అధికారులపైనే వేటు పడుతుండటంతో ఆ శాఖ అధికారుల్లో కలకలం రేగుతోంది. ఎవరైనా అధికారిపై అవినీతి ఆరోపణలు వస్తే చాలు.. యాజమాన్యం వెంటనే విచారణ చేపడుతోంది. ఏడాదిలో ఇలా సస్పెన్షన్ వేటు పడిన తీరును పరిశీలిస్తే... నాగిరెడ్డిపేట్లో పనిచేసిన ఏఈ రైతులకు ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసేందుకు పెద్ద మొత్తంలో వసూళ్ల దందాకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఒక్కో రైతు వద్ద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారని ఫిర్యాదులు వెళ్లాయి. బొల్లారం, ఆత్మాకూర్ తదితర గ్రామాల రైతులు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన యాజమాన్యం ఓ డివిజన్ఇంజనీర్ స్థాయి అధికారితో విచారణ జరిపింది. వసూళ్ల దందా వాస్తవమే అని తేలడంతో ఆ ఏఈపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో సదరు ఏఈ తాను వసూలు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేసి ఫిర్యాదులు వాపస్ తీసుకోవాలని రైతులను వేడుకుంటున్నారు. డిచ్పల్లి మండలం బీబీపూర్‌తండా శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ పెట్రోల్‌బంక్‌కు హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై స్థానిక ఏఈతో పాటు, రూరల్ ఏడీఈపై కూడా ముందుగా సస్పెన్షన్ వేటు పడింది. ఈ అక్రమాలపై విచారణ చేపట్టిన డిస్కం ఉన్నతాధికారులు ఇందులో ఏడీఈ పాత్ర లేదని తేల్చారు. ఆ ఏఈని మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతమైన ఊట్నూర్‌కు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మంజూరు విషయంలో మరో ఇద్దరు ఏఈలపై కూడా చర్యలు చేపట్టింది యాజమాన్యం. భీమ్‌గల్ రూరల్ ఏఈగా పనిచేసిన ఓ అధికారి మండలంలోని కారేపల్లికి చెందిన గిరిజన రైతుల వద్ద వసూళ్ల దందాకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా జుక్కల్ ఏఈగా పనిచేసిన మరో అధికారి కూడా సుమారు 20 మంది రైతుల వద్ద నుంచి రూ.రెండు లక్షలకు పైగా జేబులు నింపుకున్నాడు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయకపోవడంతో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాలపై విచారణ చేపట్టిన అధికారులు ఈ ఇద్దరు ఏఈలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ నగరంతో పాటు, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీల్లో ఆర్‌ఏపీడీఆర్‌పీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించింది. విద్యుత్ సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జరుగుతున్న పనులపై సరైన పర్యవేక్షణ చేపట్టకపోవడంతో కన్స్ట్రక్షన్ విభాగంలో ఏకంగా డివిజనల్ ఇంజనీర్‌పైనే సరెండర్వేటు పడింది. ఆయన్ను ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి జిల్లా అధికారులు సరెండర్ చేశారు.