
రైతు ప్రాణం తీసిన ఆవు, మృతి చెందిన పాపయ్య (ఫైల్)
సాక్షి, మునుగోడు(నల్గొండ) : పాడిఆవు.. తన ఇంటికి ఆసరా అవుతుందనుకున్నాడు. పాలతోపాటు వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని భావించాడు. కానీ ఆ ఆవే..అతని పాలిట మృత్యువైంది. యజమానిని పొడిచి గుండెలపై కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన.. మునుగోడు మండలం కోతులారం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పందుల పాపయ్య (56) తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో పది ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయ పనుల కోసం ఒక ఎద్దుతో పాటు ఒక ఆవును ఏడాది క్రితం కొనుగోలు చేశాడు. వాటిని వ్యవసాయ పనుల కోసం వినియోగించుకొని బావి వద్దనే కొట్టంలో కట్టేసేవాడు. ఆవు పాలు కూడా ఇచ్చేది. పాపయ్య రాత్రి వ్యవసాయ బావి వద్దనే పడుకుని ఉదయాన్నే ఆవుపాలు పిండుకుని ఇంటికి వచ్చేవాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి అక్కడికి వెళ్లిన అతను మంగళవారం ఉదయం ఇంటికి రాలేదు. దీంతో అతని కుమారుడు నరేష్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా, తండ్రి తీవ్రగాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. అక్కడే ఉన్న ఆవు నరేష్ వెంట పడడంతో అతను తప్పించుకుని గ్రామానికి చేరుకున్నాడు. మరికొంతమందిని వెంటబెట్టుకుని తిరిగి బావి వద్దకు వెళ్లి ఆవును పట్టుకుని కట్టేశారు. పాపయ్యను చూడగా అప్పటికే మృతిచెందాడు. ఆవుకి నీళ్లు తాపే సమయంలో ఆయనని పొడిచి కింద పడేసి గుండెపై కాళ్లతో తొక్కడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆవు అప్పుడప్పుడు పొడిచేందుకు వచ్చేదని, ఇలా చంపుతదని అనుకోలేదని రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా చేశారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కె. రజినీకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment