మరికల్ శివారు పొలంలో నిర్మిస్తున్న నీటి నిల్వ గుంతలను పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి,మల్దకల్: రోజు రోజుకు ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటిపోతున్న తరుణంలో ప్రభుత్వం నీటి నిల్వ గుంతలకు ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ వ్యవసాయ పొలాల్లో నీటి నిల్వ గుంతల తవ్వకాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వ్యవసాయ పొలాల్లో నీటినిల్వ గుంతలను తవ్వుకోవడం ద్వారా భూగర్భజలాలు పెరగడంతో పాటు బోరుబావుల్లో నీటి లభ్యత ఉంటుంది. వీటి నిర్మాణాలపై ఉపాధి హామీ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామసభలు నిర్వహించి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా నీటి నిల్వ గుంతలను నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ వ్యవసాయ పొలాల్లో వాటి నిర్మాణాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో ప్రభుత్వం నీటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ పొలాల్లో వాటిని తవ్వుకునేందుకు ముందుకు వస్తున్నారు. కూలీలకు ఉపాధి పనులు దొరకడంతో పాటు రైతులకు నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేయడంతో రెండు విధాలా లబ్ధిపొందుతున్నారని ఉపాధి హామీ సిబ్బంది తెలియజేశారు.
గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి..
ముఖ్యంగా వీటి నిర్మాణాల కోసం అధికారులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రైతులకు వాటి నిర్మాణాలతో కలిగే ఉపయోగాలను వివరిస్తున్నారు. దీంతో రైతులు సైతం ముందుకు వచ్చి తమ పొలాల్లో నీటి నిల్వ గుంతలను తవ్వుకుని భూగర్భ జలాల పెంపునకు తమవంతు కృషి చేస్తున్నారు. మల్దకల్ మండలానికి మొత్తం ప్రభుత్వం 821 నీటి నిల్వ గుంతలు మంజూరు కాగా.. వాటిలో 30కు పైగా నిర్మాణ పనులు పూర్తి కాగా.. మరో 50 నీటి నిల్వ గుంతల పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.
నీటి నిల్వ గుంతల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.60 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు వాటి కొలతలను బట్టి ఆర్థిక సాయం అందించడంతో వాటి నిర్మాణాలను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే వ్యవసాయ పొలాల్లో పొలం చదునుచేసేందుకు, పొలం గెట్లపై ముళ్లచెట్ల తొలగింపు వంటి పనులను ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు నీటి నిల్వ గుంతలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడంతో వీటి నిర్మాణ పనులపై స్థానిక ఉపాధి హామీ సిబ్బంది సైతం వేగవంతం చేస్తున్నారు. మండలంలో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి నీటి నిల్వ గుంతలను వందశాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉపాధి ఏపీఓ శరత్‌బాబు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment