సాక్షి, నిజామాబాద్: ఎన్పీడీసీఎల్‌లో అక్రమార్కులపై డిస్కం యాజమాన్యం ఉక్కుపాదం మోపుతోం ది. చేయి తడపనిదే పనిచేయని అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలో ఓ ఏడీఈతో సహా నలుగురు ఏఈలపై ఏకంగా సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా మరో డివిజనల్ ఇంజినీర్‌ను కూడా సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలు ఆ శాఖ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఏవైనా అక్రమాలు జరిగితే విచారణ పేరుతో జాప్యం చేయడంతో పాటు, కింది స్థాయి సిబ్బందిని బలిచేసి, ఉన్నతాధికారులు తప్పించుకోవడం పరిపాటిగా మారుతోంది. కానీ ట్రాన్స్‌కో విషయంలోకి మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఏకంగా ఇంజనీరింగ్ అధికారులపైనే వేటు పడుతుండటంతో ఆ శాఖ అధికారుల్లో కలకలం రేగుతోంది. ఎవరైనా అధికారిపై అవినీతి ఆరోపణలు వస్తే చాలు.. యాజమాన్యం వెంటనే విచారణ చేపడుతోంది. ఏడాదిలో ఇలా సస్పెన్షన్ వేటు పడిన తీరును పరిశీలిస్తే...
నాగిరెడ్డిపేట్‌లో పనిచేసిన ఏఈ రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేసేందుకు పెద్ద మొత్తంలో వసూళ్ల దందాకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఒక్కో రైతు వద్ద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారని ఫిర్యాదులు వెళ్లాయి. బొల్లారం, ఆత్మాకూర్ తదితర గ్రామాల రైతులు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై వెంటనే స్పందించిన యాజమాన్యం ఓ డివిజన్‌ఇంజనీర్ స్థాయి అధికారితో విచారణ జరిపింది. వసూళ్ల దందా వాస్తవమే అని తేలడంతో ఆ ఏఈపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో సదరు ఏఈ తాను వసూలు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేసి ఫిర్యాదులు వాపస్ తీసుకోవాలని రైతులను వేడుకుంటున్నారు.
డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌తండా శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ పెట్రోల్‌బంక్‌కు హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై స్థానిక ఏఈతో పాటు, రూరల్ ఏడీఈపై కూడా ముందుగా సస్పెన్షన్ వేటు పడింది. ఈ అక్రమాలపై విచారణ చేపట్టిన డిస్కం ఉన్నతాధికారులు ఇందులో ఏడీఈ పాత్ర లేదని తేల్చారు. ఆ ఏఈని మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతమైన ఊట్నూర్‌కు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు విషయంలో మరో ఇద్దరు ఏఈలపై కూడా చర్యలు చేపట్టింది యాజమాన్యం. భీమ్‌గల్ రూరల్ ఏఈగా పనిచేసిన ఓ అధికారి మండలంలోని కారేపల్లికి చెందిన గిరిజన రైతుల వద్ద వసూళ్ల దందాకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా జుక్కల్ ఏఈగా పనిచేసిన మరో అధికారి కూడా సుమారు 20 మంది రైతుల వద్ద నుంచి రూ.రెండు లక్షలకు పైగా జేబులు నింపుకున్నాడు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయకపోవడంతో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాలపై విచారణ చేపట్టిన అధికారులు ఈ ఇద్దరు ఏఈలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నిజామాబాద్ నగరంతో పాటు, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీల్లో ఆర్‌ఏపీడీఆర్‌పీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించింది. విద్యుత్ సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జరుగుతున్న పనులపై సరైన పర్యవేక్షణ చేపట్టకపోవడంతో కన్‌స్ట్రక్షన్ విభాగంలో ఏకంగా డివిజనల్ ఇంజనీర్‌పైనే సరెండర్‌వేటు పడింది. ఆయన్ను ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి జిల్లా అధికారులు సరెండర్ చేశారు.
అక్రమార్కులకు షాక్!
Published Sun, Nov 17 2013 4:56 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement