రైతు ఉప్పయ్య మృతదేహం
తిరుమలాయపాలెం: విద్యుత్ (టాన్స్‌కో)శాఖ అధికా రుల నిర్లక్ష్యం ఓ రైతును బలితీసుకుంది. కూలీలు వచ్చేలోపే వరిపొలం కరిగట్టు చేయాలనే తపనతో బురుదగొర్రు ఎత్తుకెళ్తున్న ఆ రైతును వేలాడుతున్న విద్యుత్ తీగలు మృత్యువు రూపంలో కబళించాయి. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని బచ్చోడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బచ్చోడు గ్రామానికి చెందిన అంగిరేకుల ఉప్పయ్య(41) తనకున్న ఎకరం పొలంలో నాటు వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇనుప గొర్రు(బురదగొర్రు)ని ఎడ్లతో తీసుకుపోయే వీలులేకపోవడంతో ఆదివారం ఉదయం భుజంపై ఎత్తుకుని పొలం గట్టు మీదుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతా నికి గురయ్యాడు.
పొలంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన చుట్టు పక్కల రైతులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. అప్పటికే ఉప్పయ్య ప్రాణాలు కోల్పోయి విగత జీవిగా పడి ఉన్నాడు. పొలం దమ్ము చేయాలనే ఆత్రంలో చేతికి అందే ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. దీంతో మృత్యువాతపడ్డాడు. రైతుల పంట చేలల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రాణాలు హరిస్తున్నాయి. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఉప్పయ్య మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడి భార్య సుభద్ర, కుమారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహంతో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఉప్పయ్య మృతిచెందాడని ఆరోపిస్తూ గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు బచ్చోడు విద్యుత్‌సబ్‌స్టేషన్ ఎదుట ఆందో ళన నిర్వహించారు. మృతుడి కుటుంబానికి ఉద్యోగ, రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యుత్‌శాఖ ఏడీ కోటేశ్వరరావు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, ఎన్‌డీ మండల కార్యదర్శులు నర్సయ్య, రాజేంద్రప్రసాద్, టీఆర్‌ఎస్ నాయకులు జక్కుల యాదగిరి, ఉప్పయ్య, కొండల్, రమణ, కాంగ్రెస్ నాయకులు సకినాల యాదగిరి, ఎన్‌డీ నాయకులు గొర్రెపాటి రమేష్, తిమ్మిడి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment