
సాక్షి, వనపర్తి: రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు లాభాపేక్షతో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. సదరు భూయజమానికి తెలియకుండానే.. అసలు నోటీసులు కూడా జారీ చేయకుండా.. కేవలం బయానా అగ్రిమెంట్ కాపీని ఆధారంగా చేసుకొని అతని భూమిని మరొకరి పేరుపై పట్టామార్పిడి(మ్యూటేషన్) చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నిబంధనలు ఎంత పక్కాగా పాటించారో. ఇలాంటి సంఘటన ఒకటి జిల్లాలోని ఖిల్లాఘనపురం మండలంలో వెలుగు చూసింది. ఈ విషయంపై బాధితుడు 2019 అగస్టు 19వ తేదిన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు.
భూమి కొనుగోలుకు కొంత బయానా..
జడ్చర్ల మండలం ఆలూరులో నివాసం ఉండే తెలుగు శ్రీనివాసులుకు ఖిల్లాఘనపురం మండలంలోని కమాలోద్దీన్‌పూర్‌లో కొంత భూమి ఉంది. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు మాట కుదుర్చుకున్నారు. మొత్తం భూమిని రూ.2.40 లక్షలకు విక్రయించేందుకు తెలుగు శ్రీనివాసులు సిద్ధమయ్యాడు. అగ్రిమెంటు చేసుకుని రూ.1.30 లక్షలు అడ్వాన్స్ (బయానా) ఇచ్చారు. మిగతా డబ్బులకు కొంత గడువు పెట్టుకున్నారు.
గడువు తీరుతున్నా డబ్బులు ఇవ్వకపోవటంతో భూమిని అమ్మిన తెలుగు శ్రీనివాసులును డబ్బుల కోసం అడగగా.. దాటవేస్తూ వచ్చారు. బయాన ఇచ్చిన వెంటనే భూమిని కబ్జాలోకి తీసుకున్న కొనుగోలు దారులు అధికారులను మచ్చిక చేసుకుని రహస్యంగా బయానా ఇచ్చిన భూమిని మొత్తం డబ్బులు చెల్లించకుండానే ముగ్గురి పేర్లపై మార్చారు.
కారణం రాయని అధికారులు
నిబంధనల ప్రకారం పట్టామార్పిడి చేసే సమయంలో తహసీల్దార్ కార్యాలయంలో ఒక ఫైల్ తయారు చేసి భూమిని విక్రయించిన వారికి నో టీసులు జారీ చేయాలి. వారికి పట్టామార్పిడి చేస్తున్నట్లు సమాచారం ఇచ్చి ముటేషన్ చేయా లి. పట్టామార్పిడి చేస్తున్నప్పుడు కొత్తగా భూ మిపై హక్కు పొందుతున్న వారికి అట్టి భూమి ఎలా వచ్చిందనే విషయాన్ని మ్యానువల్ రికా ర్డులో తప్పనిసరిగా.. రాయాల్సి ఉంటుంది. కానీ ఈ కేసు విషయంలో రికార్డులో ఎలాంటి వివరాలు రాయలేదు. కనీసం పట్టామార్పిడి చేసిన అధికారి సంతకం చేయలేదు.
ఈ ముటేషన్‌కు సంబంధించిన ఫైల్ నంబర్ వేయలేదు. గుడ్డిగా రూ.లక్షల విలువ చేసే భూమి హక్కులను అధికారులు ఇతరుల పేరుకు మార్చారు. దీంతో విషయం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో విషయం బయటకు పొక్కింది.
తప్పుల తడకగా అగ్రిమెంట్
భూమిని కొనుగోలు చేస్తున్నట్లు రాయించిన అగ్రిమెంట్‌లోనూ తప్పులు చాలా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంటు కోసం ఉపయోగించిన రూ.100 స్టాంప్ పేపర్‌ను 2014 నవంబర్ 29వ తేదీన కొనుగోలు చేశారు. కానీ అగ్రిమెంటు మాత్రం 2012 జూన్ 6వ తేదీన చేసినట్లు రాశారు. అలాంటి తప్పుల అగ్రిమెంటును ఆధారం చేసుకుని అ«ధికారులు విలువైన భూమి హక్కులను ఎలా మార్చారు అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.
న్యాయం చేయాలి
నా భూమిని సదరు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు కొద్ది మొత్తంలో మాత్రమే డబ్బులు ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వలేదు. రిజిస్టేషన్ చేయించుకోలేదు. అగ్రిమెంటు కాగితం ఆధారంగా పట్టామార్పిడి చేయించుకున్నారు. 2018 ఫిబ్రవరి వరకు నా పేరునే 1బీ ఉంది. తర్వాత మార్పులు చేసినట్లు తెలిసింది.
– తెలుగు శ్రీనివాసులు, భూ యజమాని
పరిశీలిస్తాం
పట్టామార్పిడి ఎలా చేశారనే విషయాన్ని రికార్డుల్లో పరిశీలిస్తాం. ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటాం. ఇటీవలే తహసీల్దార్‌గా వచ్చాను. ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
– వెంకటకృష్ణ,
తహసీల్దార్, ఖిల్లాఘనపురం.