former dead
-
ఇది పోలీసుల హత్యే!
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలోని కర్నాల్ జిల్లా రాయ్‌పూర్ జట్టన్ గ్రామానికి చెందిన రైతు సుశీల్ కాజల్ మృతికి పోలీసులే కారణమని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల లాఠీఛార్జ్ వల్లనే రైతు సుశీల్ మరణించాడని ఆయన భార్య సుదేష్ దేవీ, తల్లి విమర్శించారు. ఆయన పోలీసులు చెబుతున్న విధంగా గుండెపోటుతో మరణించలేదని వారు వాదిస్తున్నారు. పోలీసులు, హరియాణా ప్రభుత్వం కావాలనే సుశీల్ గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించారని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాఠీచార్జ్ సందర్భంగా తగిలిన తీవ్రమైన గాయాలు, నొప్పులతో ఇంటికి చేరుకున్న సుశీల్, తల్లి తీసుకొచ్చిన పసుపు కలిపిన పాలను తాగి... తనకు ఏమీ తినాలని అనిపించట్లేదని చెప్పి పెయిన్ కిల్లర్ మాత్రలను వేసుకొని పడుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే రాత్రి నొప్పులతో బాధపడుతూ ప్రాణాలు విడిచారని ఆయన భార్య, తల్లి వివరించారు. గాయాలకు, మరణానికి సంబంధం లేదు: కర్నాల్ ఎస్పీ పునియా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 28న కర్నాల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలోలో సుశీల్ కాజల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆ ఘటనలో గాయపడ్డ రైతుల్లో సుశీల్ కాజల్ ఒకరు. అదే రోజు రాత్రి లాఠీచార్జ్‌లో తగిలిన దెబ్బలతో ఇంటికి వచ్చిన సుశీల్ తెల్లారేసరికి విగతజీవిగా మిగిలిపోయాడు. కాగా కర్నాల్ ఎస్పీ గంగారామ్ పునియా మాత్రం పోలీసులతో జరిగిన ఘర్షణలో తగిలిన గాయాలకు, అతని మరణానికి సంబంధం లేదని ప్రకటించారు. కాగా సుశీల్ స్నేహితులు, కుటుంబం, రైతు సంఘాల నాయకులు మాత్రం ఇది పోలీసుల హత్యేనని అంటున్నారు. రైతు ఉద్యమంలో చురుగ్గా: రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రైతు సుశీల్ కాజల్‌తో పాటు ఆయన తల్లి, భార్య సుదేష్ దేవి, కుమారుడు సాహిల్, కుమార్తె అన్నూ నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే రైతు ఉద్యమంలో పాల్గొన్న సమయంలో సుశీల్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతిలో ఉంది. కాగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కాని, పోలీసులు కాని తమ ఇంటికి రాలేదని, కానీ సుశీల్ మరణాన్ని గుండెపోటులా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సుశీల్‌కు 1.5 ఎకరాల భూమితో పాటు ఉన్న కొద్దిపాటి పాడి వారి జీవనాధారం అని, కుటుంబం వాటిపైనే ఆధారపడి జీవిస్తోందని గ్రామస్తులు తెలిపారు. రూ.లక్ష సాయం అందించిన ఆలిండియా కిసాన్ సంఘం రాయ్‌పూర్ జట్టన్ గ్రామంలో చనిపోయిన రైతు సుశీల్ కాజల్æ కుటుంబాన్ని ఎఐకెఎస్ ప్రతినిధి బృందం మంగళవారం పరామర్శించి రూ.లక్ష సాయం అందించింది. చెక్కును సుశీల్ భార్య సుధేష్ దేవికి ఎఐకెఎస్ కోశాధికారి పి.కృష్ణప్రసాద్ తదితరులు అందించారు. వీలైనంత త్వరగా వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కర్నాల్‌లోని బస్తారా టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. -
‘కేసీఆర్ నియోజకవర్గంలో ఇంత దారుణమా’
సాక్షి, హైదరాబాద్: రైతు బ్యాగరి నర్సింహులు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. నర్సింహులు మరణానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ‘దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని మోసం చేసి ఇప్పుడు ఉన్న భూమిని దౌర్జన్యంగా గుంజుకుంటున్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ఇంత దారుణమా. దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. దళిత ముఖ్యమంత్రి చేస్తామని మోసంచేసి దళితులను బలి తీసుకుంటున్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలు ఏకం కావాలి. టీఆర్ఎస్ పాలన అంతమయ్యే వరకు దళితులకు న్యాయం జరగదు. నర్సింహులు మరణానికి కారణమైన అందరిపైన హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన ఎస్సీ సామాజికవార్గానికి చెందిన బ్యాగరి నర్సింహులు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవంటం అత్యంత బాధాకరమన్నారు. నర్సింహులకు చెందిన 13 గుంటల భూమిని బలవంతంగా రైతు వేదిక నిర్మాణానికి తీసుకుంటున్నారనే ఆవేదనతో బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు అతన్ని గజ్వెల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి అనంతరం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం 3 గంటలకు నర్సింహులు చికిత్స పొందుతూ మృతిచెందాడు.బ్యాగరి నర్సింహులు మృతికి బాధ్యులైన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఉత్తమ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు చేయిస్తూ వారి మరణానికి కారణమవుతుందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇటీవలే భూపాలపల్లి జిల్లా మల్లారంలో దళిత యువకుడు రాజబాబును హత్య చేశారని ఆరోపించింది. అంతకు ముందు మంథని దగ్గర రామగిరి గ్రామానికి చెందిన శీలం రంగయ్య అనే దళిత యువకున్ని లాకప్ డెత్ చేశారని మండిపడింది. గతంలో నెరేళ్లలో దళిత, బీసీ యువకులు ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పోలీసులతో దాడి చేపించారని, ఇసుక లారీల వల్ల ప్రజలు ప్రమాదాల్లో మరణిస్తున్న ప్రభుత్వం ఇసుక మాఫియాకే మద్దతు ఇచ్చిందని దుయ్యబట్టింది. ఇంత దారుణంగా దేశంలో ఎక్కడ లేదుని, ప్రజలంతా ఏకమై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. -
‘ట్రాన్స్‌కో’నిర్లక్ష్యానికి రైతు బలి
తిరుమలాయపాలెం: విద్యుత్ (టాన్స్‌కో)శాఖ అధికా రుల నిర్లక్ష్యం ఓ రైతును బలితీసుకుంది. కూలీలు వచ్చేలోపే వరిపొలం కరిగట్టు చేయాలనే తపనతో బురుదగొర్రు ఎత్తుకెళ్తున్న ఆ రైతును వేలాడుతున్న విద్యుత్ తీగలు మృత్యువు రూపంలో కబళించాయి. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని బచ్చోడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బచ్చోడు గ్రామానికి చెందిన అంగిరేకుల ఉప్పయ్య(41) తనకున్న ఎకరం పొలంలో నాటు వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇనుప గొర్రు(బురదగొర్రు)ని ఎడ్లతో తీసుకుపోయే వీలులేకపోవడంతో ఆదివారం ఉదయం భుజంపై ఎత్తుకుని పొలం గట్టు మీదుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతా నికి గురయ్యాడు. పొలంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన చుట్టు పక్కల రైతులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. అప్పటికే ఉప్పయ్య ప్రాణాలు కోల్పోయి విగత జీవిగా పడి ఉన్నాడు. పొలం దమ్ము చేయాలనే ఆత్రంలో చేతికి అందే ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. దీంతో మృత్యువాతపడ్డాడు. రైతుల పంట చేలల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రాణాలు హరిస్తున్నాయి. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఉప్పయ్య మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడి భార్య సుభద్ర, కుమారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంతో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఉప్పయ్య మృతిచెందాడని ఆరోపిస్తూ గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు బచ్చోడు విద్యుత్‌సబ్‌స్టేషన్ ఎదుట ఆందో ళన నిర్వహించారు. మృతుడి కుటుంబానికి ఉద్యోగ, రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యుత్‌శాఖ ఏడీ కోటేశ్వరరావు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, ఎన్డీ మండల కార్యదర్శులు నర్సయ్య, రాజేంద్రప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు జక్కుల యాదగిరి, ఉప్పయ్య, కొండల్, రమణ, కాంగ్రెస్ నాయకులు సకినాల యాదగిరి, ఎన్డీ నాయకులు గొర్రెపాటి రమేష్, తిమ్మిడి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
కొమ్ములతో పొడిచి.. గుండెలపై తొక్కి
సాక్షి, మునుగోడు(నల్గొండ) : పాడిఆవు.. తన ఇంటికి ఆసరా అవుతుందనుకున్నాడు. పాలతోపాటు వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని భావించాడు. కానీ ఆ ఆవే..అతని పాలిట మృత్యువైంది. యజమానిని పొడిచి గుండెలపై కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన.. మునుగోడు మండలం కోతులారం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పందుల పాపయ్య (56) తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో పది ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయ పనుల కోసం ఒక ఎద్దుతో పాటు ఒక ఆవును ఏడాది క్రితం కొనుగోలు చేశాడు. వాటిని వ్యవసాయ పనుల కోసం వినియోగించుకొని బావి వద్దనే కొట్టంలో కట్టేసేవాడు. ఆవు పాలు కూడా ఇచ్చేది. పాపయ్య రాత్రి వ్యవసాయ బావి వద్దనే పడుకుని ఉదయాన్నే ఆవుపాలు పిండుకుని ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అక్కడికి వెళ్లిన అతను మంగళవారం ఉదయం ఇంటికి రాలేదు. దీంతో అతని కుమారుడు నరేష్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా, తండ్రి తీవ్రగాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. అక్కడే ఉన్న ఆవు నరేష్ వెంట పడడంతో అతను తప్పించుకుని గ్రామానికి చేరుకున్నాడు. మరికొంతమందిని వెంటబెట్టుకుని తిరిగి బావి వద్దకు వెళ్లి ఆవును పట్టుకుని కట్టేశారు. పాపయ్యను చూడగా అప్పటికే మృతిచెందాడు. ఆవుకి నీళ్లు తాపే సమయంలో ఆయనని పొడిచి కింద పడేసి గుండెపై కాళ్లతో తొక్కడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆవు అప్పుడప్పుడు పొడిచేందుకు వచ్చేదని, ఇలా చంపుతదని అనుకోలేదని రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా చేశారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కె. రజినీకర్ తెలిపారు. -
40 రోజుల తర్వాత స్వగ్రామానికి రైతు మృతదేహం
మెదక్ రూరల్: బతుకుదెరువు కోసం విదేశానికి వెళ్లిన ఓ రైతు అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్‌కి చెందిన జాల ప్రభాకర్ (32) సాగు కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉపాధి కోసం గతేడాది డిసెంబర్ 31న మలేసియాకు వెళ్లాడు. అక్కడే కూలి పనులు చేస్తున్న ప్రభాకర్ ఈ ఏడాది మార్చి 27న గుండెపోటుతో చనిపోయాడు. ప్రభాకర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని అతని కుటుంబసభ్యులు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో ఎట్టకేలకు 40 రోజుల తర్వాత స్వగ్రామమైన శమ్నాపూర్‌కు మంగళవారం ప్రభాకర్ మృతదేహం చేరుకుంది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పేదల భూములు కొల్లగొడుతున్న పరిటాల వర్గీయులు
సాక్షి, అనంతపురం : గతంలో పేద రైతులకు పంపణీ చేసిన భూములను పరిటాల వర్గీయులు ఆక్రమిస్తున్నారని, అధికారులపై పెత్తనం చెలాయిస్తూ రైతుల భూములను తమ పేరిట మార్చుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల నిర్వాకంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు కేశవనాయక్ కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేశవనాయక్ ఆత్మహత్యకు మంత్రి పరిటాల సునీత బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారులు ఆత్మకూరు మండలం వేపచర్ల రైతు కేశవనాయక్‌కు చెందిన భూమి పట్టాను రద్దు చేసి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు కేటాయించడంతో మనస్తాపానికి గురైన కేశవనాయక్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
విద్యుత్ తీగలు తగిలి కౌలురైతు మృతి
నలుగురిపై కేసు నమోదు లింగంపర్తి (ఏలేశ్వరం) : వన్యప్రాణుల కోసం పొలాల్లో అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మండల పరిధిలోని లింగంపర్తి శివారు నారాపట్నంలో సోమవారం రాత్రి కౌలు రైతు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... లింగంపర్తి గ్రామానికి చెందిన అవివాహితుడు వరుపుల చింతయ్య (28) తాను కౌలుకు తీసుకున్న పొలంలో వరి పంటకు నీరు పెట్టేందుకు సోమవారం పొలానికి వెళ్లాడు. అతడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. మరుసటి రోజు తెలవారుజామున చనిపోయి కనిపించాడు. అతడి శరీరంపై కాలిన గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ జి.సత్యనారాయణ, ఎస్ఐ వై.రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్కాడ్ రప్పించి విచారణ చేపట్టగా సమీపంలోని రైతు అశపు భీమరాజు పొలంలో అతడు మృతి చెందినట్టు గుర్తించారు. కొంతకాలంగా భీమరాజు పొలాన్ని దాడి రాము అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. అతడు విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడి, వాటి మాంసంతో వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో రాముతో పాటు గొర్లె వెంకన్న, ముత్తా దొరబాబు, చెన్నాడ సత్తిబాబు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతుడు చింతయ్య తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కుమారుడు మాట వినడం లేదని రైతు ఆత్మహత్య
రేగొండ: తన కుమారుడు వ్యవసాయ పనికి రావడం లేదని మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొడవటంచలో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బాషబోయిన పోషాలు(55) కొన్నేళ్ల క్రితం గణపురం నుంచి కొడవటంచలోని అత్తవారింటి వద్దకు వచ్చాడు. నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. నిత్యం తానే వ్యవసాయ పనులు చేస్తూ ఇబ్బందులు పడుతున్నానని, తన కుమారుడు ప్రశాంత్‌ను కూడా వ్యవసాయ పనుల్లో సాయపడాలని కోరాడు. ప్రశాంత్ సహకరించకపోవడంతో అతడిని భయపెట్టాలన్న ఉద్దేశంతో బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో పోషాలు పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకోవడంతో చుట్టుపక్కలవారు గమనించి భార్య స్వరూపకు సమాచారమిచ్చారు. అతడిని చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడిSభార్య స్వరూప, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. -
రైతును బలిగొన్న కాలేజీ బస్సు
ధవళేశ్వరం : వ్యవసాయ పనులు చూసుకునేందుకు స్కూటర్‌పై వెళుతున్న రైతును కాలేజీ బస్సు బలిగొన్న ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన నేమాని సూర్యనారాయణమూర్తి(37) వ్యవసాయం చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నాడు. టీచర్ ట్రైనింగ్ పొందుతున్న భార్య, కుమారుడు చదువు కోసం రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో కొంతకాలంగా నివసిస్తున్నాడు. రెండు రోజులకు ఓసారి వాన పల్లి వెళ్లి, వ్యవసాయ పనులు చూసుకుని వస్తున్నాడు. ఇలాఉండగా సోమవారం ఉదయం రాజమహేంద్రవరం నుంచి స్కూటర్‌పై అతడు వానపల్లి బయలుదేరాడు. ధవళేశ్వరం ఎఫ్‌సీఐ గోడౌన్ల సమీపంలో రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు అతడి స్కూటర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సీఐ ఎం.కృపానందం ఆధ్వర్యంలో హెచ్‌సీ జి.మణి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైతును బలిగొన్న కాలేజీ బస్సు
ధవళేశ్వరం : వ్యవసాయ పనులు చూసుకునేందుకు స్కూటర్‌పై వెళుతున్న రైతును కాలేజీ బస్సు బలిగొన్న ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన నేమాని సూర్యనారాయణమూర్తి(37) వ్యవసాయం చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నాడు. టీచర్ ట్రైనింగ్ పొందుతున్న భార్య, కుమారుడు చదువు కోసం రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో కొంతకాలంగా నివసిస్తున్నాడు. రెండు రోజులకు ఓసారి వాన పల్లి వెళ్లి, వ్యవసాయ పనులు చూసుకుని వస్తున్నాడు. ఇలాఉండగా సోమవారం ఉదయం రాజమహేంద్రవరం నుంచి స్కూటర్‌పై అతడు వానపల్లి బయలుదేరాడు. ధవళేశ్వరం ఎఫ్‌సీఐ గోడౌన్ల సమీపంలో రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు అతడి స్కూటర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సీఐ ఎం.కృపానందం ఆధ్వర్యంలో హెచ్‌సీ జి.మణి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 25 ఆర్జేసీ 182 ప్రమాదానికి గురైన స్కూటర్, పక్కనే మృతదేహం