- నలుగురిపై కేసు నమోదు
విద్యుత్ తీగలు తగిలి కౌలురైతు మృతి
Published Tue, Jan 10 2017 11:41 PM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM
లింగంపర్తి (ఏలేశ్వరం) :
వన్యప్రాణుల కోసం పొలాల్లో అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మండల పరిధిలోని లింగంపర్తి శివారు నారాపట్నంలో సోమవారం రాత్రి కౌలు రైతు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... లింగంపర్తి గ్రామానికి చెందిన అవివాహితుడు వరుపుల చింతయ్య (28) తాను కౌలుకు తీసుకున్న పొలంలో వరి పంటకు నీరు పెట్టేందుకు సోమవారం పొలానికి వెళ్లాడు. అతడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. మరుసటి రోజు తెలవారుజామున చనిపోయి కనిపించాడు. అతడి శరీరంపై కాలిన గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ జి.సత్యనారాయణ, ఎస్‌ఐ వై.రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్కాడ్ రప్పించి విచారణ చేపట్టగా సమీపంలోని రైతు అశపు భీమరాజు పొలంలో అతడు మృతి చెందినట్టు గుర్తించారు. కొంతకాలంగా భీమరాజు పొలాన్ని దాడి రాము అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. అతడు విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడి, వాటి మాంసంతో వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో రాముతో పాటు గొర్లె వెంకన్న, ముత్తా దొరబాబు, చెన్నాడ సత్తిబాబు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతుడు చింతయ్య తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement